YCP colors in tirumala: ‘‘అపచారం.. మహాపచారం.. ఆఖరుకు కలియుగ ప్రత్యక్ష దైవం.. ఆ తిరుమలేషుడికి కూడా ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ రంగులను పలిమిస్తారా? ఎంత ఘోరం..’ అంటూ హిందూ వాదులు నెత్తినోరు కొట్టుకుంటూ ఆరోపిస్తున్నారు. వైసీపీ సర్కార్ వచ్చాక హిందూ దేవాలయాలపై దాడులు.. పలు ఇతర మతాల మిళితాలు జరిగి పెద్ద వివాదాలు చెలరేగాయి. అన్యమత ప్రచారం చేస్తూ హిందుత్వాన్ని జగన్ సర్కార్ దెబ్బతీస్తోందని ఏపీ బీజేపీ పెద్ద ఎత్తున ఉద్యమించింది. అంతర్వేది రథానికి నిప్పు పెట్టడం.. తిరుమల బస్సు టికెట్లలో అన్యమత ప్రచారం.. ఏపీలోని దేవాలయాలపై వరుస దాడులు కలకలం రేపాయి. ఇది దేశవ్యాప్తంగా వివాదాస్పదమైంది. తాజాగా ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకుంది.

జగన్ సర్కార్ హయాంలో జరిగిన హిందూ మత అపచారాలపై ఏపీ బీజేపీ, టీడీపీ, జనసేనలు పెద్ద ఉద్యమమే చేశారు. నినదించారు. ఇప్పటికీ చాలా చోట్ల దేవాలయాలపై దాడులు చేసిన దోషులను పట్టుకోలేదన్న విమర్శ ఉంది. సీఎం జగన్ క్రిస్టియానిటీని నమ్మడంతో ఆయనపై కూడా ఈ అపవాదు ఉంది. అయితే ఎంత వైసీపీ నేతలు కవర్ చేసే ప్రయత్నాలు చేసినా కూడా ఆ ప్రభుత్వంపై పడ్డ మరకలు మాత్రం పోవడం లేదు.
అవన్నీ చాలదన్నట్టు ఇప్పుడు వైసీపీ స్వామి భక్తి మరీ ఎక్కువైపోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా హిందుత్వానికి నెలవైన తిరుమల వేంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలంటే అందరికీ ఒక పండుగ. అలాంటి పండుగ వేడుకను కనులారా చూసేందుకు దేశ విదేశాల నుంచి భక్తులు తరలివస్తుంటారు. కానీ ఇక్కడ కూడా వైసీపీ రంగులు కనిపించడం చూసి విస్తుపోతున్నారు. ఆ దేవుడికి వైసీపీ రంగులు పులుముతారా? అన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
సాధారణంగా ఆ దేవదేవుడికి పసుపు, కుంకుమ, కాషాయం లాంటి రంగులతో అలంకరిస్తారు. కానీ వైసీపీ సర్కార్ హయాంలో మొదలైన తిరుమల బ్రహ్మోత్సవాలకు ఈసారి టీటీడీ అధికారులు స్వామిభక్తి చాటుకున్నారు. హిందుత్వ రంగులను పక్కనపడేసి ‘వైసీపీ జెండా’లోని నీలం రంగును పులిమారు. ఇప్పుడు ఇది పెద్ద వివాదాస్పదమవుతోంది. హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని.. ఆ దేవ దేవుడికి పార్టీ రంగులు పులుముతారా? అని హిందుత్వవాదులు మండిపడుతున్నారు.
ఏపీలో వైసీపీ ప్రభుత్వం కొలువుదీరాక ఆలయాలపై దాడులు పెరిగిపోయాయన్నది అందరూ కాదనలేని వాస్తవం. వరుసగా ఏపీలోని ఆలయాలపై దాడులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. శతాబ్ధాల చరిత్ర కలిగిన అంతర్వేది రథం దగ్గమైంది. విజయనగరం జిల్లా రామతీర్థం క్షేత్రంలోని బోధికొండపై ఉన్న కోదండరాముడి విగ్రహాన్ని కొందరు ధ్వంసం చేయడం ఉద్రిక్తతకు దారితీసింది. స్వామి విగ్రహాన్ని ధ్వంసం చేసిన విధానం.. శిరస్సు కనిపించకుండా పోవడం చూసి బీజేపీ నేతలు, హిందువులు మండిపడ్డారు.. ఏపీలో ఏడాదిన్నరగా దేవతా విగ్రహాలు, ఆలయ రథాలు ధ్వంసం చేస్తూనే ఉన్నా ఆ కేసుల్లో ఇప్పటికీ ఒక్కటీ తేలలేదు.
రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఈ దుర్మార్గపు చర్యలు రాష్ట్రంలో సాగుతున్నాయని.. హిందూ ఆలయాలపై దాడులు పెరిగిపోతుంటే ముఖ్యమంత్రి ఎందుకు స్పందించడం లేదని బీజేపీ నేత సోము వీర్రాజు, జనసేన నేత పవన్ లు గతంలో ప్రశ్నించారు. ఏపీ బీజేపీ దీనిపై పోరుబాట కూడా పట్టింది. సీఎం జగన్ కు ఏ మత విశ్వాసం ఉన్నా పరమతాలను గౌరవించాలని పవన్ హితవు పలికారు కూడా.. అయితే ఇప్పటికీ ఇంత రచ్చ జరిగినా కూడా పవిత్రమైన తిరుమల బ్రహ్మోత్సవాల వేళ వైసీపీ రంగును పులమడం మరో వివాదానికి దారితీసింది.