
YSRCP Suspensions : ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేశారనే నెపంతో వైసీపీ అధిష్టానం నలుగురు ఎమ్మెల్యేలపై వేటువేసింది. వైసీపీ ఎమ్మెల్యేలకు జగన్ గట్టి షాకిచ్చారు. వారిని పార్టీ నుంచి సస్సెండ్ చేస్తూ వైసీపీ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. సస్పెండయిన ఎమ్మెల్యేల్లో ఆనం రామనారాయణ రెడ్డి, కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ నిబంధనలకు విరుద్ధంగా టీడీపీకి ఓటు వేయడంతో వైసీపీకి పరాభవం ఎదురైంది. దీంతో పార్టీ అధిష్టానం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. భవిష్యత్ లో కూడా ఇలా పార్టీ విధానాలకు వ్యతిరేకంగా పనిచేసే వారికి ఇదే గుణపాఠంగా ఉంటుందని భావిస్తున్నారు. అందుకే వారిని పార్టీ నుంచి సస్పెన్షన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
క్రాస్ ఓటింగ్
ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడినట్లు తెలియడంతో వారిపై కఠిన చర్యలకు వైసీపీ అధిష్టానం ఉపక్రమించింది.. ఈ మేరకు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వారిని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. గురువారం జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులే వ్యతిరేకంగా ఓటు వేశారు. వైసీపీ ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్ తో టీడిపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ విజయం సాధించారు. దీనికి బాధ్యులైన నలుగురు ఎమ్మెల్యేలను గుర్తించింది. దీంతో వారిపై చర్య తీసుకుంది. సీఎం జగన్ నిర్ణయంతో ఎమ్మెల్యేలకు మింగుడు పడటం లేదు.
ప్రలోభాలకు..
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ప్రలోభాలకు గురిచేసింది. నలుగురు ఎమ్మెల్యేకు రూ. 10 నుంచి 15 కోట్ల వరకు ముట్టజెప్పినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీంతోనే వారు క్రాస్ ఓటింగ్ కు దిగినట్లు తెలుస్తోంది. ప్రతిపక్ష నేత చంద్రబాబుకు ఇలా ఎమ్మెల్యేలను కొనడం అలవాటేనని వైసీపీ వర్గాలు విమర్శిస్తున్నాయి.. రాబోయే ఎన్నికల్లో టీడీపీ తరఫున పార్టీ టికెట్లు కేటాయిస్తామని కూడా వారిని ప్రలోభాలకు గురి చేసినట్లు చెబుతున్నారు. గతంలో సైతం 23 మంది ఎమ్మెల్యేలను కొన్న చరిత్ర చంద్రబాబుకు ఉందని గుర్తు చేస్తున్నారు.
భవిష్యత్ పై..
వైసీపీ నేతల్లో భవిష్యత్ పై భయం పట్టుకుంది. అధికార పార్టీ తీసుకుంటున్న చర్యలతో అందరూ భయపడుతున్నారు. రాబోయే ఎన్నికల్లో చాలా మందికి టికెట్లు ఇచ్చేది లేదని సర్వేలు చెబుతున్నాయి. దీంతోనే వారు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే ఉద్దేశంతోనే టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలిసింది. దీనికి వేరే కారణాలు ఏవైనా ఉన్నాయా అనే కోణంలో ఆరా తీస్తున్నారు ఇటీవల కాలంలో వైసీపీ అధిష్టానంలోని నేతల తీరుపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.. పార్టీలో కొందరి ఆధిపత్యం పెరిగినందున జీర్ణించుకోలేకపోతున్నారని ఎమ్మెల్యేలు ఇన్ సైడ్ గా వాపోతున్నారు. ఏది ఏమైనా ఈ సస్పెన్షన్ తో వైసీపీలో అంతర్గత పోరు మొదలైనట్లు పరిణామాలు చూస్తుంటే అర్థమవుతోంది.
పరిణామాలెలా..
రాబోయే రోజుల్లో పరిణామాలు ఎలా ఉండబోతున్నాయన్నది ఆసక్తి రేపుతోంది. విజయ గర్వం తలకెక్కడంతోనే టీడీపీ బలం పెరుగుతోందని అర్థమవుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ జయకేతనాన్ని వైసీపీ నేతలు జీర్ణించుకోవడం లేదు.. ప్రలోభాలకు గురిచేస్తూ తమ పార్టీ ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొన్నట్లు కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాలు చూస్తుంటే భవిష్యత్ లో వైసీపీ ఓటమి కానుందా అనే సందేహాలు నెలకొంటున్నాయి.