
ఒకవైపు అధికార పార్టీ దూకుడు,మరోవైపు సొంత పార్టీ నేతల మద్దతు లేకపోవడంతో మల్కాజ్‌గిరి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ సతమతమవుతున్నారు. కేటీఆర్ ఫామ్ హౌజ్ వివాదంపై కాంగ్రెస్ కోర్ కమిటీలో భిన్న స్వరాలు వ్యక్తమవుతున్నాయి. జైలు నుంచి విడుదలయ్యాక కూడా ఆయన ఉత్తమ్ ను టార్గెట్ చేస్తూ మాట్లాడటం సీనియర్లతో మరింత దూరం పెంచే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే సీనియర్లతో గ్యాప్ కారణంగా పార్టీలో విమర్శలు ఎదుర్కొంటున్న రేవంత్.. ఆ గ్యాప్ ను మరింత పెంచేలా వ్యవహరిస్తుండటం ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందోనన్న చర్చ కాంగ్రెస్‌లో చర్చ జరుగుతోంది.
కాంగ్రెస్ లాంటి మహా సముద్రంలో సీనియర్లను కాదని రేవంత్ నెగ్గుకురాగలరా.. అని ఆయన పార్టీలో చేరిన కొత్తలో చాలామంది సందేహాలు వెలిబుచ్చారు. ఆ సందేహాలన్నీ నిజమవుతూనే ఉన్నాయి. టీపీసీసీ పదవి విషయంలో ఇప్పటికే ఆయనకు సీనియర్ల సెగ తగిలింది. రేవంత్ కు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పదవి ఇవ్వవద్దని చాలామంది సీనియర్లు హైకమాండ్ కు విజ్ఞప్తి చేశారు. ఇక తాజాగా డ్రోన్ కేసు వ్యవహారంలోనూ రేవంత్ పై సొంత పార్టీ నుంచే విమర్శల దాడి మొదలైంది. దీంతో అటు అధికార పార్టీ,ఇటు సొంత పార్టీ దాడితో రేవంత్ సతమతమవుతున్నారన్న వాదన వినిపిస్తోంది
రేవంత్ వ్యవహారంపై ఇటీవల సీనియర్ నేతల విమర్శల దాడి పెరిగింది. ముఖ్యంగా సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి,సీనియర్ నేతలు వీహెచ్,దామోదర రాజనరసింహ వంటి వారు రేవంత్‌పై బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. పార్టీని కేవలం కుంతియా,రేవంత్ మాత్రమే నడిపిస్తున్నారన్నట్టుగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని.. దాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని తాజాగా జగ్గారెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. ఆ ఇద్దరే పార్టీని నడిపిస్తే.. ఇక తాము ఇంట్లో కూర్చోవాలా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఎవరి జాగీరు కాదని ఘాటుగా స్పందించారు. ఏదైనా సరే.. కోర్ కమిటీ సమావేశం పెట్టి చర్చించాలని.. అప్పుడు పులులు,సింహాలు ఎవరో తేలుతుందని అన్నారు. అటు వీహెచ్ కూడా రేవంత్ తీరును తప్పు పట్టారు. పార్టీలో తానొక్కడినే పోరాడుతున్నానని చెప్పుకోవడం సరికాదన్నారు. అంతేకాదు,గతంలో రేవంత్ ఇందిరా,సోనియా గాంధీలపై చేసిన వ్యాఖ్యలను తాము ఇప్పటికీ మరువలేదని గుర్తుచేశారు.