
Nara Lokesh -YCP: ఏపీలో టీడీపీని అధికారంలోకి తేవడానికి లోకేష్ పాదయాత్ర చేస్తున్నారు.. ఇలా అనేదాని కంటే తనకు తాను ప్రూవ్ చేసుకోవడానికి చేస్తున్నారనుకోవడం ఎటువంటి అతిశయోక్తి కాదేమో. 2014 ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత లోకేష్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. అంతవరకూ పరోక్షంగా సేవలందించినా.. టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత చంద్రబాబు కుమారుడ్ని రంగంలోకి దించారు. ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి కట్టబెట్టారు. ఒక్క మాటలో చెప్పాలంటే దొడ్డిదారిన తెచ్చారన్న మాట. అదే పాపం లోకేష్ కు ప్రతిబంధకంగా మారింది. మంత్రిగా లోకేష్ కొంతవరకూ పర్వాలేకున్నా నాయకుడిగా మాత్రం రాణించలేకపోయారు.
2019 ఎన్నికల్లో ప్రత్యక్షంగా పోటీకి దిగినా నెగ్గుకు రాలేకపోయారు. మంత్రిగా ఉంటూ.. ఒక సీఎం కుమారుడిగా కూడా ప్రజలు గుర్తించలేదు. మంగళగిరి ప్రజలు ఆదరించలేదు. అయితే నియోజకవర్గ ఎంపికలో కూడా చంద్రబాబు సరైన ఆప్షన్ ఎంచుకోలేదు. టీడీపీ ఆవిర్భావం తరువాత ఆ పార్టీ మంగళగిరిలో 1983, 85 ఎన్నికల్లో మాత్రమే గెలిచింది. తరువాత ఏ ఎన్నికలో కూడా విజయం సాధించలేకపోయింది. ఆ నియోజకవర్గం నుంచి గెలుపొంది అప్పటి వరకూ లోకేష్ పై ఉన్న అపవాదులన్నీ పొగొట్టాలని తలపోశారు. కానీ అక్కడ లోకేష్ అనూహ్యంగా ఓటమి చవిచూశారు. మరిన్ని ఇబ్బందులు ఏరికోరి తెచ్చుకున్నారు.
అయితే చంద్రబాబు తరువాత ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమైంది., కుమారుడికి సరైన బ్రేక్ ఇవ్వలేకపోయానన్న బెంగ చంద్రబాబును వెంటాడుతోంది. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ రూపంలో ప్రమాదం పొంచి ఉంది. అందుకే చంద్రబాబు లోకేష్ పాదయాత్రకు ప్లాన్ చేశారు. కానీ జగన్ సర్కారు అంతా ఈజీగా పాదయాత్ర చేయనిస్తుందని చంద్రబాబుకు తెలియంది కాదు. అందుకు తగ్గట్టుగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పాదయాత్ర స్టార్ట్ అయ్యింది. కానీ ప్రజల నుంచి మాత్రం మోస్తరు ఆదరణే దక్కుతోంది. అయితే ఈ విషయంలో చంద్రబాబు ఎటువంటి కలవరం చెందలేదు. వైసీపీ సర్కారు చేస్తున్న చిలిపి చేష్టలే లోకేష్ పాదయాత్రను హైప్ చేస్తున్నాయి.

ఒక్కసారి లోకేష్ పాదయాత్రను నిశితంగా గమనిస్తే ఒకటి గుర్తించవచ్చు. ఎల్లో మీడియాలో లోకేష్ పాదయాత్ర కవర్ చేస్తున్నారే.. కానీ హైప్ చేయడం లేదు. ముఖ్యంగా ఈనాడులో ఏదో మూలన వార్తలను వేస్తున్నారు.కానీ వైసీపీ సోషల్ మీడియా నెగిటివ్ గా ప్రచారం చేస్తోంది. ఇందుకుగాను సోషల్ మీడియా ఇన్ చార్జి భార్గవ్ 1000 మందిని రిక్రూట్ చేసుకున్నారన్న వార్తలు వస్తున్నాయి. పాదయాత్రలో వీరు మమేకమవుతుండడంతో టీడీపీకి జనసమీకరణ ఇబ్బందులు లేకుండా చేస్తున్నారన్న టాక్ నడుస్తోంది. జనాలు లేని ప్రాంతంలో ఫొటోలు అప్ లోడ్ చేయడం, గతంలో లోకేష్ పర్యటనల్లో కనిపించే లోపాలను పాదయాత్రలో ఉన్నట్టు చూపిస్తున్నారు. అయితే ఇప్పటికే ఇటువంటి ప్రచారాలకు అలవాటు పడిపోయిన ప్రజలు రివర్స్ గా ఆలోచించి లోకేష్ పాదయాత్రకు పాస్ మార్కులు వేస్తున్నారు.
దీనికితోడు లోకేష్ పాదయాత్రకు పోలీసులు అడుగడుగునా అడ్డు తగులుతున్నారు. ఈ రహదారిలో వద్దు.. ఇక్కడ సభలు పెట్టొద్దు అని రభస చేస్తున్నారు. దీనిపై లోకేష్ కూడా అదే స్థాయిలో స్పందిస్తున్నారు. ఘాటుగానే రిప్లయ్ ఇస్తున్నారు. తన ప్రసంగాల్లో సైతం ప్రభుత్వ తీరును ఎండగడుతున్నారు. అయితే ఇవేవీ పాదయాత్రలో ముందస్తు ప్లాన్ గా రచించినవి కాదు. అప్పటికప్పుడు పోలీసుల ద్వారా ప్రభుత్వం అడ్డంకులు సృష్టించడంతో ఆటోమేటిక్ గా సోషల్ మీడియాలో అవే హైప్ అవుతున్నాయి. లోకేష్ పాదయాత్రకు ప్రచారం కల్పిస్తున్నాయి. ఈ సంస్కృతి ఇలానే సాగితే మాత్రం లోకేష్ పాదయాత్ర సక్సెస్ ఫుల్ చేసిన ఘనత వైసీపీ సర్కారుకే దక్కుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.