KCR- Revanth Reddy: మొయినాబాద్ ఫామ్ హౌస్ లో జరిగిన ఘటనకు.. గతంలో రేవంత్ రెడ్డియ ఘటనకు సంబంధం ఉందా? నాడు డబ్బు కలకలం సృష్టించగా.. నేడు కూడా అదే స్థాయిలో డబ్బు కట్టలు లభ్యం కావడం దేనికి సంకేతం? వీటి వెనుక ఉన్నది ఎవరు? గతంలో జరిగిన ఘటనకు ఇప్పటి ఘటనకు సారుప్యత ఏమున్నది? రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది.

2015 మే 31.. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ ఇంట్లో.. ఇప్పుడు నలుగురు ఎమ్మెల్యేలతో మొయినాబాద్ ఫామ్ హౌస్ లో.. డబ్బులు తీసుకునేందుకు అంగీకరించి.. వాటితో తమ వద్దకు రప్పించుకుని మరీ పోలీసులకు పట్టించిన ఘటనలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అప్పట్లో రేవంత్ ని పట్టించేందుకు ముందస్తుగానే ప్లాన్ చేసిన స్టీఫెన్సన్.. అందుకు పక్కాగా ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. అతడి ఇంట్లో పట్టుకోవాలని నిఘా కెమెరాలు అమర్చి రేవంత్ ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి ప్రతి క్షణాన్ని రికార్డు అయ్యేలా చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థికి ఓటు వేసేందుకు గాను రేవంత్ డబ్బుల ఎర చూపడం, వారి మధ్య సంభాషణ మొత్తాన్ని రికార్డు చేశాక పోలీసులు వచ్చి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని అరెస్టు చేయడం తెలిసింది. దీంతో రేవంత్ ఏ విధంగానో తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది. తాను రోడ్డుపై ఉండగా పోలీసులు కొట్టి స్టీఫెన్సన్ ఇంటికి తీసుకెళ్లారని రేవంత్ ఆరోపించినా వీడియో దృశ్యాలను బయట పెట్టడంతో మరో మాట మాట్లాడలేని పరిస్థితి ఏర్పడింది.
– తాజా ఎపిసోడ్ లో
ఇప్పుడు నలుగురు టిఆర్ఎస్ ఎమ్మెల్యేల వ్యవహారం కూడా 2015 నాటి ఘటన తలపిస్తోంది. ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాచారంతోనే తాము పక్కాగా ఆపరేషన్ నిర్వహించామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర చెబుతున్నారు. పార్టీ మారితే 100 కోట్ల నగదు తో పాటు కాంట్రాక్టులు ఇస్తామంటూ తమను ప్రలోభ పెట్టారని చెప్పిన ఎమ్మెల్యేలు ఆపరేషన్లు పాత్రధారులు అయ్యారు. డబ్బులు ఇస్తామన్న వ్యక్తులను రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ కి రప్పించి అక్కడ ముందుగానే కెమెరాలు అమర్చి డబ్బుల విషయంపై చర్చలు జరిపారు. అంత పోలీసుల ప్లాన్ ప్రకారం జరగడం, వారు వచ్చి దాడి చేయడం చకచకా జరిగిపోయాయి. ఇప్పుడు కూడా ఆ వ్యక్తులు తమకు సంబంధం లేదని చెప్పడానికి వీల్లేని విధంగా రికార్డుల్లో ఇరికించారు.

ఈ రెండు సందర్భాల్లోనూ డబ్బులు ఇచ్చేందుకు వెళ్లిన వారే అడ్డంగా బుక్ అయ్యారు. అప్పట్లో రేవంత్ రెడ్డి కేసు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. కూడా అది ఆయనను వెంటాడుతూనే ఉంది. తాజా సంఘటన వెనుక బిజెపి నాయకుల ప్రమేయం ఉందని టిఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు.. అయితే ఇది మునుముందు ఎవరి మెడకు చుట్టుకుంటుందో తెలియదు గానీ.. ఈ రెండు ఘటనల్లోనూ టిఆర్ఎస్ నాయకత్వం తమ ప్రణాళికను పక్కాగా అమలు చేసింది. ఎప్పుడైతే పోలీసులు వచ్చి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారో.. వెంటనే ఆ నలుగురు ఎమ్మెల్యేలకు ఫోన్లు రావడంతో హుటాహుటిన ప్రగతి భవన్ వెళ్ళిపోయారు. అంటే ఈ ఘటన ప్రగతి భవన్ డైరెక్షన్లోనే జరిగిందని తెలుస్తోంది.