Pawan kalyan And Chandrababu: ఏపీ వ్యాప్తంగా సంక్రాంతి వేడుకలు ప్రారంభమయ్యాయి. ప్రజలు భోగి పర్వదినాన్ని ఘనంగా జరుపుకున్నారు. సంక్రాంతి రంగవల్లులతో గ్రామాలు శోభాయమానంగా మారాయి. సరికొత్త కలను సంతరించుకున్నాయి. సంక్రాంతి వేడుకలకు రాజకీయ శోభ కనిపిస్తోంది. టిడిపి, జనసేన ఉమ్మడిగా భోగి వేడుకలను జరుపుకోవడం విశేషం. గుంటూరు జిల్లా మందడం లో ఏర్పాటు చేసిన భోగి వేడుకల్లో చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఇరు పార్టీల కీలక నాయకులు నాదెండ్ల మనోహర్, వర్ల రామయ్య, మాగంటి బాబు సైతం పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలకు భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
తెలుగు జాతికి స్వర్ణ యుగం- సంక్రాంతి సంకల్పం అనే కాన్సెప్ట్ తో ఈ వేడుకలు నిర్వహించారు. ఇరు పార్టీల నాయకులు భారీగా హాజరయ్యారు. తొలుత చంద్రబాబు, పవన్ భోగి మంటలను వెలిగించారు. అధికార వైసీపీకి చెందిన మేనిఫెస్టో కాపీలతో పాటు ప్రజా వ్యతిరేక జీవోలను తగులుబెట్టారు. నాగలి, చర్నాకోళా, కోడిపుంజు పట్టుకొని ఫోటోలకు ఫోజులిచ్చారు. అనంతరం ఇద్దరు నేతలు కీలక ప్రసంగం చేశారు. ఈ రాష్ట్ర ప్రజలు బాగుపడాలంటే టిడిపి, జనసేన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేశారు. సమాజ శ్రేయస్సు, రాష్ట్ర ప్రగతిని దృష్టిలో పెట్టుకొని సంక్రాంతి సంకల్పాన్ని తీసుకున్నామని.. ఈ రాష్ట్రం నుంచి వైసీపీని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.
అమరావతి ఏకైక రాజధాని అని స్పష్టం చేశారు.వచ్చే ఎన్నికల్లో టిడిపి, జనసేన కూటమి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాజధాని అమరావతి కోసం ఈ ప్రాంత రైతులు 33,000 ఎకరాలను తృణప్రాయంగా చంద్రబాబుకు అప్పగించిన విషయాన్ని పవన్ గుర్తు చేశారు. అలాంటి రైతులను వైసిపి ప్రభుత్వం దారుణంగా వంచిందని విమర్శించారు. ఇకపై జై అమరావతి తో పాటు జై ఆంధ్ర అనే నినాదాన్ని కూడా తీసుకోవాలని పవన్ పిలుపునిచ్చారు. అమరావతి రైతులకు తాము మాట ఇస్తున్నామని.. వారి త్యాగాన్ని విస్మరించబోమని తేల్చేశారు. ఏ ఉద్దేశం కోసం పంట పొలాలను అందించారో.. దానిని సంపూర్ణంగా నెరవేర్చేలా కృషి చేస్తామని.. బంగారు రాజధానిని నిర్మిస్తామని పవన్ తేల్చి చెప్పారు. అమరావతి రాజధాని సమస్య ఒక ప్రాంతీయులది కాదని… అందుకే జై అమరావతి తో పాటు జై ఆంధ్ర అని నినదించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు పవన్ కళ్యాణ్. అయితే ఎన్నడూ లేని విధంగా భోగి వేడుకలను వినూత్నంగా నిర్వహించి జగన్ కు ఇద్దరు నేతలు గట్టి సవాల్ విసిరారు.