TDP – BJP : బీజేపీని వదులుకునే సాహసం చంద్రబాబు చేస్తారా?

బిజెపి స్నేహాన్ని వదులుకోవడానికి ఇష్టపడడం లేదు. అందుకే ఎలా చూసుకున్నా చంద్రబాబు బీజేపీని ఇప్పట్లో విడిచి పెట్టే ఛాన్స్ లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Written By: Dharma, Updated On : October 2, 2023 8:54 am
Follow us on

TDP BJP Alliance : బిజెపితో అమీతుమీ తేల్చుకోవడానికి చంద్రబాబు సిద్ధపడుతున్నారా? టిడిపి శ్రేణుల నుంచి తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇన్ని అవమానాల మధ్య బిజెపి ప్రాపకం కోసం చంద్రబాబు ప్రయత్నించడం ఏమిటని సగటు తెలుగు తమ్ముళ్లు తీవ్ర మదనపడుతున్నారు. చంద్రబాబు అరెస్టు వెనుక జగన్కు కేంద్ర పెద్దల సహకారం ఉందని అనుమానిస్తున్నారు. ఆ అనుమానాలు మరింత ముదిరేలా ఎల్లో మీడియా కథనాలు వండి వార్చుతోంది. మరోవైపు వామపక్షాలు సైతం బిజెపిని విడిచిపెడితే సపోర్ట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేస్తున్నాయి. కానీ ఇప్పుడున్న క్లిష్ట పరిస్థితుల్లో సడన్ నిర్ణయం తీసుకోవడం సాధ్యమేనా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇప్పుడు ఎటువంటి నిర్ణయం తీసుకోవాలనుకున్నా.. అది జనసేనతో కలిసి తీసుకోవాల్సి ఉండడంతో.. చంద్రబాబు సైతం ఆచీతూచీ వ్యవహరిస్తున్నారు.

వాస్తవానికి భారతీయ జనతా పార్టీతో పొత్తు సగటు టిడిపి అభిమానికి ఇష్టం లేదు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని జగన్ దారుణంగా దెబ్బతీస్తుంటే.. నాయకత్వాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తుంటే.. అడ్డుకట్ట వేయని కేంద్ర పెద్దలు.. రేపు ఎలా కలిసి వస్తారని ఎక్కువమంది ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ పొత్తు కుదిరినా రెండు పార్టీల మధ్య ఓట్ల బదలాయింపు జరగదని భావిస్తున్నారు. అటువంటప్పుడు పొత్తు గురించి ఆలోచించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు రిమాండ్ ఖైదీగా మూడు వారాలుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో గడుపుతున్నారు. కానీ కనీసం కేంద్ర పెద్దలు ఆరా తీసినట్లు కూడా లేదు. కనీసం కుటుంబ సభ్యులకు సైతం పరామర్శించలేదు. అదే తెలంగాణలో వైయస్సార్ టిపి అధ్యక్షురాలు షర్మిల అరెస్టు అయితే.. నేరుగా ప్రధాని మోదీ ఫోన్ చేసినట్లు వార్తలు వచ్చాయి. కనీసం షర్మిల విలువ కూడా చంద్రబాబు చేయరా అని తెలుగు తమ్ముళ్లు తెగ బాధపడుతున్నారు.బిజెపితో కటీఫ్ చెప్పడమే శ్రేయస్కరమని భావిస్తున్నారు.

అయితే చంద్రబాబు మాత్రం దీర్ఘాలోచనలో ఉన్నారు. గత ఎన్నికలకు ముందు బిజెపిని విభేదించినందుకు మూల్యం చెల్లించుకున్న విషయాన్ని గుర్తు గుర్తు చేసుకుంటున్నారు. నాడు ఎదురు తిరిగిన ఫలితానికే.. నేటి ఈ పరిస్థితికి కారణమని చంద్రబాబుకు తెలుసు. అందుకే జాగ్రత్తగా అడుగులు వేయాలనుకుంటున్నారు.

మరోవైపు తన నాయకత్వం బలోపేతం కావడానికి భారతీయ జనతా పార్టీయే కారణమని చంద్రబాబు నమ్మకం.1995లో టిడిపిని హస్తగతం చేసుకున్న తర్వాత.. 1998 సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి ఏపీలో 42 ఎంపీ స్థానాలకు గాను.. తెలుగుదేశం పార్టీ 12 స్థానాలకే పరిమితమైంది. దీంతో చంద్రబాబు పని అయిపోయిందని అంతా భావించారు. కానీ అటు తరువాత 1999 ఎన్నికల్లో టిడిపి, బిజెపి కలిసి నడిచాయి. 42 స్థానాలు గాను 34 వరకు ఈ కూటమి గెలుచుకుంది. అటు ఏపీలో సైతం చంద్రబాబు అధికారంలోకి రాగలిగారు. జాతీయ స్థాయిలో సైతం రాణించగలిగారు. 2004లో ఈ కూటమి ఫెయిల్ అయినా.. 2014లో వర్క్ అవుట్ అయిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేసుకుంటున్నారు. అందుకే 2024 ఎన్నికల్లో సైతం బిజెపితో కలిసి నడిచేందుకు సిద్ధపడుతున్నారు.

కేంద్ర ప్రభుత్వం సహాయ నిరాకరణ చేస్తే.. రాష్ట్ర ప్రభుత్వం ఏ స్థాయిలో నష్టపోతుందో చంద్రబాబుకు తెలిసినంతగా మరొకరికి తెలియదు. సరిగ్గా గత ఎన్నికల ముంగిట చంద్రబాబు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు. మోడీ సర్కార్ తో గొడవ పెట్టుకున్నారు. విభజన హామీలు పరిష్కారం కాలేదు. అటు కేంద్రం నుంచి నిధులు రావడం కూడా నిలిచిపోయాయి. ప్రజలు దూరం కావడానికి ఇదో కారణంగా మిగిలింది. మరోవైపు తనతో కలిసి నడవాలనుకుంటున్న పవన్.. బిజెపి స్నేహాన్ని వదులుకోవడానికి ఇష్టపడడం లేదు. అందుకే ఎలా చూసుకున్నా చంద్రబాబు బీజేపీని ఇప్పట్లో విడిచి పెట్టే ఛాన్స్ లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.