Manchu Mohanbabu : మంచు మోహన్ బాబు చంద్రబాబుకు దగ్గరవుతున్నారా? టిడిపి అధినేత అంటేనే కసుబుస్సులాడే ఆయన ఇప్పుడు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారా? అందుకే సానుకూలంగా మాట్లాడుతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. గతంలో చంద్రబాబు విషయంలో మోహన్ బాబు అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. చంద్రబాబుతో తాను సమకాలీడునని.. తమ మధ్య స్నేహం ఉండేదని.. కానీ ఆ స్నేహాన్ని చంద్రబాబు దుర్వినియోగం చేశారంటూ తీవ్ర స్థాయిలో కామెంట్స్ చేశారు. టిడిపిలో ఉన్న తనను మోసగించారని కూడా ఆరోపణలు చేశారు. టిడిపి ప్రభుత్వ హయాంలో తన శ్రీ విద్యానికేతన్ విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ కోసం నిరసనకు సైతం దిగారు. 2019 ఎన్నికలకు ముందు అప్పటి టిడిపి ప్రభుత్వం పై వ్యతిరేకత వచ్చేందుకు అదొక కారణంగా మారింది. అంతటితో ఆగకుండా ఆ ఎన్నికల్లో వైసీపీకి మద్దతుగా మోహన్ బాబు ప్రచారం కూడా చేశారు. చంద్రబాబు పై వ్యతిరేకంగా కామెంట్లు కూడా చేశారు. ఆ ఎన్నికల్లో వైసిపి అధికారంలోకి వచ్చింది. కానీ మోహన్ బాబు కు ఎటువంటి గుర్తింపు లభించలేదు. కనీసం జగన్ పట్టించుకోలేదు. అప్పట్లో వైసీపీకి మద్దతుగా నిలిచిన 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి, పోసాని కృష్ణ మురళి, అలీకి పదవులు దక్కాయి. కానీ మోహన్ బాబు విషయంలో మాత్రం ఎటువంటి పదవులు ప్రకటించలేదు జగన్. అప్పటినుంచి వైసీపీకి, జగన్ కు అంటి ముట్టనట్టుగా ఉన్నారు మోహన్ బాబు.
* ఎన్నికలకు ముందు కలయిక
ఎన్నికలకు ముందు చంద్రబాబును మోహన్ బాబు ప్రత్యేకంగా కలిశారు. టిడిపిలో చేరతారని అంత ప్రచారం జరిగింది. అయితే అటువంటిదేమీ లేకుండా పోయింది. మోహన్ బాబు రెండో కుమారుడు మనోజ్.. టిడిపి నేత భూమా నాగిరెడ్డి కుమార్తెను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ వివాహానికి సంబంధించి విషయాలను తెలుసుకునేందుకు, సలహా తీసుకునేందుకు చంద్రబాబును కలిసినట్లు ప్రచారం జరిగింది. ఆ సందర్భంలో చంద్రబాబు విషయంలో మోహన్ బాబు సానుకూలంగా మాట్లాడారు. తనకు చంద్రబాబు మంచి మిత్రుడు అని.. ఆయనకు అంతా మంచే జరగాలని ఆకాంక్షించారు. కానీ తెలుగుదేశం పార్టీలో చేరలేదు. టిడిపికి మద్దతుగా ప్రచారం చేయలేదు. అలాగని వైసీపీ విషయంలో కూడా ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు.
* తాజాగా స్పందన
ఇప్పుడు తాజాగా తిరుమల లడ్డు వివాదం పై మోహన్ బాబు స్పందించారు. ఒక భక్తుడిగా తనకు ఎంతో బాధ కలిగించిందని వ్యాఖ్యానించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా నా ఆత్మీయుడు, నా మిత్రుడు అంటూ చంద్రబాబును ప్రస్తావించారు మోహన్ బాబు. అంతటి తోక ఆగకుండా ఈ కలియుగ దైవం శ్రీనివాసుని ఆశీస్సులు నా మిత్రుడు అందుకొని నూరేళ్లు చల్లగా ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. దీంతో చంద్రబాబు విషయంలో మోహన్ బాబు యూటర్న్ తీసుకున్నట్లు అర్థమవుతోంది. గతంలో విమర్శలు చేయగా.. ఇప్పుడు చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తుతుండడం విశేషం.
* విష్ణు సైతం
అటు మోహన్ బాబు తనయుడు, మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ మా అధ్యక్షుడు మంచు విష్ణు కూడా స్పందించారు. లడ్డు కల్తీ వ్యవహారంపై చర్యలు తీసుకుంటున్న ఏపీ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారు. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై నటుడు ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. కౌంటర్ ఇచ్చారు. ఈ విషయంలో మీరు ఎందుకు అనవసర భయాలను వ్యాపింప చేస్తున్నారని.. జాతీయస్థాయిలో చర్చించుకునేలా చేస్తున్నారని పవన్ ను ప్రకాష్ రాజ్ ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రకాష్ రాజ్ కు విష్ణు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మొత్తానికైతే మంచు కుటుంబం టిడిపి కూటమి ప్రభుత్వానికి మద్దతు ప్రకటించడంతో కొత్త సమీకరణలకు దారి తీసే అవకాశం ఉంది.