Janasena and TDP alliance : 2024 ఎన్నికల ఫలితాలపై ఇప్పుడే బీజేపీ ఓ అంచనాకు వస్తోందా ? జనసేన, టీడీపీ పొత్తు ప్రభావం పై క్లారిటీ ఉందా ? పవన్, చంద్రబాబుతో కలిసి వెళ్లేందుకు సిద్ధంగా లేరా ? జగన్ పై బీజేపీ వైఖరిలో మార్పు ఉండదా ? అంటే అవుననే జవాబు వస్తోంది. ఏపీ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్న బీజేపీ అధిష్టానం స్పష్టమైన వైఖరితో ముందుకు వెళ్లే సంకేతాలిస్తోంది.

ఏపీలో జనసేన, టీడీపీ పొత్తు ఖాయమని చర్చ జరుగుతోంది. ఈ మేరకు జనసేనాని రణస్థలంలో సంకేతాలిచ్చారు. ఇక అధికారిక ప్రకటనే తరువాయి. 2024 ఎన్నికలకు బీజేపీని కూడ కలుపుకుపోవాలని ఆలోచన టీడీపీ, జనసేనలో ఉంది. అందుకే ప్రతిపక్షాల ఓటు చీలనివ్వం అనే వైఖరిని జనసేన, టీడీపీ తీసుకున్నాయి. టీడీపీ, జనసేన వైఖరి పై బీజేపీ సైలెంట్ గా ఉంది. పరిస్థితులు నిశితంగా గమనించి అడుగేయాలని ఆలోచిస్తోంది.
ఏపీలో టీడీపీ, జనసేకు 2024 ఎన్నికలు చాలా కీలకం. అందులోనూ టీడీపీకి జీవన్మరణ సమస్య. ఈ నేపథ్యంలో టీడీపీ, జనసేనతో కలిసి వెళ్తే టీడీపీకి లాభం తప్పా, బీజేపీకి వచ్చేది కొన్ని మంత్రి పదవులు, ఎమ్మెల్యే స్థానాలు అనే స్పష్టతను బీజేపీ జాతీయ నేతలు ఏపీ నేతలికిస్తున్నారు. టీడీపీ, జనసేన కలిసి వెళ్లినా జగనే సీఎం అయితే.. టీడీపీ ఉనికి ప్రశ్నార్థకం అవుతుంది. అప్పుడు టీడీపీ స్థానాన్ని బీజేపీ భర్తీ చేయవచ్చన్న ఆలోచనలో కేంద్ర పెద్దలు ఉన్నట్టు తెలుస్తోంది. ఫలితంగా రాష్ట్రంలో బీజేపీ బలోపేతం కావొచ్చు. బీజేపీ ప్రతిపక్ష స్థానంలో ఉంటే జగన్ కు ఎలాగూ కేసులు ఉన్నాయి కాబట్టి వాటిని అడ్డం పెట్టుకుని అధికారంలోకి రావొచ్చని బీజేపీ నేతలు అంచనాలు వేస్తున్నారట.
జగన్ సంక్షేమ పథకాల లబ్ధిదారులు మళ్లీ ఓటు వేస్తే సీఎం జగనే అవుతాడని బీజేపీ పెద్దలు లెక్కలు కడుతున్నారట. కొంత ఓటు బ్యాంకు చీలినా ప్రతిపక్షాలకు పెద్దగా అడ్వాంటేజ్ అవ్వదని భావిస్తున్నారట. జగన్ వల్ల లబ్ధిపొందిన వారు ఓటు వేయని పక్షంలోనే టీడీపీ, జనసేనకు ఓటు బదిలీ అవుతుందని అనుకుంటున్నారట. అలాంటప్పుడు టీడీపీ, జనసేనతో కలిసి వెళ్లడం వల్ల ఒరిగేదేమీ లేదంటున్నారట. ఇప్పటికే జగన్ మొదటి నుంచి సానుకూల వైఖరి ప్రదర్శిస్తున్న నేపథ్యంలో జగన్ తో పేటీ ఎందుకని ఏపీ బీజేపీ నేతల్ని కేంద్ర పెద్దలు ప్రశ్నిస్తున్నారట. పొత్తులతో స్వల్ప లాభాల కంటే ఏపీలో బలపడటం పైనే దృష్టి పెట్టాలని సూచిస్తున్నారట.