Idols Vastu benefits: హిందూ సాంప్రదాయం ప్రకారం దేవుళ్ళ అనుగ్రహం పొందాలంటే విగ్రహ పూజ తప్పనిసరి చేయాలని కొందరు పండితులు చెబుతూ ఉంటారు. అయితే విగ్రహాలు అందుబాటులో లేని వారు చిత్రపటాలను పెట్టి కూడా పూజలు చేయవచ్చని అంటున్నారు. అయితే కొందరు తెలిసో తెలియకో దేవతామూర్తుల విగ్రహాలను కొనుగోలు చేసి ఇంట్లో ఉంచుకుంటారు. ఇలా విగ్రహాలను కొనుగోలు చేసిన తర్వాత వాటికి ఎలాంటి పూజలు చేయకుండా ఉంచరాదని పండితులు చెబుతున్నారు. అయితే కొందరు మాత్రం రెండు అంగుళాల సైజు కంటే తక్కువగా ఉంటే వాటికి పూజలు చేయాల్సిన అవసరం లేదని అంటున్నారు. అసలు ఇంట్లో విగ్రహాలు ఉంటే పూజలు తప్పనిసరిగా చేయాలా? ఎంత సైజులో ఉన్న విగ్రహాలకు పూజలు చేయాల్సి ఉంటుంది? ఒకవేళ చేయకపోతే ఏం జరుగుతుంది?
దైవానుగ్రహం పొందడానికి రెండు మార్గాలు ఉంటాయి. వీటిలో ఒకటి దైవ మంత్రాలు జపించడం ద్వారా.. మరొకటి విగ్రహ పూజ చేయడం ద్వారా.. అయితే ఒకప్పుడు ఋషులు, మహర్షులు, పండితులు ఎంతో నిగ్రహంతో ఉండి పూజలు, వ్రతాలు చేసి దైవమంత్రాలను పఠిస్తూ దైవానుగ్రహం పొందేవారు. కానీ ప్రస్తుత కాలంలో ఇలా చేయడం సాధ్యం కాదు. అందుకే విగ్రహ పూజ ద్వారా దైవానుగ్రహం పొందాలని పండితులు చెబుతున్నారు. విగ్రహ పూజ ద్వారా దేవుళ్ళ ఆశీస్సులు పొందాలంటే ఇంట్లో విగ్రహాలు లేదా చిత్రపటాలు ఉండాలి. అయితే కొందరు ఎంతో ఇష్టంగా విగ్రహాలను కొనుగోలు చేసి ఇంటికి తెచ్చుకుంటారు. కానీ ఇలా తెచ్చుకున్న విగ్రహాలను నిర్లక్ష్యంగా వదిలేస్తారు. ఇలా విగ్రహాలను నిర్లక్ష్యంగా వదిలేయడం వల్ల శుభాలకంటే ఆ శుభాలే ఎక్కువగా జరుగుతూ ఉంటాయి.
హిందూ ధర్మం ప్రకారం బంగారం, వెండి, ఇత్తడి, కంచు విగ్రహాలను ఇంటికి తీసుకు రావచ్చు. అయితే ఇంట్లో విగ్రహాలు ఉన్నవారు పూజ చేయాల్సిన అవసరం ఉంది. అంగుష్టం అంటే బొటన వేలు కంటే చిన్నవిగా ఉన్నవాటికి మినహా మిగతా విగ్రహాలకు కచ్చితంగా పూజలు చేయాల్సి ఉంటుంది. బొటన వేలు కంటే చిన్నవిగా ఉన్నవి పూజ గదిలో ఉంచుకోవచ్చు. కానీ అంతకంటే పెద్దగా ఉన్న విగ్రహాలను పూజ గదిలో కాకుండా ఇతర ప్రత్యేకమైన ప్రదేశాల్లో పెట్టి మంత్రాలతో, ఉపచారాలతో నియమ నిబంధనలతో పూజలు చేయాలి. అలా చేయకపోతే తగిన ఫలితం లభించదు అని పండితులు తెలుపుతున్నారు. దేవాలయాల్లో విగ్రహాలకు ప్రాణ ప్రతిష్ట చేసి ఆ తర్వాత ఉద్వాసన చేసే సంప్రదాయాన్ని పాటిస్తూ వస్తున్నారు. అయితే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వంటి విగ్రహాలను అలంకరణ మాత్రమే ఉపయోగించుకోవాలి. వీటికి ప్రత్యేకంగా పూజలు చేయకూడదు. లోహానికి సంబంధించిన అంటే బంగారం, వెండి, కంచు వంటివి వాటికి మాత్రం ప్రత్యేకమైన పూజలు నిర్వహించాలి.