రాజధానిని అమరావతి నుండి విశాఖపట్నంపై మార్చే విషయంలో అందరూ ఎదురు చూస్తున్నట్లు శుక్రవారం రాష్ట్ర మంత్రివర్గం నిర్దుష్టమైన నిర్ణయం తీసుకోలేదు. ఈ విషయమై చెలరేగిన ఆందోళనలు, అసంతృప్తి సద్దుమణిగే వరకు వేచి చూడాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భావిస్తున్నట్లు తెలిసింది. ప్రజలకు నచ్చచెప్పే రాజధాని మార్పుపై అడుగులు వేద్దామని సహచారం మంత్రులకు ఆయన స్పష్టమైన సంకేతం ఇచ్చిన్నట్లు చెబుతున్నారు.
ఈ విషయమై అరగంటకు పైగా సహచర మంత్రులకు ముఖ్యమంత్రి వివరణ ఇచ్చిన్నట్లు తెలిసింది. ప్రస్తుథానికి రాజధాని విషయంలో మరో అధ్యయన కమిటీ నివేదిక బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ (బీసీజీ) నివేదిక రావలసి ఉన్నందున ప్రస్తుతానికి నిర్ణయాన్ని వాయిదా వేశారు. జీఎన్ రావు కమిటీ నివేదిక, బీసీజీ నివేదికలు రెండింటినీ క్రోడీకరించి అభివృద్ధి వికేంద్రీకరణకు సంబంధించి నిర్ణయం తీసుకోవాలని అనుకున్నారు.
ఎన్ని వేల కోట్లు పెట్టినా అమరావతిని అభివృద్ధి చేయలేమని ముఖ్యమంత్రి మంత్రులకు స్పష్టం చేసినట్లు తెలిసింది. లక్ష కోట్లలో పదిశాతం విశాఖలో ఖర్చుపెట్టినా హైదరాబాద్ స్థాయిలో రాజధాని అభివృద్ధి అవుతుందని సీఎం వివరించారు. రాజధాని తరలింపుపై తొందరపాటు లేదని సీఎం జగన్ స్పష్టం చేసిన్నట్లు తెలిసింది.
రాజధాని మార్పు ఖాయమే అయినా మార్చే ముందు కొత్త రంగం సిద్ధం చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు కనిపిస్తున్నది. ఈలోగా రాజధాని ఏర్పాటులో గతంలో టిడిపి పాలకులపై తమకు దీర్ఘకాలికంగా చేస్తున్న ఆరోపణలపై చర్యలను ప్రారంభించాలని నిర్ణయానికి వచ్చారు. ముఖ్యంగా ఇన్నాళ్లూ తాము చేస్తున్న ఇన్‌సైడర్ ట్రేడింగ్ ఆరోపణలపై మంత్రివర్గం ఉపసంఘం ఇచ్చిన నివేదికను పరిశీలించిన మంత్రివర్గం ఉన్నత స్థాయిలో విచారణకు రంగం సిద్ధం చేస్తున్నది.
ఏసీబీ, విజిలెన్స్, నిపుణుల సహకారంతో మంత్రివర్గ ఉపసంఘం ఈ నివేదిక సిద్దం చేసింది. చంద్రబాబు పాలనలో సాగునీటి ప్రాజెక్టులు, రాజధాని పనులు, ఉపాధి హామీ పనుల్లో జరిగిన అవినీతిపై నివేదిక ఇచ్చినట్టుగా తెలుస్తున్నది.
రాజధానిలో రేగిన నిరసనలు ఎంతో కాలం కొనసాగలేవని ప్రభుత్వం అంచనా వేసింది. అన్ని కోణాల్లోనూ ఆలోచించిన తర్వాతే తాము నిర్ణయం తీసుకున్నామని చెప్పడంతో పాటు, న్యాయపరంగా చిక్కులు ఎదురుకాకుండా జాగ్రత్త పడేందుకు మరికొంత సమయం తీసుకోవాలని సీఎం జగన్ భావిస్తున్నట్లు తెలిసింది.
పరిస్థితి కుదట పడిన తర్వాత, సంక్రాంతి తర్వాత రెండు రోజుల పాటు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి ఏపీ రాజధానిపై ముఖ్యమంత్రి జగన్ ప్రకటన చేసే అవకాశమున్నట్లు చెబుతున్నారు.