ToP 10 most Generous Philathropists : ” నా ఊరు నాకు చాలా ఇచ్చింది. తిరిగి ఇచ్చేయాలి. లేకుంటే చాలా లావయిపోతాను” శ్రీమంతుడు సినిమాలో శృతిహాసన్ చెప్పే డైలాగ్ ఇది. కానీ దీనిని నిజ జీవితంలో ఎప్పటినుంచో అమలు చేసి నిరూపిస్తున్నారు ఈ అపర కుబేరులు. పురాణాల ప్రకారం కుడి చేత్తో చేసింది ఎడమ చేతికి కూడా తెలియొద్దు అంటారు. కానీ అలాంటి దానకర్ణులను చూసి మరింత మంది ప్రేరణ పొందాలంటే తెలియాలి. కచ్చితంగా తెలియాలి. అసలే ఇప్పుడు సోషల్ మీడియా రోజులు కాబట్టి.. ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా వెంటనే ప్రపంచానికి తెలిసిపోతుంది. అలాంటిది అపర కుబేరులు దానం చేస్తే తెలియకుండా ఎలా ఉంటుంది? దాచేస్తే ఎలా దాగుతుంది?

-అపర దాన కర్ణుడు ఇతడే
హెచ్ సీఎల్.. బహుశా ఈ కంపెనీ అంటే తెలియని భారతీయులు ఉండరు. ఒక భారతదేశమే కాకుండా ప్రపంచంలోని పలు దేశాల్లో ఈ కంపెనీ విస్తరించింది. వేలాదిమందికి అన్నం పెడుతోంది.. అదే స్థాయిలో పేదలకు విద్య, వైద్యం, మౌలిక వసతుల కల్పనలో విశేషమైన కృషి చేస్తోంది.. ఈ కంపెనీ వ్యవస్థాపకుడు శివ్ నాడార్ భారతదేశంలోనే అపర దానకర్ణుడిగా గుర్తింపు పొందారు.. ప్రతిరోజు మూడు కోట్ల రూపాయలు దాతృత్వ కార్యక్రమాలకు ఖర్చు చేస్తున్నారు. ఇప్పటివరకు 1161 కోట్లను దాతృత్వ కార్యక్రమాలకు ఖర్చు చేశారు. తన సంపాదనలో 90 శాతం వరకు దాతృత్వ కార్యక్రమాలకే వెచ్చిస్తానని ఇటీవల ఆయన ప్రకటించారు. ఆయన కంపెనీ బాధ్యతలను ఆయన కూతురు పర్యవేక్షిస్తున్నారు.
-ఆ నగరం నుంచే ఎక్కువ
సమాజ హితాన్ని కోరి దాతృత్వ కార్యక్రమాలకు భారీగా విరాళాలు ఇస్తున్న నగరాల్లో ముంబై మొదటి స్థానంలో ఉంది.. ఈ నగరంలో 33 శాతం మంది దాతృత్వ కార్యక్రమాలకు భారీగా విరాళాలు ఇస్తున్నారు.. ఆ తర్వాత స్థానం లో ఢిల్లీ ఉంది.. ఇక్కడ 16 శాతం మంది వ్యాపారవేత్తలు దాతృత్వ కార్యక్రమాలకు విరాళాలు ఇస్తున్నారు.. ఇక దేశ ఐటీ రాజధాని బెంగళూరులో 13 శాతం వ్యాపారవేత్తలు తమ సంపాదనలో కొంత భాగాన్ని దాతృత్వ కార్యక్రమాలకు వెచ్చిస్తున్నారు.. ఇక దాతృత్వ కార్యక్రమాలకు భారీగా విరాళాలు ఇస్తున్న పరిశ్రమల్లో ఫార్మా రంగం వాటా 20%, కెమికల్స్, పెట్రో కెమికల్స్ వాటా 11 శాతం ఉంది.
-భారీగా విరాళాలు ఇచ్చింది వీరే
శివ్ నాడార్ 1,161 కోట్లు, విప్రో అజీమ్ ప్రేమ్ జీ 484 కోట్లు, ముకేశ్ అంబానీ 411 కోట్లు, కుమార్ మంగళం బిర్లా 242 కోట్లు, సుస్మిత, సుబ్రతో బార్చీ 213 కోట్లు, రాధా, ఎన్ ఎస్ పార్థసారథి 213 కోట్లు, గౌతమ్ అదాని 190 కోట్లు, అనిల్ అగర్వాల్ 165 కోట్లు, నందన్ నిలేఖని 159 కోట్లు, ఏఎం నాయక్ 142 కోట్లు విరాళాలుగా ఇచ్చారు. వీరిలో అనిల్ అగర్వాల్ కోవిడ్ నివారణకు సంబంధించి చేసే ప్రయోగాలకు విరాళం ఇచ్చారు.. ఇక మిగతా వారిలో విద్యారంగం, పరిరక్షణ, సంస్కృతి పరిరక్షణ, సామాజిక పరివర్తన కోసం విరాళాలు ఇచ్చారు. ఇక భారీ విరాళాలు ఇచ్చిన వారిలో అతి చిన్న వయస్కాలిగా జెరోదా నిఖిల్ కామత్ ఉన్నారు.. రోహిణి నిలేఖని అపర దాన కర్ణురాలిగా పేరు గడించారు.
-తిరిగి ఇచ్చేస్తున్నారు
సమాజం తమకు ఇవ్వడం వల్లే ఈ స్థాయిలో ఉన్నామని గుర్తించిన పలువురు పారిశ్రామికవేత్తలు… సమాజ అభివృద్ధికి ఎంతో కొంత విరాళం ఇస్తున్నారు. ఇక భారత దేశంలో 15 మంది పారిశ్రామికవేత్తలు ప్రత్యేక 100 కోట్లకు పైగా విరాళాలు ఇస్తున్నారు.. 50 కోట్లు ఇచ్చే పారిశ్రామికవేత్తలు 20 మంది, 20 కోట్లు అంతకన్నా ఎక్కువ ఇచ్చే పారిశ్రామికవేత్తలు 43 మంది ఉన్నారు. ఇక దాతృత్వ కార్యక్రమాలకు విరాళాలు ఇచ్చే పారిశ్రామికవేత్తల సరాసరి వయసు 69 సంవత్సరాలుగా ఉంది.. ఇక ఈ జాబితాలో ఇటీవల 19 మంది చేరారు.. వారు సరాసరి 832 కోట్ల రూపాయలను విరాళాలుగా ఇచ్చారు.. ఇక పారిశ్రామికవేత్తలు ఎక్కువగా విద్యారంగం బలోపేతానికే ఎక్కువగా విరాళాలు ఇస్తున్నారు.. 75 మంది దాతలు కేవలం విద్యారంగానికే 1233 కోట్లు విరాళంగా ఇచ్చారు. ఇక ఎటువంటి వ్యాపార నేపథ్యం లేని 51 మంది దాతల జాబితాలో ఉన్నారు.
-మహిళా విభాగంలో..
ఇక దాతలకు సంబంధించి మహిళల విభాగంలో రోహిణి నిలేఖని మొదటి స్థానంలో ఉన్నారు.. ఈమె 120 కోట్లు విరాళంగా ఇచ్చారు.. లీనా గాంధీ తివారి 21 కోట్లు ఇచ్చారు. అను అగ 20 కోట్లు, మంజు డీ గుప్తా 16 కోట్లు, రేణు ముంజల్ 10 కోట్లు, కిరణ్ మజుందార్ షా 7 కోట్లు విరాళాలుగా ఇచ్చారు..