JP – KTR : మాజీ ఐఏఎస్ ఆఫీసర్, లోక్ సత్తా పార్టీ చీఫ్ జయప్రకాశ్ నారాయణ(జేపీ) స్వరం మారుతోందా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అవినీతి, పారదర్శక పాలనే లక్ష్యంగా లోక్‌సత్తా పేరుతో అనేక ఉద్యమాలు, చైతన్యపర్చే కార్యక్రమాలు నిర్వహించిన జేపీ.. తర్వాత లోక్‌సత్తా పార్టీని స్థాపించారు. ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. ఏనాడూ ఆయన అధికార పార్టీలకు మద్దతుగా మాట్లాడలేదు. అలా అని విపక్షాల తరహాలో ఇష్టానుసారం విమర్శలూ చేయలేదు. నిర్మాణాత్మక విమర్శలు చేసేవారు. అసెంబ్లీలో కూడా పాలక పక్షాన్ని నిర్మాణాత్మకంగా నిలదీసేవారు. కానీ, కొన్ని రోజులుగా జేపీ స్వరం మారుతోంది. మూడు నాలుగు నెలల క్రితం ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు జేపీ. తాజాగా తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్ను ఆకాశానికి ఎత్తేశారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. జేపీ అధికార పార్టీలకు అనుకూలంగా మాట్లాడడంపై పొలిటికల్ సర్కిల్స్‌లో ఆసక్తికర చర్చ నడుస్తోంది.
టీవీ ఛానెల్ డిబేట్లో..
రెండు రోజుల క్రితం ఓ టీవీ చానెల్ నిర్వహించిన డిబేట్లో తెలంగాణ ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ లోక్‌సత్తా చీఫ్ జయప్రకాశ్ నారాయణతో ముచ్చటించారు. ఈ సందర్బంగా ఆయన కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. ఆ పార్టీ ఎన్నికల్లో గెలిచేందుకు దేశాన్నే పణంగా పెడుతోందని తీవ్ర ఆరోపణ చేశారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు సర్వనాశనం అయ్యాయని ఆరోపించారు.
బీఆర్ఎస్ పాలనపై ప్రశంసలు..
మరోవైపు ఇదే టీవీ డిబేట్లో బీఆర్ఎస్ పాలనపై జేపీ ప్రశంసలు కురిపించారు. తాను దళిత బంధు పొందిన ఓ యువకుడితో మాట్లాడానని, అతడు చెప్పింది విని తాను చాలా సంతోషంగా అనిపించిందని దళితబంధు స్కీంను పరోక్షంగా ప్రమోట్ చేశారు. అంతటితో ఆగకుండా ప్రస్తుతం సీఎం కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తోందని కితాబు ఇచ్చారు. గతంలో ఎన్నడూ లేని రీతిలో హైదరాబాద్ లో ఐటీ రంగం భారీగా విస్తరించిందని, కుల, మతాలకు అతీతంగా వేలాది మందికి ఉపాధి దొరుకుతోందని స్పష్టం చేశారు. దళిత బంధు, బీసీబంధు, కళ్యాణలక్ష్మి, తదితర పథకాలు ఆదర్శ ప్రాయంగా ఉన్నాయని ప్రశంసించారు.
గతంలో వైసీపీ సర్కార్‌పై..
విద్య, వైద్య రంగంలో మార్పుల కోసం జగన్ సర్కారు చేస్తున్న ప్రయత్నాలను లోక్‌సత్తా అధినేత జయ ప్రకాశ్ నారాయణ గతంలో అభినందించారు. జగన్ సర్కారు తీసుకొచ్చిన ఫ్యామిలీ డాక్టర్ పథకం బాగుందన్న జేపీ.. అందులో కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉందన్నారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా, లంచాల అవసరం లేకుండా చివరి గడపకు కూడా సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. జగన్ సర్కారు విద్యాప్రమాణాలను మెరుగుపర్చడం కోసం చితశుద్ధితో కృషి చేస్తోందన్నారు. ‘ముఖ్యమంత్రి జగన్‌ను, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మనసారా అభినందిస్తున్నాను. చిత్తశుద్ధితో విద్యాప్రమాణాలు మెరుగుపర్చాలనే ప్రయత్నం జరుగుతోంది. ఈ మధ్య ఓ ప్రయివేట్ కంపెనీతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. మార్కులు, ర్యాంకులు సాధిస్తే సరిపోదు.. పద్దతి మారాలన్న ఆలోచన ప్రభుత్వానికి వచ్చింది. ప్రభుత్వ సంకల్పాన్ని పూర్తిగా అభినందిస్తున్నా. ప్రజలకు విద్య, ఆరోగ్యాన్ని అందించాలనుకోవడం మంచిదే. కానీ అందించే తీరు గత 60–70 ఏళ్ల అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఉండాలి. పాత దాన్నే కొంచెం కొనసాగించి కొంచెం బాగా చేస్తామనుకుంటే.. పాత ఫలితాలే వస్తాయి. కొద్దిపాటి మార్పులు చేర్పులు చేస్తే మీ ఖర్చు ఒక్క రూపాయి కూడా పెరగదు’ అని జేపీ వ్యాఖ్యానించారు.
సెటిలర్ల ఓట్ల కోసమేనా..
గతంలో కేసీఆర్ సర్కార్ వైఫల్యాలపై ఇదే జయప్రకాశ్ నారాయణ విమర్శలు చేశారు. మీడియా సమావేశాల్లో దళితబంధు స్కీంను తప్పు పట్టారు. డబ్బులు పంచడం అభివృద్ధి అనిపించుకోదని వ్యాఖ్యానించారు. ఉచితాలతో ప్రజలకు ఎలాంటి ప్రయోజనం ఉండదని విమర్శించారు. విద్య వైద్యాన్ని కేసీఆర్ సర్కార్ నిర్లక్ష్యం చేస్తోందని ఎండగట్టారు. కానీ, సడెన్‌గా తెలంగాణ ఎన్నికల సమయంలో జేపీ మాట మార్చారు. కేసీఆర్ సర్కార్‌పై ప్రశంసలు కురిపించారు. ఇది కేవలం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్క్రిప్టెడ్ ప్రోగ్రాంగా పలువురు ఆరోపిస్తున్నారు. రేవంత్ రెడ్డికి క్రెడిట్ దక్కవద్దని.. కాంగ్రెస్ ను దెబ్తీసే వ్యూహంగానే దీన్ని చూస్తున్నారు. హైదరాబాద్‌లో సెటిల్ అయిన ఆంధ్రా ప్రాంత ప్రజల ఓట్లను పొందేందుకే జేపీతో ఇంటర్వ్యూ నిర్వహించిందని, తన ప్రభుత్వంపై విమర్శలుచేసిన జేపీతోనే ప్రశంసలు చేయంచుకున్నారని పేర్కొంటున్నారు.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: What is the reason behind jayaprakash narayans sudden support for brs
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com