Bhadrachalam: మనం పుట్టిన తర్వాత.. పుట్టిన తేదీ, నక్షత్రం, రాశి వంటి వాటి ఆధారంగా పేర్లు పెడతారు. మన పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారం ప్రకారం గోత్రం జత చేస్తారు. మంచి కార్యమో, చెడు కార్యమో జరిగినప్పుడు అర్చకుడు అడిగినప్పుడు మన గోత్రం చెబుతాం. మన తండ్రి పేరు, మన కుటుంబీకుల పేర్లు కూడా చెబుతుంటాం. ఈ పేర్ల సరళి ఎప్పటికీ ఒకే తీరుగా ఉంటుంది. అంతేతప్ప గుడి, గుడి కి మారదు. మనుషులకే ఇలా ఉంటే.. ఇక దేవుడికి ఎలా ఉండాలి.. కానీ అదేం దురదృష్టమో తెలియదు గాని భద్రాచలం రాముడు విషయంలో అనేక పేర్లు వినిపిస్తున్నాయి. సీతారాములకు కొత్త గోత్రనామాలు అర్చకుల నోటి నుంచి వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన శ్రీ రామనవమి వేడుకల్లో రాముడి కళ్యాణానికి సంబంధించి అర్చకుల నోటి వెంట చిత్రమైన పేర్లు తెరపైకి రావడం మరోసారి వివాదానికి కారణమైంది..
వాస్తవానికి భద్రాచలం రాముడి ప్రవర, నామాన్ని మార్చేస్తున్నారనే వివాదం ఎప్పటినుంచో ఉంది. ఇటీవల జరిగిన శ్రీరామనవమి కళ్యాణ సమయంలో రామ నారాయణుడికి మాత్రమే పెళ్లి జరిపించారు తప్ప.. రామభద్రుడికి కానే కాదు. పైగా ఈ వ్యవహారం చిన్న జీయర్ స్వామి చెప్పినట్టు జరుగుతోందని కొంతమంది అర్చకులు అంతర్గతంగా వాపోతున్నారు. రామచంద్రుడిని లేదా రామభద్రుడిని రామ నారాయణుడిగా మార్చమని చెప్పింది ఎవరో ఆ అర్చకులకే తెలియాలి. రాముడి ప్రవర, సీతమ్మ తల్లి ప్రవర ఇష్టానుసారంగా చదవడం.. ఏ వైదిక ధర్మం కిందికి వస్తుందో ఆ అర్చకులకే అవగతం కావాలి.
రామచంద్రుడి దర్శనం కాగానే భద్రుడు “నమస్తే దేవ దేవేశ శంఖ చక్ర గదా ధర ధనుర్బాణ ధరానంత రామచంద్ర నమస్తుతే:” అంటూ స్తుతిస్తాడు. అతని తపస్సుకు మెచ్చి చేతులతో శంఖ, చక్ర, గదాదారుడిగా రామచంద్రుడు దర్శనమిస్తాడు. అక్కడిదాకా ఎందుకు తానిషా పరిపాలన కాలంలో భక్త రామదాసు సీతారామచంద్రస్వామి ఆలయాన్ని మాత్రమే నిర్మించాడు తప్ప.. శ్రీమన్నారాయణుడి ఆలయాన్ని కాదు. కానీ, అప్పట్లో భద్రుడికి రామచంద్రుడు నాలుగు చేతులతో దర్శనం ఇచ్చాడు కాబట్టి.. ఆయన రాముడు కాదు, ముమ్మాటికి నారాయణడే అని వైష్ణవ అర్చకులు కొత్త సంస్కృతిని తెరపైకి తీసుకొస్తున్నారు. రామచంద్రస్వామిగా భద్రాచలం రాముడిని పిలవడం పక్కనపెట్టి రామనారాయణుడు అనే పేరును తెరపైకి తీసుకొస్తున్నారు. పైగా అప్పట్లో చిన్న జీయర్ స్వామి శిష్యులు రాముడికి సంబంధించిన గోత్రాలు, ప్రవరలు పూర్తిగా మార్చేశారనే ఆరోపణలు ఉన్నాయి.
భద్రాచలంలో కొలువై ఉన్న రామచంద్రుడి గోత్రం వశిష్ట.. కానీ కొన్ని సంవత్సరాలుగా అచ్యుత అని పలుకుతున్నారు. దశరథ మహారాజు గోత్ర ప్రవరలు (నా భాగ, అజ, దశరథ) అని చెప్పడం పక్కనపెట్టి నారాయణుడి ప్రవరలు పలుకుతున్నారు. ఫలితంగా రాముడు కాస్త రామ నారాయణుడయ్యాడు. సీతమ్మ గోత్రం గౌతమ ప్రవరలు స్వర్ణ రోమ, హ్రస్వ రోమ, జనకుడు అని మాత్రమే అర్చకులు పలకాలి. కానీ సీతమ్మ గోత్రాన్ని సౌభాగ్య అని పండితులు సమూలంగా మార్చేశారు. నిజానికి వైష్ణవ మతం విష్ణు దేవుడిని ఆరాధించాలని సూచిస్తుంది. అంతేతప్ప శైవ, శాక్తేయ శాఖలను సర్వనాశనం చేయమని.. స్థానికంగా ఉన్న పద్ధతులను నిర్వీర్యం చేయాలని చెప్పదు. దీనిని సాక్షాత్తు రామానుజులు కూడా చెప్పి ఉండరు. మరి భద్రాచలం లో రాముడి విషయంలో స్థానిక సంప్రదాయాలకు ఎందుకు స్వస్తి పలుకుతున్నారో? అసలు వీరికి ఆ హక్కు ఎవరిచ్చారో.. తెలియాల్సి ఉంది. మరి దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా? లేకుంటే చిన్న జీయర్ స్వామి శిష్యులు చెప్పినట్టే వింటుందా? కాలమే సమాధానం చెప్పాలి.