Bonalu: బోనాల పండుగ తేదీలు ఖరారు.. ఎప్పటి నుంచంటే..

జూలై 7 నుంచి బోనాల పండుగ ప్రారంభం అవుతుంది. 7వ తేదీన గోల్కొండ బోనాలతో పండుగ ప్రారంభమై జూలై 29న అంబారీ ఊరేగింపుతో ఉత్సవం ముగుస్తుంది.

Written By: Raj Shekar, Updated On : June 16, 2024 2:59 pm

Bonalu

Follow us on

Bonalu: తెలంగాణ రాష్ట్ర పండుగల్లో ఒకటి అయినా బోనాల పండుగను ఈసారి ఘనంగా నిర్వహించేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పండుగ నిర్వహణలో తన ప్రత్యేకత చాటుకోవాలని చూస్తోంది. ఈ క్రమంలో పండుగ నిర్వహించే తేదీలను నెల ముందు ప్రభుత్వం ఖరారు చేసింది.

జూలై 7 నుంచి..
జూలై 7 నుంచి బోనాల పండుగ ప్రారంభం అవుతుంది. 7వ తేదీన గోల్కొండ బోనాలతో పండుగ ప్రారంభమై జూలై 29న అంబారీ ఊరేగింపుతో ఉత్సవం ముగుస్తుంది. ఈమేరకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రకటన చేశారు. జూలై 21న సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాలు, 22న ఉదయం 9:30 గంటలకు రంగం కార్యక్రమాలు ఉంటాయి. జూలై 29న అక్కన్న, ఆదన్న ఆలయం వద్ద అంబారీపై ఊరేగింపుతో ఉత్సవం ముగుస్తుంది.

ఏర్పాట్లపై సమీక్ష..
ఆషాఢ బోనాల ఏర్పాట్లపై హైదరాబాద్‌ ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, జీహెచ్‌ఎంసీ మేయర్‌ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌ మోతె శ్రీలత, రాజ్యసభ సభ్యుడ అనిల్‌కుమార్‌యాదవ్, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ శైలజా రామయ్యర్, కమిషనర్‌ హన్మంతరావుతో కలిసి సమీక్ష చేశారు.

రివ్యూ మీటింగులు నిర్వహించాలని ఆదేశం..
బోనాల పండుగ ఏర్పాట్లపై రివ్యూ మీటింగులు నిర్వహించాలని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాల కలెక్టర్లను మంత్రి కొండా సురేఖ ఆదేశించారు. పండగ ముగిసే వరకు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

28 ఆలయాల్లో పట్టు వస్త్రాల సమర్పణ..
బోనాల పండుగ సందర్భంగా ప్రభుత్వం తరఫున 28 ఆలయాల్లో పట్టు వస్త్రాలు సమర్పించనున్నట్లు మంత్రి కొండా సురేఖ తెలిపారు. వీటిలో గోల్కొండ జగదాంబిక, సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి, పాతబస్తీలోని లాల్‌ దర్వాజ సింహవాహిని మహంకాళి, మీర్‌ ఆలం మండిలోని మహాకాళి సహిత మహాకాళేశ్వర ఆలయాలు, శాలిబండలోని అక్కన్న మాదన్న, రార్మినార్‌లోని భాగ్యలక్ష్మి, కార్వాన్‌లోని దర్బార్‌ మైసమ్మ, జబ్జీ మండిలోని నల్ల పోచమ్మ, చిలకలగూడలోని కట్ట మైసమ్మ ఆలయాల్లో మంత్రులు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. మిగతా 19 ఆలయాల్లో దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పట్టువస్త్రాలు సమర్పిస్తారని పేర్కొన్నారు.