TTD Laddu Controversy : తిరుమల లడ్డూల తయారీలో కల్తీ నెయ్యి వినియోగించడం దేశవ్యాప్తంగా కలకలం రేగింది. భక్తుల మనోభావాలను దెబ్బతీసింది. ఈ విషయంలో టిటిడితో పాటు ఏపీ ప్రభుత్వం కూడా సీరియస్ గా ఉంది. లడ్డు తయారీలో కల్తీ పదార్థాలు వాడకం అంశంపై టీటీడీ ఈవో శ్యామలరావు ఓ నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి అందించారు. శనివారం రాత్రి సీఎం చంద్రబాబుకు సమర్పించారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు, మంత్రులు, అధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. దీనిపై ఆదివారం పూర్తి నివేదికను టీటీడీ అధికారులు మరోసారి సమర్పిస్తారని సమాచారం. దీంతో ఈ నివేదికలో ఏం చెప్పారు? ఏ ఏ విషయాలను పొందుపరిచారు? అన్నది హాట్ టాపిక్ గా మారింది.
* అత్యవసర సమావేశం
తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు శనివారం ప్రత్యేకంగా సమావేశమైన సంగతి తెలిసిందే. ముఖ్యంగా టీటీడీ పవిత్రతను దెబ్బతీసేలా ఈ ఘటన జరిగినట్లు అభిప్రాయపడ్డారు. అందుకే ఆలయ సంప్రోక్షణ చేపట్టాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో తిరుమల అర్చకులు, ఆగమ సలహాదారులు, అధికారులు పాల్గొన్నారు. ఆదివారం మరోసారి విస్తృత సంప్రదింపుల తర్వాత సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహించాలని.. తిరుమల పవిత్రతను కాపాడే విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని టిటిడి అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు.
* రాజకీయ దుమారం
వైసిపి హయాంలో ఈ కల్తీ ఘటన జరగడంతో.. రాజకీయంగా కూడా దుమారం రేగుతోంది. దీనిపై వైసీపీ కౌంటర్ అటాక్ చేస్తోంది. ఇప్పటికే టీటీడీ చైర్మన్ గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి స్పందించారు. ఆరోపణలను ఖండించారు. జగన్ సైతం స్పందించి ఇది డైవర్షన్ పాలిటిక్స్ అని ఆరోపణలు చేశారు. మరోవైపు హైకోర్టును సైతం ఆశ్రయించారు. సిబిఐ దర్యాప్తునకు డిమాండ్ చేశారు. సోమవారం దీనిపై విచారణ జరగనుంది.
* ఆగమ పండితుల సూచనలు
అయితే ఇంతలో తిరుమల తిరుపతి దేవస్థానం పరంగా తీసుకోవాల్సిన చర్యలపై టీటీడీ అధికారులు దృష్టి పెట్టారు. జంతు నూనె వాడారు అన్న నేపథ్యంలో టీటీడీ పవిత్రతను కాపాడేందుకు ఆలయపరంగా తీసుకోవాల్సిన అంశాలపై ఆగమ పండితులు సూచనలు ఇచ్చారు. ఆలయ సంప్రోక్షణ అవసరమని భావించారు. ఇదే విషయాన్ని సీఎం చంద్రబాబుకు తెలిపారు టీటీడీ అధికారులు. ఈరోజు మరోసారి సమావేశమై సంప్రోక్షణ విషయం తేల్చనున్నారు.