Moinabad Farmhouse- TRS MLAs: తెలంగాణలో రాజకీయాలు అనుహ్యంగా మారుతున్నాయి. బుధవారం రాత్రి మొయినాబాద్ లోని పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో చోటు చేసుకున్న పరిణామాలు థ్రిల్లర్ సినిమాను తలపిస్తున్నాయి.. ఫలితంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీల మధ్య వాదోపవాదాలకు దారితీస్తున్నాయి. ఈ మొత్తం ఎపిసోడ్లో అధికార టీఆర్ఎస్ నేతల మాటలు ఒక విధంగా.. అందుకు భిన్నంగా బిజెపి నాయకుల వ్యాఖ్యలు ఉండటం ఆసక్తికరంగా మారింది. ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించినట్టు చెబుతున్న నందకుమార్ అలియాస్ నందు వైపే వెళ్ళన్నీ చూపిస్తున్నాయి. నందుకు టిఆర్ఎస్ నేతలతో పాటు బిజెపి నాయకులకు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు తెలుస్తోంది.

డీల్ ఏదైనా సరే
అనునిత్యం హై ప్రొఫైల్ వ్యక్తులతో తిరిగే నందకుమార్ డీల్స్ కుదరచడంలో దిట్ట. గతంలో హైదరాబాద్ నగర పరిధికి చెందిన ఎమ్మెల్యేకు మొయినాబాద్ శివారులో ఫామ్ హౌస్ కూడా సమకూర్చి పెట్టాడని, ఇందుకు ప్రతిగా ఆయన సదరు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ పరిధిలో తనకు అనుకూలమైన వ్యక్తికి మునిసిపల్ చైర్మన్ పదవి దక్కించుకున్నాడని వినికిడి. ఇక డీల్ ఏదైనా సరే దాన్ని పూర్తి చేసే వరకు నందు ప్రయత్నిస్తూనే ఉంటాడని పొలిటికల్ సర్కిల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. కేంద్ర మంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు కిషన్ రెడ్డితో నందుకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇదే సమయంలో టిఆర్ఎస్ నాయకులతోనూ సంబంధాలు ఉన్నాయి. తాజాగా ఆ నలుగురు టిఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో ఒకరు నందుతో అత్యంత సమితంగా ఉంటారని తెలుస్తోంది. వాస్తవానికి ఫామ్ హౌస్ కు నలుగురు ఎమ్మెల్యేలతో పాటు అధికార పార్టీ చెందిన ఎంపీ కూడా హాజరు కావాల్సి ఉంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన సదర్ ఎంపీ కూడా ఈ మీటింగ్ కు రావాల్సి ఉన్నప్పటికీ.. ఆఖరి నిమిషంలో కుదరని చెప్పినట్టు తెలుస్తోంది.. అంతేకాదు మరో ఇద్దరు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఈ భేటీకి హాజరు కావాల్సి ఉందని, అనివార్య కారణాల వల్ల రాలేదన్న మాట రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తోంది. ఇక నందకుమార్ కు హైదరాబాద్ శివారు చంద్ర టిఆర్ఎస్ ఎమ్మెల్యే కుమారులతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు తెలుస్తోంది.
ఆ ఎమ్మెల్యే చొరవ తోనే
నందుకు సహితంగా ఉండే టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఒకరి చెరువుతో ఈ భేటీ మొదలైనట్టు తెలుస్తోంది. దీనికి కాస్త ముందుగా తమ భేటీ అయ్యే విషయాన్ని సొంత పార్టీకి చెందిన కీలక నేతతో షేర్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఈ స్కెచ్ ఎవరిది అన్న ప్రశ్నకు సూటి సమాధానం మాత్రం లభించడం లేదు.. పోలీసు వర్గాలు వెల్లడించిన వివరాలపై రాజకీయ వర్గాల్లో భిన్నమైన సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఈ ఘటనపై టిఆర్ఎస్ పార్టీకి చెందిన ముఖ్యమైన నేత చేసిన విశ్లేషణ మాత్రం ఆసక్తికరంగా ఉంది. ” ఒకటి టిఆర్ఎస్ ఎమ్మెల్యే చొరవతో ఈ సమావేశం మొదలైంది. విచిత్రంగా ఆఖరి నిమిషంలో ఆ ఎమ్మెల్యే ప్లేటు ఫిరాయించాడు. డబుల్ గేమ్ ఆడాడు” అంటూ సదరు నేత పేర్కొన్నారు.

ప్రగతి భవన్ డైరెక్షన్లో నేనా
వాస్తవానికి ఆ ఎమ్మెల్యే టిఆర్ఎస్ లో నంబర్ 2 గా వెలుగొందుతున్న వ్యక్తికి అత్యంత సన్నితంగా ఉంటాడు. సొంత నియోజకవర్గాన్ని వదిలిపెట్టి హైదరాబాదులోనే చక్కర్లు కొడుతూ ఉంటాడు. పైగా తన నియోజకవర్గంలో తన అనుచరులతోనే సమాంతర పాలన సాగిస్తూ ఉంటాడు. సెటిల్మెంట్లు చేయడంలో మాత్రం దిట్ట. ఎమ్మెల్యే అయిన తర్వాత హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో భారీగా భూములు కొన్నాడు. ఈ ప్రాంతంలో ముందుగానే ప్రాజెక్టులు వస్తున్నాయని తెలుసుకున్నాడో ఏమో గాని.. ఇప్పుడు ఆయన కొన్న ఎకరం భూమి విలువ 40 కోట్లకు పై మాటే. నడ మంత్రపు సిరి రావడంతో విలాసాలకు బాగా అలవాటు పడ్డాడు. హై ప్రొఫైల్ జీవితాన్ని అనుభవిస్తున్నాడు. ఎక్కువగా సినీ తారలతో ఫంక్షన్లలో పాల్గొంటాడు. ఈ క్రమంలోనే ఈ ఎమ్మెల్యేకు, నందకుమార్ కు పరిచయం ఏర్పడిందని, ఈ భేటీకి దారి తీసింది అని పొలిటికల్ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం ఉంది.. అయితే చివరి నిమిషంలో ప్రగతి భవన్ నుంచి ఫోన్ రావడంతో అతడు తప్పుకున్నట్టు తెలుస్తోంది. కాగా ఈ ఎపిసోడ్ తర్వాత ఎమ్మెల్యే ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం గమనార్హం.