Sri Ram Navami: తెలుగు సంవత్సరం ప్రకారం కొత్త ఏడాదిలో తొలి పండుగ ఉగాది. ఈ వేడుక జరిగినా 9 రోజులకు మరో పండుగ రాబోతోంది. అదే శ్రీరామనవమి. తెలుగు క్యాలెండర్ ప్రకారం చైత్రమాసంలో తొమ్మిదవ రోజున శ్రీరామనవమిని నిర్వహిస్తారు. 2025 ఏప్రిల్ 6న శ్రీరామనవమిని జరుపుకునేందుకు భక్తులు సిద్ధమవుతున్నారు. శ్రీరామనవమి రోజున రాముడు, సీత కళ్యాణం.. మరుసటి రోజు రాముడి పట్టాభిషేకం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాలకు మధ్యలో ఉన్న భద్రాద్రి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. అలాగే ఇతర ఆలయాల్లోనూ కళ్యాణ శోభ సంతరించుకుంటుంది. అయితే శ్రీరామనవమి రోజు ఇంట్లోనూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అయితే ఆ పూజ ఎలా చేయడం వల్ల ఫలితం ఉంటుంది? అందుకోసం ఏం చేయాలి?
Also Read : శ్రీరామనవమి రోజున ఇలా చేస్తే అదృష్టం మీ వెంటే..
శ్రీరాముడు అంటే శ్రీమహావిష్ణువు. ఆ స్వామి అనుగ్రహం కోసం ఎన్నో రకాల పూజలు చేసిన కొందరికి ఫలితం ఉండదు. ఎందుకంటే కొందరి పూజా విధానంలో పొరపాట్లు చేస్తూ ఉంటారు. అయితే శ్రీరాముడి పూజ విధానం సరైన మార్గంలో చేయడం వల్ల స్వామివారి అనుగ్రహం ఉంటుందని అంటున్నారు. శ్రీరామనవమి రోజు ఇంట్లో పూజ చేసేవారు ఎలా చేయాలంటే?
ఈ రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత గంగాజలంతో స్నానమాచరించి కొత్త దుస్తులు ధరించాలి. అయితే ఇవి పసుపు రంగులో ఉండడం వల్ల సుభాన్ని కలిగిస్తాయి. పూజా మందిరంలో ప్రత్యేకంగా ఒక పీటను ఏర్పాటు చేసి దానిపై కొత్త వస్త్రాన్ని ఉంచాలి. కొన్ని బియ్యం పోసి వాటిపై శ్రీరాముడి చిత్రపటం లేదా విగ్రహాన్ని ప్రతిష్టించుకోవాలి. అయితే ఇక్కడ సీతమ్మ వారి విగ్రహం లేదా సీతారాములు కలిసి ఉన్న చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలి. చిత్రపటం అయితే గంధంతో అలంకరించుకోవాలి.
ముందుగా దీని ఎదుట దీపాన్ని వెలిగించాలి. శ్రీరాముడి పంచాలోహ విగ్రహాలు ఉన్నట్లయితే వాటిని పంచామృతాలతో అభిషేకం నిర్వహించాలి. అయితే ఈ సమయంలో ఎటువంటి చెడు శబ్దాలు వినకుండా శ్రీరాముని కి సంబంధించిన భక్తి గీతాలు వింటూ ఉండాలి. ఆ తర్వాత పూలతో విగ్రహాలు లేదా చిత్రపటాలను అలంకరించాలి. చివరగా వడపప్పు, పానకం ప్రసాదాలను చిత్రపటాల వద్ద ఉంచాలి. ఇప్పుడు శ్రీరామునికి సంబంధించిన స్తోత్రాలను చదవాలి. ఇవి పూర్తయిన తర్వాత హారతి ఇచ్చి నైవేద్యాన్ని సమర్పించాలి. అనంతరం కుటుంబ సభ్యులకు తీర్థ ప్రసాదాలను అందజేయాలి. ఈరోజు ఉపవాసం ఉండడం వల్ల స్వామివారి అనుగ్రహం పొందవచ్చని అంటున్నారు.
దగ్గరలోని శ్రీరామ ఆలయాలు ఉంటే కళ్యాణాన్ని తిలకించి శ్రీరామనమ జపం చేయాలి. అలాగే ఆలయాల్లో అందించే ప్రసాదాలను తీసుకోవాలి. ఇలా రోజు మొత్తం శ్రీరామ జపంలో ఉండడం వల్ల స్వామివారి అనుగ్రహం తప్పకుండా లభిస్తుందని చెబుతున్నారు.అయితే ఇంట్లో పూజ చేసుకోవడానికి అనువైన వాతావరణం లేకపోతే ఆలయాలకు వెళ్లి స్వామివారి కల్యాణాన్ని తిలకించి అనుభూతి చెందవచ్చని పండితులు అంటున్నారు. సీతారాముల కళ్యాణం జరిగిన మరుసటి రోజు శ్రీరామ పట్టాభిషేకం కూడా నిర్వహిస్తారు. ఈరోజు కూడా ఆలయాలను సందర్శించి స్వామివారి అనుగ్రహం పొందాలని చెబుతున్నారు.