YS Jagan Vs Avinash Reddy : వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి బలికాబోతున్నారా? ఇక తానేం చేయలేనని జగన్ చేతులెత్తేశారా? తెగేదాకా లాగితే అందరం మునిగిపోతామని భావిస్తున్నారా? అందుకే అవినాష్ రెడ్డికి హ్యాండిచ్చారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అనుమానాలకు నిజం చేకూరుస్తున్నాయి. గత ఎన్నికలకు ముందు.. 2019 మార్చి 15న వివేకా హత్యకు గురయ్యారు. అప్పట్లో రాజకీయ ప్రత్యర్థుల హత్యచేశారని ఆరోపించారు. ఈ ఘటనతో సానుభూతి పనిచేసింది. జగన్ కు రాజకీయ లబ్ధి చేకూర్చింది. అయితే వైసీపీ సర్కారు అధికారంలోకి వచ్చిన తరువాత కేసు నీరుగారిపోయిందని అంతా భావించారు. కానీ సుమారు నాలుగేళ్ల తరువాత సీబీఐ కేసులో పట్టుబిగించింది. జగన్ సర్కారుకు ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అయితే ఈ క్రమంలో ఎంపీ అవినాష్ రెడ్డిని, ఆయన తండ్రి భాస్కరరెడ్డిని కాపాడేందుకు జగన్ చేసిన ప్రయత్నాలు అందరికీ తెలిసినవే.
పక్కా ఆధారాలతో..
అయితే సీబీఐ రెండు సాక్షాలనే బలంగా నమ్మి .. ఆ కోణంలోనే విచారించింది. ఒకటి ఎంపీ అవినాష్ రెడ్డి కాల్ లిస్ట్. రెండూ గూగుల్ టెక్ ద్వారా నిందితులంతా భాస్కరరెడ్డి ఇంటి చుట్టూ తిరుగుతుండడం… ఆ రెండు ఇష్యూలతో సీబీఐ డొంకనంతటిని బయటకు లాగింది. వివేకా చనిపోయిన విషయం ఉదయం 8 గంటలకు వెలుగులోకి వస్తే.. తెల్లవారుజామున 3 గంటలకు అవినాష్ రెడ్డి సీఎం జగన్, ఆమె భార్య భారతి వ్యక్తిగత సహాయకులకు ఎందుకు ఫోన్ చేసినట్టు అన్న దానిపై సీబీఐ పట్టుబిగించింది. ఇప్పటివరకూ అవినాష్ రెడ్డిని ఆరుసార్లు విచారించగా.. దాదాపు ఈ అంశం చుట్టూనే సీబీఐ ప్రశ్నల పరంపర కొనసాగించినట్టు తెలుస్తోంది. అటు విపక్షాలు సైతం జగన్, ఆయన సతీమణి భారతి వైపే వేలు చూపిస్తున్నాయి. అటు ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కరరెడ్డిని కాపాడుకునే ఆత్రం జగన్ లో కనిపిస్తుండడంతో తెలియని అనుమానాలు సర్వత్రా నెలకొన్నాయి.
మారిన అవినాష్ చర్యలు..
అటు ఎంపీ అవినాష్ రెడ్డి చర్యలు కూడా బ్లాక్ మెయిలింగ్ తరహాలోనే ఉన్నాయి. వివేకా హత్య కేసుపై అవినాష్ రెడ్డి ఎప్పుడు మాట్లాడినా పులివెందులలోని సీఎం క్యాంప్ ఆఫీసు వద్దే మాట్లాడతారు. ఆ బోర్డు కనిపించేలా కెమెరాలు ఏర్పాటుచేయించి మరీ ప్రెస్ మీట్లు పెడతారు. నిన్నిటికి నిన్న ముందస్తు బెయిల్ పై కీలక విచారణ సమయంలో కూడా ఆయన పులివెందుల వెళ్లారు. అక్కడ ప్రజాదర్బారు నిర్వహించారు. అంటే ఓ రకంగా ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ కు దిగినట్టేనని విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే ఈ కేసు కోసమే జగన్ ఏకంగా లండన్ టూర్ ను క్యాన్సిల్ చేసుకున్నట్టు వార్తలు వచ్చాయి.
విరుద్ధ ప్రకటనలు..
అయితే ఇప్పుడు కేసు విచారణలో అనేక అనుమానాలను ఎంపీ అవినాష్ రెడ్డి లేవనెత్తారు. ముఖ్యంగా హత్యకు ముందు వివేకా రాసిన లెటర్ కోసం తరచూ ప్రస్తావిస్తున్నారు. చనిపోతూ మా చిన్నాన్న ఒక లెటర్ రాశారని.. అందులో ఉన్న అంశాలను ఎందుకు పరిగణలోకి తీసుకోరు అని ప్రశ్నిస్తున్నారు. అయితే అదే లెటర్ పై గతంలో సీఎం జగన్ స్పందించారు. చనిపోతున్న మా చిన్నాన్న లెటర్ ఎలా రాస్తారు? అంటూ లైట్ తీసుకుంటూ మాట్లాడారు. దీంతో వివేకా రాసిన లెటర్ పై ఇద్దరూ మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. పరస్పర విరుద్ధ కామెంట్స్ చేయడం ఇప్పుడు అనుమానాలకు తావిస్తోంది. ఇద్దరి మధ్య అగాధాన్ని స్పష్టం చేస్తోంది. దీంతో అవినాష్ రెడ్డిని బలిపశువు చేయడం ప్రారంభించారా? అన్న అనుమానం సర్వత్రా వ్యాపిస్తోంది.