TTD Laddu Controversy : చేతులు కాలాక ఆకులు.. టీటీడీ సంచలన నిర్ణయం!

చేతులు కాలాక ఆకులు పట్టినట్టు ఉంది టీటీడీ వ్యవహార శైలి. దేశంలోనే స్వచ్ఛమైన నెయ్యిగా గుర్తింపు పొందిన నందిని నెయ్యి సరఫరాను తిరిగి పునరుద్ధరించారు. గత రెండేళ్లుగా ఈ నెయ్యి సరఫరాను నిలిపివేసిన సంగతి తెలిసిందే.

Written By: Dharma, Updated On : September 22, 2024 10:40 am

Nandini Ghee

Follow us on

TTD Laddu Controversy : తిరుమల తిరుపతి దేవస్థానం దిద్దుబాటు చర్యలకు దిగింది. లడ్డూ వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యిలో జంతు నూనె కలిసింది అన్నది ప్రధాన ఆరోపణ. గుజరాత్ కు చెందిన అత్యున్నత ల్యాబ్ దీనిని నిర్ధారించింది. టిడిపి నేతలు బయటపెట్టారు. స్వయంగా సీఎం చంద్రబాబు సైతం వెల్లడించారు. దీంతో ఇది వివాదాస్పద అంశంగా మారింది. దేశవ్యాప్తంగా భక్తుల్లో ఆందోళన ప్రారంభమైంది. కేంద్ర మంత్రులు సైతం స్పందిస్తున్నారు. కేంద్రం సైతం సీరియస్ గా ఉంది. అయితే వైసిపి హయాంలోనే కల్తీ బాగోతం జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. అటు వైసీపీ నుంచి సైతం అటాక్ ప్రారంభమైంది. దీనిపై నిజాలు నిగ్గు తేల్చాలని ఆ పార్టీ ఏకంగా హైకోర్టును ఆశ్రయించింది. సోమవారం విచారణ జరగనుంది. దేశవ్యాప్తంగా అన్ని రంగాల ప్రముఖులు, పీఠాధిపతులు ఈ ఘటనపై స్పందిస్తున్నారు. ధార్మిక సంఘాలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. ఇటువంటి తరుణంలో తిరుమల తిరుపతి దేవస్థానం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. నిన్ననే అధికారులతో పాటు ఆగమ అర్చకులు అత్యవసరంగా సమావేశం అయ్యారు. కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

* సోషల్ మీడియాలో పోస్ట్
శ్రీవారి లడ్డూ ప్రసాదాల పవిత్రతను పునరుద్ధరించామంటూ ఎక్స్ వేదికగా ప్రకటించింది. గతంలో ఉపయోగించిన నెయ్యి, ప్రస్తుతం వినియోగించిన నెయ్యి వివరాలను వెల్లడించింది. నెయ్యి కల్తీ ని నిర్ధారించిన ల్యాబ్ రిపోర్టును పోస్ట్ చేసింది. అదేవిధంగా నందిని డైరీ నెయ్యి ల్యాబ్ రిపోర్టును కూడా పక్కనే పెట్టింది. లడ్డూ నాణ్యత పై భక్తుల్లో ఉన్న అపోహలు తొలగించేందుకు ప్రయత్నించింది. నాణ్యమైన నందిని నెయ్యి వాడకంతో మళ్ళీ తిరుమల లడ్డులుకు పవిత్రత చేకూరిందని పేర్కొంది. భక్తులకు తిరిగి నిజమైన నేతి లడ్డులా అనుభూతి లభిస్తోందని పేర్కొంది.

* 20 ఏళ్లుగా ఆ నెయ్యి
వాస్తవానికి లడ్డు కల్తీ ఆరోపణలకు ముందు.. అంటే ఓ 20 ఏళ్లుగా స్వచ్ఛమైన నందిని నెయ్యిని వాడేవారు. 2023లో నెయ్యి సరఫరాను నిలిపివేశారు. నందిని నెయ్యి సరఫరా నిలిచిపోవడంతోనే ఈ వివాదానికి కారణంగా తెలుస్తోంది. నందిని కి జాతీయస్థాయిలో గుర్తింపు ఉంది. తాజా వివాదంతో తిరుమలకు స్వచ్ఛమైన నందిని నెయ్యిని మాత్రమే వాడాలని ఏపీలోని కోటమి ప్రభుత్వం నిర్ణయించింది. కర్ణాటకకు చెందిన స్వచ్ఛమైన నందిని నెయ్యిని గత 20 ఏళ్లుగా లడ్డూల తయారీలో వాడుతున్నారు.

* రెండేళ్ల కిందట నిలిపివేత
2023లో నందిని నెయ్యి సరఫరాను నిలిపివేశారు. ధర ఎక్కువగా ఉండడంతో అప్పట్లో ఈ నిర్ణయం తీసుకున్నారు. 2022 వరకు 5 టన్నుల నెయ్యిని కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ టీటీడీకి సరఫరా చేసింది. ఈ ఫెడరేషన్ కు చెందినదే నందిని నెయ్యి. జాతీయస్థాయిలో కూడా స్వచ్ఛమైన నెయ్యికి చిరునామా గా మారింది కేఎంఎఫ్. కేవలం అధిక ధర ఉందని కారణం చూపుతూ వైసిపి ప్రభుత్వం నందిని నెయ్యి టెండర్ను తిరస్కరించింది. అటు తరువాత నెయ్యిలో కల్తీ జరిగినట్లు తాజాగా నిర్ధారణ అయింది. దీంతో టీటీడీ చర్యలకు ఉపక్రమించింది.