YS Jagan : విశాఖలోనే ప్రమాణస్వీకారం.. పాలన.. జగన్ ధీమాకు కారణమేంటి?

ఇదే సమయంలో జగన్ విశాఖపట్నం కేంద్రంగా చేసిన వ్యాఖ్యల పట్ల టిడిపి, జనసేన నాయకులు మండిపడుతున్నారు. గతంలో అమరావతి రాజధాని, మూడు రాజధానులు అంటూ మాట్లాడిన జగన్.. ఇప్పుడు యూ టర్న్ తీసుకొని వైజాగ్ క్యాపిటల్ అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

Written By: Anabothula Bhaskar, Updated On : March 5, 2024 10:38 pm
Follow us on

YS Jagan : అసెంబ్లీ ఎన్నికల ముందు ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. తాను త్వరలోనే ముఖ్యమంత్రిగా రెండవసారి విజయం సాధిస్తానని.. ప్రమాణ స్వీకారం విశాఖపట్నం లోనే చేస్తానని అన్నారు.. మంగళవారం విజన్ విశాఖ పేరుతో ఏపీ డెవలప్మెంట్ సదస్సులో జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ” ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఎన్నో మార్పులకు కారణమయ్యాం. పేద పిల్లల చేతిలో పలకలమయ్యాం. వృద్ధులకు ఊత కర్రయ్యాం. చట్టసభల్లో పేదలను కూర్చోబెట్టాం. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ముఖచిత్రాన్ని సమూలంగా మార్చాం.. మళ్లీ రెండోసారి ముఖ్యమంత్రిగా విజయం సాధించిన తర్వాత విశాఖపట్నం వేదికగానే ప్రమాణ స్వీకారం చేస్తా. విశాఖ నగరాన్ని హైదరాబాద్ కంటే దీటుగా అభివృద్ధి చేస్తా” అంటూ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

విజన్ విశాఖ సభలో జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాలలో సంచలనం సృష్టించాయి. ఇటీవలి సిద్ధం సభల్లో ఒకింత నిర్వేదమైన మాటలు మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి.. విశాఖపట్నంలో జరిగిన సదస్సులో చాలా ఆత్మవిశ్వాసంతో కనిపించారు. కచ్చితంగా రెండోసారి ముఖ్యమంత్రిగా విజయం సాధించి.. విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేస్తానని ప్రకటించారు. దీంతో వైసిపి వర్గాలు జోష్ లో మునిగిపోయాయి. “టికెట్లు ఇప్పటికీ ప్రకటించకపోయినప్పటికీ.. ఇన్ ఛార్జ్ లను మార్చుతున్నప్పటికీ.. అవేవీ కనిపించకుండా జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు తమలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాయని” వైసీపీ కార్యకర్తలంటున్నారు.

టిడిపి, జనసేన మొదటి విడతగా అభ్యర్థుల పేర్లు ప్రకటించినప్పటికీ.. కొన్ని స్థానాలకు ఇంకా అభ్యర్థులు ఎవరనేది ఖరారు కాలేదు. పైగా జనసేన ఇప్పటివరకు ఐదుగురు అభ్యర్థులను మాత్రమే ప్రకటించింది.. మరోవైపు జనసేన, టిడిపి కూటమిలోకి బిజెపి వస్తుందా? రాదా? అనే దానిపై క్లారిటీ లేదు. ఇదే సమయంలో సర్వే ఆధారంగా జగన్మోహన్ రెడ్డి ఇన్ ఛార్జ్ లను ప్రకటిస్తున్నారు. ప్రాంతాలను మార్చుతూ సరికొత్త ప్రయోగాలు చేస్తున్నారు. ఇలా మార్పులపై కొంతమంది వైసిపి నాయకులు పెదవి విరుస్తున్నప్పటికీ.. మెజారిటీ నాయకులు జగన్ నిర్ణయానికి కట్టుబడి ఉంటున్నారు. క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు సర్వే నివేదికలు తెప్పించుకుంటున్న జగన్.. “సానుకూలంగా ఫలితాలు వస్తుండటం వల్లే ఇలాంటి మాటలు మాట్లాడి ఉంటారని” రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వైసిపి నాయకుల్లో ఉత్సాహాన్ని నింపాయి. ఇదే సమయంలో జగన్ విశాఖపట్నం కేంద్రంగా చేసిన వ్యాఖ్యల పట్ల టిడిపి, జనసేన నాయకులు మండిపడుతున్నారు. గతంలో అమరావతి రాజధాని, మూడు రాజధానులు అంటూ మాట్లాడిన జగన్.. ఇప్పుడు యూ టర్న్ తీసుకొని వైజాగ్ క్యాపిటల్ అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.