Navaratri 2024 : దేశవ్యాప్తంగా నవరాత్రులను ఘనంగా జరుపుకుంటారు. మొత్తం తొమ్మిది రోజుల పాటు దుర్గాదేవిని భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్కరూ పూజిస్తారు. అయితే ఒక్కో రోజు ఒక్కో పేరుతో అమ్మవారిని పూజిస్తారు. అయితే ఈ ఏడాది దుర్గాదేవి నవరాత్రులు ఈరోజు నుంచి ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 3 అనగా ఈరోజు ప్రారంభం అయ్యి అక్టోబర్ 12న దసరాతో నవరాత్రులు పూర్తి అవుతాయి. ఆశ్వయుజమాసంలో శుక్ల పక్షం ప్రతిపాద తిథిలో నవరాత్రులు ప్రారంభం అవుతాయి. అక్టోబర్ 3వ తేదీ మధ్యాహ్నం 12:18 గంటలకు ప్రారంభమయ్యి.. మరుసటి రోజు అక్టోబర్ 4 మధ్యాహ్నం 2:58 గంటలకు ముగుస్తుంది. అయితే ఈ ఏడాది నవరాత్రి ఉత్సవాలు 9 రోజులు కాకుండా 10 రోజులు జరుపుకోనున్నారు. ఘటస్థాపన ముహూర్తం ఈరోజు అక్టోబర్ 3 ఉదయం 5:38 గంటల నుంచి 6:40 గంటల వరకు చేస్తారు.
మొదటి రోజు శైలపుత్ర దేవీ
నవరాత్రిలో మొదటి రోజు శైలపుత్రి పేరుతో పూజిస్తారు. శైలపుత్రి పార్వతీ దేవి హిమాలయ భగవానుని కుమార్తె. శైలం అంటే పర్వతం కాబట్టి ఆమెను పర్వత పుత్రిక శైలపుత్రి అని అంటారు. ఎద్దు(నంది) మీద స్వారీ చేస్తూ త్రిశూలం, కమలాన్ని పట్టుకుని ఈరోజు దర్శనమిస్తుంది.
రెండో రోజు బ్రహ్మచారిణి దేవి
నవరాత్రుల్లో రెండవ రోజు బ్రహ్మచారిణి దేవికి పూజిస్తారు. ఈ రోజున భక్తులు ఎక్కువగా బ్రహ్మచారిని పూజిస్తారు. బ్రహ్మచారిణి పూజించడం వల్ల జ్ఞానం, కాఠిన్యాన్ని వస్తుందని నమ్ముతారు. బ్రహ్మచారిణి దేవి రుద్రాక్ష మాల ధరించి, కమండలు పట్టుకుని ఈరోజ దర్శనమిస్తుంది.
మూడవ రోజు చంద్రఘంట దేవత
నవరాత్రుల్లో మూడో రోజు చంద్రఘంట దేవిని పూజిస్తారు. చంద్రఖండ, చండికా, రాంచండి అనే పేర్లతో కూడా ఆమెను పిలుస్తారు. పది చేతులు, చేతుల్లో ఆయుధాలతో ఈమె దర్శనమిస్తుంది. చంద్రఘంట శౌర్యానికి, ధైర్యానికి ప్రతీకని, ఆమె నుదిటిపై చంద్రవంకతో చిత్రీకరించి ఉంటుందని చెబుతారు.
నాలుగో రోజు కూష్మాండ దేవత
దేవీ నవరాత్రుల్లో నాల్గవ రోజున భక్తులు కూష్మాండ దేవతను ప్రార్థిస్తారు. కూష్మాండ దేవి జీవితంలో చిరునవ్వును ఇస్తుందని నమ్ముతారు. ఈ దేవి సింహాన్ని అధిరోహించి ఎనిమిది చేతులతో కమండలు, విల్లు, బాణం, కమలం, త్రిశూలం, అమృతం, డిస్కస్ పట్టుకొని కనిపిస్తుంది.
ఐదో రోజు స్కందమాత దేవి
నవరాత్రి ఐదో రోజున భక్తులు స్కందమాతను పూజిస్తారు. శివుడు, పార్వతి దేవి కుమారుడు అయిన కార్తికేయను స్కంద్ అని అంటారు. అలా దేవి రూపానికి పేరు వచ్చిందని ఆమె తల్లి ప్రేమను సూచిస్తుందని నమ్ముతారు. తన కుమారుడైన కార్తికేయుడిని మోస్తూ ఆమె సింహంపై స్వారీ చేస్తూ కనిపిస్తుంది.
ఆరవ రోజు కాత్యాయని దేవి
దేవి నవరాత్రుల్లో భాగంగా ఆరవ రోజు కాత్యాయనికి పూజ చేస్తారు. హిందూ గ్రంధాల ప్రకారం, బ్రహ్మ, విష్ణువు, శివుడు తమ శక్తులను కలిపి మహిషాసుర అనే రాక్షసుడిని చంపి కాత్యాయనిని సృష్టించారు. కాత్యాయని దేవిని మహిషాసురమర్దిని అంటారు. దుర్గాదేవిని ప్రసన్నం చేసుకోవడానికి కాత్యాయన మహర్షి తపస్సు చేసి ఆమెను తన కుమార్తెగా పుట్టమని కోరడంతో ఆమెకు కాత్యాయనీ అని పేరు వచ్చిందని చెబుతారు.
ఏడవ రోజు కాళరాత్రి దేవత
నవరాత్రి ఏడవ రోజున కాళరాత్రిని భక్తులు పూజిస్తారు. ఆమె దుర్గాదేవి ఉగ్ర రూపం, గాడిదపై స్వారీ చేస్తూ కనిపిస్తుంది. ముదురు రంగు, పొడవాటి విప్పిన జుట్టు ఉంటుంది. శుంభ, నిశుంభ అనే రాక్షసులను చంపడానికి పార్వతీ దేవి తన బయటి బంగారు చర్మాన్ని తొలగిస్తుందని ఈమెనే కాళరాత్రి దేవి అని అంటారు.
ఎనిమిదో రోజు మహా గౌరీ దేవి
నవరాత్రులలో ఎనిమిదవ రోజున మహాగౌరీ దేవిని భక్తులు పూజిస్తారు. ఆమె చాలా ప్రకాశవంతంగా చంద్రునిలా కనిపిస్తుంది. స్వచ్ఛత, ప్రశాంతతను సూచిస్తుందని, భక్తుల కోరికలన్నింటినీ తీర్చగలదని నమ్ముతారు.
తొమ్మిదో రోజు సిద్ధిదాత్రి దేవి
నవరాత్రుల్లో తొమ్మిదవ రోజున భక్తులు సిద్ధిదాత్రిని పూజిస్తారు. దుర్గా తొమ్మిదవ రూపమైన సిద్ధిదాత్రి అతీంద్రియ శక్తులు కలిగినది. ధ్యాన సామర్థ్యం, తన భక్తులకు జ్ఞానాన్ని ప్రసాదిస్తుందని నమ్ముతారు.