Bhogi 2024: మూడు లేదా నాలుగు రోజులపాటు జరిగే సంక్రాంతి పండగ భోగితో ప్రారంభమవుతుంది. భోగి పండుగ భోగభాగ్యాలను కలుగజేస్తుందని పురాణాలు చెబుతున్నాయి. భోగిమంటల్లో వేడిని వణికించే చలి మధ్య ఆస్వాదిస్తూ ఉంటే శరీరంలో వేడి పెరుగుతూ ఉంటుందని.. వివిధ రకాల రుగ్మతలు ఈ వేడికి తగ్గిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. చలికాలంలో చర్మం పొడి బారుతుంది. జలుబు వంటివి ఇబ్బంది పెడతాయి. బయట వాతావరణం లో ఉష్ణోగ్రత తగ్గడంతో సహజంగా శరీరానికి వేడి అవసరం ఉంటుంది. అలాంటప్పుడు వేసే భోగిమంటల ద్వారా శరీరం ఎంతో కొంత వేడిని గ్రహిస్తుంది. పైగా కర్రలు మండటం వల్ల వచ్చే వేడి వివిధ రుగ్మతలను దూరం చేస్తుంది అని నమ్మిక.
ఇక భోగి పండుగ రోజు చిన్నారులపై రేగుపండ్లు పోస్తారు. వీటిని భోగి పండ్లు అని కూడా పిలుస్తుంటారు. సంస్కృతంలో వీటికి ఆర్క ఫలాలు అనే పేరు కూడా ఉంది. ఆర్కుడు అంటే సూర్యుడు అని అర్థం. సూర్యుడు ఉత్తరాయణం వైపు మళ్ళే కాలం కావడంతో ఆ దేవదేవుడి కరుణాకటాక్షాలు పిల్లలపై ఉండాలని ఈ రేగు పండ్లను వారి తలల మీద పోస్తారు. ఆవు పిడకలను పొయ్యిలో అంటించి, మట్టి కుండలో నీళ్లు వేడి చేసి, ఇత్తడి బకెట్లలో ఆ నీటిని పోసి.. చిన్నారుల తలకు నువ్వుల నూనె మర్దన చేసి .. ఆ తర్వాత భోగి పండ్లను పోస్తూ ఉంటారు.. భోగిపండ్లల్లో బంతిపూల రెమ్మలు, చిరుధాన్యాలు, చిల్లర నాణాలు వేస్తారు. అనంతరం ఆ వేడి వేడి నీళ్లను చిన్నారుల తలమీద పోసుకుంటూ స్నానం చేపిస్తారు. ఇలా భోగి పండ్లను నెత్తిమీద పోయడం వల్ల సూర్యుడి దీవెనలు పిల్లలకు దక్కుతాయని ఒక నమ్మిక. ఆవు పేడతో తయారుచేసిన పిడకలను అంటించడం ద్వారా ఉద్భవించే వేడి మట్టి కుండలో ఉన్న నీళ్లను మసలేలా చేస్తుంది. ఇవన్నీ కూడా ప్రకృతి సంబంధమైనవి కావడంతో శరీరంలో ఏమైనా రుగ్మతలు ఉంటే వాటిని దూరం చేస్తాయి. పిల్లల్లో రోగ నిరోధక శక్తిని పెంచుతాయని ఒక నమ్మకం.
రేగుపండ్లలో పోషకాలు అధికంగా ఉంటాయి. వీటిని తలపై పోస్తే పిల్లలు ఆయురారోగ్యాలతో ఉంటారని.. వారిపై ఉన్న చెడు దిష్టి మొత్తం పోతుందని ఒక నమ్మకం. తలపై భాగంలో ఉండే బ్రహ్మ రంధ్రంపై రేగు పండ్లు పడటం వల్ల అది ప్రేరేపితమై.. చిన్నారుల్లో మేథోశక్తిని పెంపొందిస్తుందని ఒక నమ్మకం. రేగుపండ్లల్లో సీ విటమిన్ అధికంగా ఉండటం వల్ల అది రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. ఊపిరితిత్తులు, జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. శరీరంలో తేమను క్రమబద్ధీకరిస్తుంది. అంతేకాదు చర్మ సంబంధిత రుగ్మతలను దూరం చేస్తుంది. అంతేకాదు తీపి, వగరు కలయికతో ఉండటంవల్ల.. ఆ పండ్ల లోని గుజ్జు శరీరంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రిస్తుంది.. ఇంతటి ప్రాశస్త్యం ఉంది కాబట్టే భోగినాడు రేగు పండ్లను తల మీద పోస్తారు. ఆంధ్ర ప్రాంతంలో రేగుపండ్లను, చింతపండు, ఉప్పు, కాస్త కారం కలిపి వడియాలుగా చేసి నేతిలో వేయించుకుని తింటారు.