KCR Secretariat : 1500 కోట్లు పెట్టి నిర్మించిన భవనం అది. పది పేజీల యాడ్స్ ఇచ్చిన ఘనత దాని సొంతం. కేసీఆర్ నుంచి గల్లీ స్థాయి నాయకుడి వరకు బొంబాట్ ప్రచారమే సాంతం. కానీ ఏం జరిగింది? ప్రారంభించి నెల కూడా పూర్తి కాలేదు. అంతలోనే లోపాలు బయటపడుతున్నాయి. ప్రారంభించిన రెండో రోజే నీరు లీక్ అయింది. అంతే కాదు అన్ని అంతస్తులతో నిర్మించిన భవనం సరిపోవడం లేదని ఇప్పుడు ఏకంగా మరో ట్వీన్ టవర్లు నిర్మించాలని ఆ మధ్య ప్రభుత్వం నిర్ణయించింది. ఇది మరిచిపోకముందే సచివాలయంలో నీళ్లు లేవనే వార్త ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అంతే కాదు ప్రభుత్వ ఆర్భాటాన్ని కళ్లకు గడుతోంది. విశ్వసనీయవర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం భవనం గ్రౌండ్ ఫ్లోర్ పైప్‌లైన్‌లో సమస్య తలెత్తింది. ఫలితంగా అన్ని అంతస్తులకు నీటి సరఫరా నిలిచింది. మంత్రులు, ముఖ్య కార్యదర్శుల చాంబర్లకూ.. వాష్‌రూమ్‌ల్లోనూ నీరు రాక ఇబ్బంది ఏర్పడింది. దీంతో అధికారులు, సిబ్బంది బీఆర్‌కే భవన్ బాట పట్టారు. ప్యూరిఫయ్యర్లు కూడా పనిచేయడం లేదంటే నిర్మాణ కౌశలాన్ని ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
నరకం చూశారు
వాస్తవానికి సచివాలయంలో నీటి సరఫరాకు సంబంధించి శుక్రవారం ఉదయం నుంచే సమస్య తలెత్తింది. అయినప్పటికీ సిబ్బంది, అధికారులు పునరుద్ధరించే పనులు చేపట్టలేదు. కొన్ని అంతస్తుల్లో ఉదయం నుంచి, మరికొన్ని అంతస్తుల్లో మధ్యాహ్నం నుంచి సరఫరా పూర్తిగా నిలిచింది. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచేందుకు అధికారులు నానా తంటాలు పడ్డారు. అటు రన్నింగ్ వాటర్, ఇటు తాగు నీరు లేక సాయంత్రం వరకు అధికారులకు చుక్కలు కన్పించాయి. అసలే ఎండాకాలం కావడంతో దాహార్తికి తట్టుకోలేక సిబ్బంది బయటకు వెళ్లి నీళ్లు కొనుకొచ్చుకున్నారు. వాష్ రూమ్‌లకు వెళ్లే వీలూ లేకపోవడంతో బయట ఉన్న శౌచాలయాలకు వెళ్లి అవసరాలు తీర్చుకున్నారు. ఇక నీటి సరఫరా నిలిచిపో వడంతో. తాగునీటి కోసం ఆయా అంతస్తుల్లో ఏర్పాటు చేసిన ప్యూరిఫైడ్ పాయింట్లు ఉత్సవ విగ్రహాల్లాగా మారాయి. కొంతమంది దగ్గరలోని బీఆర్కే భవన్‌కు వెళ్లగా మరికొందరు ఇతరచోట్లకు వెళ్లారు.
ఆ వీలు దొరక లేదు
అంతటి సచివాలయానికి వాటర్ వర్క్స్ బోర్డు నీటిని సరఫరా చేస్తుంది. శుక్రవారం యథావిధిగా అందించామని ఆ సంస్థ సిబ్బంది చెబుతున్నారు. వాస్తవానికి సచివాలయానికి ఒక రోజుకు సరిపడా నీటిని ఉదయమే ఓవర్ హెడ్ ట్యాంకుల్లోకి ఎక్కించి నిల్వ చేయాల్సి ఉంటుంది. అయితే, ఉదయం నుంచే సమస్య తలెత్తడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు అవకాశం లేకుండా పోయింది వాటర్ వర్క్స్ బోర్డు సిబ్బంది చెబుతున్నారు. కాగా, సచివాలయంలో వివిధ విభాగాల్లో పని చేసే అధికారులు, సిబ్బంది, పోలీసులు అంతా కలిపి దా దాపు రెండు వేల మంది ఉంటారు. ఈ భవనం ప్రారంభం నుంచే వీరికి చుక్కలు కన్పిస్తున్నాయి. చాలీచాలని చాంబర్లు, సరైన వసతులు లేక ఇబ్బందులు తలెత్తుతూనే ఉన్నాయి. సచివాలయం ప్రారంభానికి ముందే పిల్లర్ల నుంచి నీరు లీకవడం చర్చనీయాంశమైంది. ఇప్పుడు రోజంతా నీటి సరఫరా నిలిచిపోవడం పట్ల సిబ్బంది విసుక్కుంటున్నారు. శుక్రవారం వెలుగు చూసిన నీటి సమస్య శనివారం సాయంత్రం నాటికి కూడా ఒక కొలిక్కి రాలేదు. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచేందుకు అధికారులు నానా తంటాలు పడ్డారు. ఇక, తాగునీటి బాధ్యతను వాటర్ వర్క్స్ బోర్డుకు అప్పగించినప్పటికీ వివిధ శాఖల్లో సిబ్బంది తలా ఇంత నగదు పోగు చేసుకుని వాటర్ బబుల్స్(నీటి ట్యాంకులు) తెప్పించుకుంటు న్నారంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.