గూగుల్ కి చైనాపై కొంచం ప్రేమ ఎక్కువైనట్లు ఉంది. భారత్ లో భారీ సంఖ్యలో అభిమానులు ఉన్న రెండు భారతీయ యాప్స్ ని ప్లే స్టోర్ నుంచి తొలగించి గూగుల్ భారీ షాకిచ్చింది. ఆ రెండు యాప్ ల్లో ఒక యాప్ టిక్ టాక్ కి బదులుగా వాడే యాప్ కాగా మరొకటి చైనా యాప్స్ ని గుర్తించే యాప్. అయితే ఈ రెండు యాప్స్ ‘మిత్రో’, ‘చైనా యాప్స్ రిమూవ్’ యాప్ లను గూగుల్ తొలగించింది. ఈ రెండు యాప్ లకు భారత్ లో భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. ఒక్కసారిగా వీటిని తన ప్లేస్టోర్ నుంచి తొలగించివేయడం పట్ల ఆశ్చర్యపోవడం ఐటీ నిపుణుల వంతవుతోంది. భారత సరిహద్దులో చైనా దూకుడుకు నిరసనగా ఆ దేశానికి చెందిన ఉత్పత్తులను బహిష్కరించాలంటూ విద్యావేత్త సోనమ్ వాంగ్ చుక్ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ యాప్ అందుబాటులోకి వచ్చింది. ఈ రెండు యాప్ లను లక్షల్లో యూజర్లు డౌన్ లోడ్ చేసుకొన్నారు. మిత్రోను భారతీయ టెకీలు తయారుచేయగా.. “రిమూవ్ చైనా యాప్స్” యాప్ ను వన్ టచ్ యాప్ ల్యాబ్స్ సిద్దంచేసింది.
అయితే, తమ ప్లేస్టోర్ నుంచి ఈ రెండు యాప్ లను ఎందుకు తొలగించాల్సి వచ్చిందో.. దాని వెనుకున్న కారణాలను గూగుల్ ఇప్పుడు వివరిస్తూ స్పందిస్తున్నది. టిక్ టాక్ యాప్ నకు పోటీగా భారతీయుడు తయారుచేసిన మిత్రో యాప్.. ఇప్పటికే ఉన్న టిక్ టిక్ యాప్ ను పోలీ ఉంటుందని గూగుల్ తెలిపింది. ఇకపోతే, రిమూవ్ చైనా యాప్స్ అనే యాప్.. స్మార్ట్‌ఫోన్లలో మూకుమ్మడిగా చైనా యాప్స్ ను తొలగించడాన్ని గుర్తిస్తుంది. చైనా ఉత్పత్తులను బహిష్కరించాలనే భారతదేశ ధోరణి కారణంగా ఈ యాప్ ప్రజాదరణ నోచుకొంటున్నది. ‘ఈ నెల ప్రారంభంలో పలు సాంకేతిక విధానాల ఉల్లంఘనలకు పాల్పడిన ఒక వీడియోను తొలగించాం. సమస్యలను పరిష్కరించేందుకు, ఆయా సంస్థలకు సహాయపడేందుకు డెవలపర్లతో కలిసి పనిచేసే స్థిరప్రక్రియ మా వద్ద ఉన్నది. వీరికి మార్గదర్శనం చేశాం. సమస్యలను పరిష్కరించుకొన్న తర్వాత ఆ డెవలపర్ తిరిగి ప్లే కావచ్చు’ అని ఆండ్రాయిడ్ గూగుల్ ప్లే వైస్ ప్రెసిడెంట్ సమీర్ సమత్ ఒక ప్రకటనలో తెలిపారు.
గూగుల్ ఎత్తిచూపుతున్న సమస్యలను పరిష్కరించుకొన్న తర్వాత తిరిగి ప్లే స్టోర్ లోకి వచ్చేందుకు మిత్రో యాప్ కు అవకాశాలు ఉన్నాయని చెప్పవచ్చు. అయితే, రిమూవ్ చైనా యాప్స్ అనే యాప్ తిరిగి ప్లే స్టోర్ లోకి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని ఐటీ నిపుణులు చెప్తున్నారు. రిమూవ్ చైనా యాప్.. గూగుల్ ప్లేలో దాదాపు మిలియన్ డౌన్ లోడ్లను సంపాదించి అగ్రస్థానంలో నిలిచింది. కాగా, మిత్రో యాప్ 5 మిలియన్ డౌన్ లోడ్లను అందుకొని గూగుల్ ప్లేస్టోర్ లో 4.7 స్టార్ రేటింగ్ ను కలిగివుండటం విశేషం.