
కరోనా మహమ్మారి ఆగడాలకు దేశంలో పలు సేవల పోకడలు నిలిచిపోయాయి. రోజురోజుకు కోవిద్ 19 కేసులు పెరుగుతుండడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలుపెరగని పోరాటం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం మే 3 వరకు లాక్ డౌన్ విధించగా, తెలంగాణ సర్కార్ మే 7 వరకు సడలింపులు లేని లాక్ డౌన్ విధించింది. అయితే మే మొదటి వారం తర్వాత లాక్ డౌన్ ఎత్తివేస్తే జరిగే పరిణామాల పై ఇప్పటి నుంచే ఆందోళన మొదలవుతుంది. లాక్ డౌన్ ఎత్తివేసినా ప్రజా రవాణాకు మరో నెల రోజుల పాటు అనుమతించకపోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.
ప్రజా రవాణా అయిన బస్సులు, రైళ్లు, విమానాలు ప్రారంభమైతే వైరస్ విస్తరణ మరింత పెరిగే అవకాశం ఉంది. లాక్ డౌన్ ఎత్తేసినంత మాత్రాన కరోనా వైరస్ వ్యాప్తి ఆగిపోయిందని కాదు. ఈ వ్యాధి ప్రభావం మరో 6 నెలల వరకు ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఢిల్లీ, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు, మధ్యప్రదేశ్, గుజరాత్ లతోపాటు తెలంగాణ, ఏపీ తదితర రాష్ట్రాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది.
ఈ రాష్ట్రాలలో వలస కూలీలు, ఉపాధి నిమిత్తం వచ్చిన వారు లక్షల మంది ఉన్నారు. లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత వీరంతా స్వరాష్ట్రాలకు వెళ్లే అవకాశం ఉంది. వీరిలో ఏ ఒక్కరికి కరోనా ఉన్నా అది అన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉంది. ముఖ్యంగా రైళ్ల ప్రయాణాల ద్వారా వేల మందికి సోకే అవకాశం లేకపోలేదు. కరోనాకు మందు వస్తే తప్పా పూర్తి స్థాయిలో వైరస్ తగ్గుముఖం పట్టిందని భావించలేం. ప్రస్తుతం లాక్ డౌన్ కొనసాగుతున్నా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ఒక వేళ లాక్ డౌన్ ఎత్తేస్తే రాష్ట్రాల మధ్య రాకపోకలు ప్రారంభమవుతాయి. దింతో కరోనా వ్యాప్తి మరింత సులువు అయ్యే అవకాశాలు లేకపోలేదు. కరోనా ఎక్కువగా ఉన్న రాష్ట్రాల నుంచి ఎవరైనా ప్రయాణిస్తే వారికి కరోనా ఉంటే అది అందరికి సోకే ప్రమాదం ఉంది. అందుకే లాక్ డౌన్ ఎత్తేసినా ప్రజా రవాణాను ప్రారంభించవద్దని కేంద్ర ప్రభుత్వానికి పలువురు సిఫార్సు చేస్తున్నారు.
తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సూర్యాపేట, భువనగిరి లాంటి ప్రాంతాల్లో పాజిటివ్ కేసులున్నాయి. వరంగల్ రూరల్, యాదాద్రి, సిద్దిపేట, వనపర్తి జిల్లాల్లో అసలు కేసులే లేవు. లాక్ డౌన్ తర్వాత బస్సులు ప్రారంభమైతే ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారు. కరోనా ఎక్కువ ఉన్న జిల్లాలలో నుంచి ఎవరైనా ఈ ప్రాంతాలకు వస్తే కరోనా విస్తరించే అవకాశం ఉంది. కావున లాక్ డౌన్ ఎత్తేసినా ప్రజా రవాణాను కొంత కాలం పాటు ప్రారంభించకపోవడం ఉత్తమం. లేకపోతే ప్రమాదం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.