Karthika Masam 2025 Last Day: పరమ పవిత్రంగా భావించే కార్తీక మాసంలో భక్తులు శివకేశవులకు విశేష పూజలు చేస్తూ ఉంటారు. ఇరువురికి ఇష్టమైన ఈ మాసం మొత్తం ఆధ్యాత్మిక వాతావరణంగా కనిపిస్తుంది. పుణ్య స్థానాలు.. దీప దానాలు. అభిషేకాలు.. అలంకరణలు ఇలా అన్ని రకాల ఆధ్యాత్మిక వాతావరణం కనిపించి మనసుకు ఉల్లాసాన్ని ఇస్తుంది. అయితే కార్తీకమాసంలో పూజ చేయడానికి కొంతమందికి వీలు కుదరదు. దీంతో మరో రోజుకు వాయిదా వేసుకుంటారు. కార్తీక మాసంలో కొన్ని ప్రత్యేక దినాల్లో పూజలు చేయడం వల్ల విశేష ఫలితాలు జరుగుతాయని హిందూ పురాణం తెలుపుతుంది. వీటిలో కార్తీక మాసం మొదటి సోమవారం లేదా చివరి సోమవారం పూజలు చేయడం వల్ల శివుడి అనుగ్రహం ఉంటుంది. మరి శివుడిని ప్రసన్నం చేసుకోవాలంటే ఎలాంటి పూజలు చేయాలంటే?
నవంబర్ 20వ తేదీ అమావాస్య తో కార్తీక మాసం మూయనుంది. దీంతో 17వ తేదీన చివరి సోమవారం కావడంతో ఈరోజు శివ దర్శనం చేసుకోవడం వల్ల ఎన్నో విశేష ఫలితాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు. ఈరోజు శివ దర్శనం దర్శించుకోవడమే కాకుండా కొన్ని రకాల పూజలు చేయవచ్చు అని అంటున్నారు. ఉదయమే స్నానం చేసి ఆ తర్వాత ఇంటిని శుభ్రం చేసిన తర్వాత గుడికి వెళ్ళాలి. శివుడికి అభిషేకం అంటే చాలా ఇష్టం. అందువల్ల నీరు, పాలు, పంచామృతం వంటి పదార్థాలతో అభిషేకం చేయడం వల్ల శివానుగ్రహం పొందవచ్చు. అలాగే ఈరోజు బ్రాహ్మణులకు దీపదానం చేయడం వల్ల కూడా శివుడు సంతోషిస్తాడని అంటారు. కార్తీక మాసం చివరి సోమవారం కేవలం శివ దర్శనం చేసుకున్నా కూడా శివుడి అనుగ్రహం ఉంటుందని అంటుంటారు.
అలాగే కార్తీక పౌర్ణమి రోజున 365 వత్తులు కాల్చలేనివారు ఈరోజు శివాలయంలో కాల్చడం వల్ల అదే రోజు లభించే పుణ్యం లభిస్తుంది. ఇక ఈరోజు ఉపవాసం ఉండి ఇతరులకు వస్త్ర దానం చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. సాధారణ సోమవారం అనగానే గోవులకు ఇష్టమైన రోజు. అలాంటిది కార్తీక మాసం చివరి సోమవారం రోజున గోవులకు ఆహారం ఇవ్వడం వల్ల శివుడు సంతోషిస్తాడు. గోవులో సకల దేవతలు ఉంటాయి కాబట్టి.. ఈరోజు వాటికి ఆహారం ఇవ్వడం వల్ల దేవతల అనుగ్రహం పొందవచ్చు. ఈరోజు ఇతరులకు అన్నదానం చేయడం వల్ల కూడా విశేషమైన ఫలితాలను పొందుతారు.
ఇలా కార్తిక మాసం చివరి సోమవారం రోజున ఈ పనులు చేయడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు. అయితే ఈరోజు శివారాధనలో ఉన్నవారు తప్పులు చేయకుండా ఉండాలి. ఎవరిని హింసించకుండా .. సాత్విక భోజనం చేయడానికి మాత్రమే ప్రయత్నించాలి. అంతేకాకుండా పరుష వ్యాఖ్యలతో ఇతరులను నిందించరాదు.