
ఈరోజు టైమ్స్ ఆఫ్ ఇండియా ఆంధ్రలోని విశాఖపట్నం శివారు అచ్యుతాపురం ప్రాముఖ్యాన్ని ప్రముఖంగా ప్రచురించింది. శ్రీలంక కు చెందిన ఒక బహుళజాతి కంపెనీ 2008 లో బ్రాండిక్స్ ఇండియా అప్పరెల్ సిటీ పేరుతో వెయ్యి ఎకరాల స్థలంలో స్త్రీల లోదుస్తుల ఫ్యాక్టరీని ప్రారంభించింది. ఇందులో విశేషమేమిటని అనుకోవచ్చు. ఒకటి దాదాపు 18 వేలమందిస్త్రీలకు ఉపాధి కల్పిస్తుంది. రెండు ఈ వూరు పేరు ప్రపంచవ్యాప్తంగా తెలిసింది. ఎందుకంటే అది ఈ దుస్తులను సరఫరా చేసేది అల్లాటప్పా కంపెనీలకు కాదు. అమెరికాలో విక్టోరియా కంపెనీ ఈ రంగంలో హై ఎండ్ వెరైటీ కి ప్రసిద్ధిచెందింది. వాళ్లకు ఈదుస్తులు ఈ ఫ్యాక్టరీనుంచే రహస్యంగా వెళుతున్నాయి. దాదాపు 40 బిలియన్ డాలర్ల వ్యాపారం జరుగుతుంది. ఈ కంపెనీకి ప్రసిద్ధిచెందిన కాల్విన్ క్లిన్ , మార్క్ అండ్ స్పెన్సర్ కంపెనీలు కూడా క్లయింట్ లే. ప్రతినెలా అమెరికా, యూరప్ , జపాన్ కి ఇక్కడినుంచి ఈ లోదుస్తులు ఎగుమతి చేస్తున్నారు.
ఇందులో విశేషమేమిటంటే చుట్టుపక్కల 600 గ్రామాలనుంచి మహిళలు ఇందులో పనిచేస్తున్నారు. 200 బస్సులు వీళ్ళను తీసుకొచ్చి, తీసుకెళ్తాయి . ఈ పరిశ్రమ పెట్టిన కొత్తలో ఇందులో పనిచేసే మహిళలు ఈ రకం దుస్తులు కుట్టుతున్నామని చెప్పుకోవటానికి మొహమాటపడేవాళ్లు. ఎందుకంటే గ్రామీణవాతావరణం అలాంటిది. ప్యాంటు, షర్టులు కుడుతున్నట్లు చెప్పేవాళ్ళు. మెల్లి మెల్లిగా ఆ వాతావరణం తొలిగిపోయింది. ఈప్రాంతంలో ఇంతమంది మహిళల్ని స్వంత కాళ్ళమీద నిలబెట్టిన సంస్థ, వృత్తి ఇది. వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపింది. సగటున 8 వేలనుంచి 15 వేల వరకు వీళ్లకు వస్తుంది. కనీసం ఏడో తరగతి చదివుంటే చాలు. కానీ ఇంటర్, అంతకన్నా పైన చదివిన వాళ్ళు కూడా వస్తున్నారు. ఇది బహుళజాతి కంపెనీ కాబట్టి కొన్ని కనీస సౌకర్యాలు కల్పించారు. మొత్తం మీద చూస్తే ఈ ప్రాంత మహిళల జీవితాల్లో ఈ ఫ్యాక్టరీ వెలుగులు నింపిందని చెప్పాలి.
మన తెలుగు మీడియా ఇటువంటి వార్తలను ఎందుకు ప్రచారం చేయవో తెలియదు. పనికిరాని చచ్చు కబుర్లతో ప్రజల బుర్రల్ని చెడగొట్టే బదులు ఇటువంటి గ్రోత్ స్టోరీలను ప్రచురిస్తే బాగుంటుంది. ఈ వార్తని ప్రముఖంగా ప్రచురించటమే కాకుండా అందులో పనిచేసే వాళ్ళతో ఇంటర్వ్యూలు చేసి వాళ్ళ బతుకులు ఎలా మారాయో, దాని వలన వాళ్ళ కుటుంబాలు ఎలా బాగుపడ్డాయో వివరంగా ప్రచురించినందుకు మరొక్కసారి టైమ్స్ ఆఫ్ ఇండియా కు సెల్యూట్.