Mega Family: సినీ,పొలిటికల్ రంగాల్లో మెగా కుటుంబానికి ( mega family) ప్రత్యేక స్థానం. సినీరంగంలో ఆ కుటుంబం అగ్రస్థానంలో నిలిచింది. పొలిటికల్ గాను గుర్తింపు సాధించింది. సినీ పరిశ్రమలో ఏ కుటుంబానికి అవకాశం లేని విధంగా.. మెగా కుటుంబం నుంచి ముగ్గురు అన్నదమ్ములు రాజకీయంగా పదవులు అలంకరించడం నిజంగా విశేషం. తొలుత మెగాస్టార్ చిరంజీవి రాజ్యసభ సభ్యుడయ్యారు. తరువాత కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్నారు. అటు తరువాత ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యే అయ్యారు. ఈ రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పుడు తాజాగా మెగా బ్రదర్ నాగబాబు ఎమ్మెల్సీ అయ్యారు. త్వరలో మంత్రి కూడా కాబోతున్నారు. ఈ పరిణామాలు నిజంగా మెగా కుటుంబానికి ఆనందాన్ని ఇచ్చేవే.
Also Read: పవన్ నీడలా వెంటాడుతున్న ప్రకాష్ రాజ్.. తాజాగా సంచలన ట్వీట్!
* సినీ రంగంలో రారాజు..
సినీరంగంలోకి సోలోగా ఎంట్రీ ఇచ్చారు చిరంజీవి( megastar Chiranjeevi). అనతి కాలంలోనే తనకంటూ ఒక ముద్ర చాటుకున్నారు. సినీ రంగంలో అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు. మెగాస్టార్ గా వెండితెరను ఉర్రూతలూగించారు. కోట్లాదిమంది అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. అటు తరువాత తన నటన వారసుడిగా ఎంట్రీ ఇచ్చారు పవన్ కళ్యాణ్. చేసినవి తక్కువ సినిమాలు అయినా.. జయ అపజయాలతో సంబంధం లేకుండా.. తనకంటూ ఒక స్టార్ డం ఏర్పాటు చేసుకున్నారు పవన్ కళ్యాణ్. అటు తరువాత మెగా కాంపౌండ్ వాల్ నుంచి రామ్ చరణ్, వరుణ్ తేజ్, వైష్ణవ తేజ్.. ఇలా ఎంతోమంది హీరోలు వచ్చారు. మొన్నటివరకు ఇదే కాంపౌండ్ వాల్ గా భావించారు అల్లు ఫ్యామిలీని. కానీ అల్లు అర్జున్ ఐకానిక్ స్టార్ కావడంతో ఆయనకంటూ ఒక ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వీరంతా చిరంజీవిని మార్గదర్శకంగా చేసుకుని వచ్చిన వారే.
* పిఆర్పి గణనీయమైన ఓట్లు
అయితే నందమూరి తారక రామారావు మాదిరిగా పార్టీ ఏర్పాటు చేసి అధికారంలోకి వస్తానని భావించారు మెగాస్టార్ చిరంజీవి. 2009లో ప్రజారాజ్యం( Praja Rajyam) పార్టీని ఏర్పాటు చేశారు. ఉమ్మడి ఏపీలో పోటీ చేశారు. ఓట్ల పరంగా 60 లక్షల ఓట్లను సాధించారు. కానీ సీట్ల పరంగా 18 స్థానాలకే పరిమితం అయ్యారు. కొద్ది రోజులకే ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. తద్వారా కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజ్యసభకు ఎంపికయ్యారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రి అయ్యారు. అలా తన పొలిటికల్ కెరీర్ ను ముగించారు చిరంజీవి.
* 2014లో జనసేన ఏర్పాటు..
ప్రజారాజ్యం పార్టీ నేర్పిన గుణపాఠాల నేపథ్యంలో 2014లో జనసేన ను ఏర్పాటు చేశారు పవన్ కళ్యాణ్( Pawan Kalyan). ఆ ఎన్నికల్లో పోటీ చేయకుండా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి, కేంద్రంలో బిజెపికి మద్దతు ఇచ్చారు. రెండు చోట్ల పవన్ మద్దతు ఇచ్చిన పార్టీలు అధికారంలోకి వచ్చాయి. 2019లో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వామపక్షాలతో పాటు బీఎస్పీతో సర్దుబాటు చేసుకున్నారు పవన్. కానీ రాష్ట్రవ్యాప్తంగా పోటీ చేసి ఒక్కచోట మాత్రమే గెలిచారు. తాను పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయారు పవన్. అయినా సరే తనదైన శైలిలో పార్టీని నడిపారు. 2024 ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవడం ద్వారా శత శాతం ఫలితాలను సాధించారు. ఈ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అయ్యారు. టిడిపి కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా మారారు.
* ఎమ్మెల్సీగా నాగబాబు..
అయితే ఇప్పుడు మెగా బ్రదర్ నాగబాబు( Nagababu ) సైతం ఎమ్మెల్సీగా మారారు. ప్రజారాజ్యం పార్టీ సమయంలో అన్నయ్య చిరంజీవికి అండగా నిలబడ్డారు నాగబాబు. కానీ ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనం కావడంతో సైలెంట్ అయ్యారు. మళ్లీ మరో సోదరుడు పవన్ కళ్యాణ్ జనసేన ఏర్పాటు చేయడంతో ఆ పార్టీలో చేరి కీలక నాయకుడిగా ఎదిగారు. 2019లో నరసాపురం ఎంపీ స్థానానికి జనసేన అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో సైతం ఎంపీగా పోటీ చేసేందుకు సన్నాహాలు చేసుకున్నారు. కానీ పొత్తులో భాగంగా తాను ఆశించిన సీటు దక్కకపోయేసరికి ప్రచార బాధ్యతలు తీసుకున్నారు. పొత్తు సమన్వయానికి కృషి చేశారు. అయితే కొద్ది రోజుల కిందట రాజ్యసభ పదవుల ఎంపిక విషయంలో నాగబాబు పేరు తెరపైకి వచ్చి.. చివరి నిమిషంలో దక్కకుండా పోయింది. దీంతో సీఎం చంద్రబాబు స్పందించారు. నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటామని ప్రకటించారు. అందుకు తగ్గట్టుగానే తాజాగా ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. త్వరలో ఆయనకు మంత్రి పదవి ఖాయం. దీంతో మెగా ఫ్యామిలీ సంబరాల్లో మునిగి తేలిపోయింది.