Shubha Muhurtham : అద్భుతమైన మూహూర్తం.. ఒక్కటవుతున్న లక్షల జంటలు.. ఈనెల మంచి ముహూర్తాలివీ..

పెళ్లికి భారతీయ సంస్కృతిలో మంచి విలువ, గుర్తింపు ఉంది. అందులో తెలుగింటి పెళ్లి మరీ ప్రత్యేకం. ఐదు రోజుల వేడుక కోసం కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు హాజరై వధూవరులను ఆశీర్వదించే సంస్కృతి మనది. ఎన్నో కుటుంబాలకు ఉపాధి కల్పించే కార్యక్రమం కూడా.

Written By: Raj Shekar, Updated On : August 20, 2024 1:36 pm

Shubha Muhurthas in this month

Follow us on

Shubha Muhurtham  : పెళ్లి ప్రతి ఒక్కరి జీవితంలో మరపురాని అనుభూతి. వైవాహిక జీవితంలో అడుగు పెడుతున్నవేళ ఆ ఆనందమే వేరు. బంధు, మిత్రులు, శ్రేయాభిలాషులు అంతా ఒకచోటకు చేరిన సందర్భంగా.. వివాహ వేదికపై మూడు ముళ్లు వేసే క్షణాలు జీవితంలో మరుపురానివిగా మిగిలిపోతాయి. పెళ్లి కుదరడం ఒక ఎత్తు… మంచి ముహూర్తం దొరకడం మరో ఎత్తు. ముహుర్తం కోసం నెలల తరబడి వేచిచూసేవాళ్లు ఎందరో ఉంటారు. మంచి ముహుర్తం ఉందంటే చాలు.. ఆరోజు లెక్కలేనన్ని పెళ్లిళ్లు జరుగుతాయి. ప్రస్తుతం శ్రావణ మాసం. రెండు నెలలుగా మూఢం రావడంతో పెళ్లిళ్లు జరుగలేదు. ప్రస్తుతం మంచి ముహూర్తాలు వచ్చాయి. పెళ్లిళ్లు జరుగుతున్నాయి. తాజాగా పౌర్ణమి ఇంకేముంది మంచి ముహుర్తంలో ఒకటయ్యేందుకు లక్షల జంటలు రెడీ అయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో సోమవారం(ఆగస్టు 19న) ఒక్కరోజే లక్షకు పైగా పెళ్లిళ్లు జరిగాయి. ఎక్కడ చూసినా పెళ్లి సందడే. కళ్యాణ మండపాలు కిటకిటలాడాయి. క్యాటరింగ్‌ వాళ్లకు చేతినిండా పనే. శ్రావణ మాసం వెళ్లిందంటే మళ్లీ పెళ్లి ముహుర్తాల కోసం రెండు నెలలు ఆగాల్సిందే. అందుకే శ్రావణ మాసంలో ముహూర్తాలకు మంచి డిమాండ్‌ ఏర్పడింది. ఆగస్టు 8న తేదీన మొదలైన పెళ్లి ముహూర్తాలు.. ఈనెల 28వ తేదీ వరకు కొనసాగనున్నాయి. 28 తర్వాత మంచి ముహుర్తాలు లేకపోవడంతో ఈలోపే ఒక్కటయ్యేందుకు జంటలు రెడీ అవుతున్నాయి.

మరో నాలుగు అద్భుత ముహూర్తాలు..
ఆగస్టు 19తోపాటు… 22,23,24,28 తేదీల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయని ³ండితులు చెబుతున్నారు. సోమవారం ఒక్కరోజే లక్షకు పైగా జంటలు ఒక్కటయ్యాయి. వైవాహికబంధంలోకి అడుగు పెట్టాయి. ఈనెల 22, 23, 24, 28 తేదీల్లో సైతం అదే స్థాయిలో పెళ్లిళ్లు జరగనున్నాయి. పెళ్లిళ్ల కోసం కొన్ని నెలల ముందే కళ్యాణ మండపాలన్నీ బుక్‌ అయిపోయాయి. ఈనెల 28వ తేదీ వరకు తెలుగు రాష్ట్రాల్లోని కళ్యాణ మండపాలు ఖాళీ లేవట. ఇక కళ్యాణ మండపాలు దొరకకపోయినా.. ముహూర్తం మిస్‌ చేసుకోకూడదనే ఉద్దేశంతో కొందరు ఇళ్లు, గుడిలో పెళ్లిళ్లకు ఏర్పాట్లు చేసుకుంటున్నారట. కొన్ని కళ్యాణ మండపాల్లో అయితే గంటల లెక్కన అద్దెకు ఇచ్చారట. ఉదయం ఒకటి, మధ్యాహ్నం ఒకటి, రాత్రి మరొకటి చొప్పున.. రోజుకు రెండు నుంచి మూడు పెళ్లిళ్లకు కళ్యాణ మండపాలు బుక్‌ అయినట్లు నిర్వహకులు చెబుతున్నారు.

చేతి నిండా పని..
ఇక శ్రావణ ముహూర్తాలు కుదరడంతో ఎక్కువ సంఖ్యలో పెళ్లిళ్లు జరుగుతున్న వేళ పురోహితులకు, వంట వారికి చేతినిండా పని దొరకడంతోపాటు.. వస్త్ర దుకాణాలు, పూల దుకాణాలు జనంతో కళకళలాడుతున్నాయి. ఇక ఆభరణాల దుకాణాల నుంచి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇదే మంచి టైమ్‌ అన్నట్లుగా పూల ధరలకు రెక్కలు వచ్చాయట. గతంలో మూర రూ.20కు దొరికే మల్లెపూలు ప్రస్తుతం రూ.50 నుంచి రూ.100 పలుకుతుందట. మొత్తానికి మంచి ముహుర్తం కావడంతో సోమవారం ఒక్కరోజు దాదాపు లక్ష జంటలు ఒకటి కాబోతున్నాయి.

జోరుగా వ్యాపారం..
పెళ్లిళ్ల నేపథ్యంలో వ్యాపారం కూడా ఊపందుకుంది. వస్త్రాలు, బంగారం, కూరగాయలు, పూలు, పండ్ల కొనుగోళ్లు ఊపందుకున్నాయి. మాసం, మద్యం విక్రయాలు కూడా జోరుగా సాగుతున్నాయి. ముఖ్యంగా వస్త్ర దుకాణాలు ఇప్పటికే శ్రావణం నేపథ్యంలో రద్దీగా ఉండగా, పెళ్లిళ్లు కుదరడంతో వ్యాపారం ఊపందుకుంది. ఇక బంగారం అమ్మకాలు కూడా జోరందుకున్నాయి. ధర కాస్త అటూ ఇటుగా ఉన్నప్పటికీ అమ్మకాలు ఊపందుకున్నాయి. తెలుగింటి పెళ్లిలో అన్ని కులాలకు ప్రాధాన్యం ఉంటుంది. అందుకే వ్యాపారాలతోపాటు కుమ్మరి, కమ్మరి, విశ్వబ్రాహ్మణ, నాయీబ్రాహ్మణ, బ్యాండు మేళం, బ్రాహ్మణులు.. ఇలా అన్ని సామాజిక వర్గాలకు వివాహంతో సంబంధం ఉంటుంది.