YS Jagan Politics: సమ్ థింగ్ రాంగ్.. వైసీపీలో ఏదో జరుగుతోంది. కానీ బయటకు మాత్రం తెలియడం లేదు. వారి ప్రకటనల వెనుక ఎంతో ఏడుపు బాధ ఉందని మాత్రం అర్థమవుతోంది. వైసీపీ ప్లీనరీ వేదికగా వైఎస్ విజయమ్మ తనకు జగన్ ఇచ్చిన ‘వైసీపీ గౌరవాధ్యక్షురాలు’ పదవికి రాజీనామా చేయడం సంచలనమైంది. జగన్ ముందే.. ఆయన ఒడ్డున పడి సంతోషంగా ఉన్నాడని.. కష్టాల్లో ఉన్న కూతురు పార్టీ కోసం తాను పాటుపడుతానని.. అందుకే జగన్ పార్టీ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించి సంచలనం సృష్టించారు.

సాధారణంగా ఏ తల్లికి అయినా తన సంతానాన్ని సమంగా ప్రేమిస్తారు. కానీ బాధలో.. సంతోషంలో ఉన్నారని ఎవ్వరూ వదిలేయరు. రెండింటిని సమానంగా స్వీకరిస్తారు. కానీ జగన్ సీఎంగా పాలిస్తున్నాడు కాబట్టి ఆయనకు తల్లి అవసరం లేదని.. అధికారం కోసం తెలంగాణలో పోరాడుతోంది కాబట్టి కష్టపడుతున్న కూతురికి తన అవసరం ఉందని కొడుకు జగన్ ను వదిలేయడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. జగన్, షర్మిల మధ్య విభేదాలు కేవలం వైఎస్ విజయమ్మ రాజీనామాతోనే మరోసారి బయటపడ్డాయని కొందరు సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు. కొడుకును కాదని కూతురు కోసం వెళుతున్న తల్లి త్యాగంలో ఏదో మతలబు ఉందని అంటున్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డి తల్లి, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి భార్య విజయలక్ష్మి రాజీనామా చేయడం ఇప్పుడు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది.. ఇటీవల పార్టీ ప్రక్షాళన సమయంలోనే పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్ పార్టీ గౌరవ అధ్యక్ష పదవిని పొడగిస్తూ ప్రకటన చేయలేదు. ఈ సమయలోనే అందరిలో సందేహాలు తలెత్తాయి. ఇటీవల విజయమ్మ రాజీనామా చేసినట్లు ఒక లేఖ కూడా సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. దీనిని నిజం చేస్తూ విజయమ్మ వైఎస్సార్‌సీపీ ప్లీనరీ వేదికగా తన రాజీనామా ప్రకటించడం సంచలనమైంది. కష్టాల్లో ఉన్నప్పుడు జగన్‌కు అండగా నిలిచానని, ప్రస్తుతం తెలంగాణలో పార్టీ పెట్టిన షర్మిలకు అండగా నిలవాలని నిర్ణయించుకున్నట్లు వివరించారు. ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ గౌరవ అధ్యక్షురాలి పదవికి, పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇకపై తెలంగాణలో షర్మిలకు అండగా ఉంటానని స్పష్టం చేశారు
జగన్ సీఎం కాకముందే మొత్తం ఫ్యామిలీతో ప్రచారం చేయించుకున్నారు. ముఖ్యంగా జగన్ జైలుకు వెళ్లాక వైసీపీ పార్టీనే చెల్లి షర్మిలనే నిలబెట్టింది. రాష్ట్రమంతా ఎండల్లో తిరిగి పాదయాత్రతో పార్టీని కాపాడారు. గడిచిన 2019 ఎన్నికల్లోనూ వైసీపీ కోసం ఎంతో పాటుపడ్డారు. కానీ గెలిచాక సీఎం జగన్ ముఖ్యంగా తల్లిని, చెల్లిని దూరం పెట్టేశారన్న అపవాదు మూటగట్టుకున్నారు.గతంలో ఎమ్మెల్యేగా తల్లికి ఛాన్స్ ఇచ్చిన జగన్ ఈసారి గౌరవాధ్యక్ష పదవి పేరుతో ఉత్సవ విగ్రహంగా మార్చేశారు. ఎలాంటి పదవి ఇవ్వలేదు. ఇక పార్టీ కోసం ఎంతో కష్టపడ్డ సొంత చెల్లి ‘షర్మిల’ను పక్కనపెట్టి బంధువు అయిన అవినాష్ రెడ్డి సహా ఇతరులకు ఎంపీ సీట్లు ఇచ్చి ఢిల్లీకి పంపారు. షర్మిల నోరు తెరిచి అడిగినా ఇవ్వలేదన్న టాక్ నడిచింది.అందుకే షర్మిల తిరుగుబాటు చేసి సొంత అన్న పై పార్టీ పెట్టడం ఇష్టం లేక తెలంగాణలో పెట్టిందన్న గుసగుసలున్నాయి.
ఇక జగన్ సొంత బాబాయ్ వైఎస్ వివేకా హత్య కేసు మిస్టరీ ఇప్పటికీ వీడలేదు. ప్రస్తుత వైసీపీ ఎంపీ.. నాడు నామమాత్రుడైన జగన్ బంధువే దీన్ని ‘గుండెపోటుగా’ చిత్రీకరించి మీడియాను తప్పుదోవపట్టించాడు. పోలీసులను ఏమర్చాడు.కానీ ఇది హత్యగా తేలాక అందరి వేళ్లు ఆయనవైపే మళ్లాయి. వైఎస్ వివేకా కూతురు సైతం జగన్ ను, వైసీపీ నేతలపై నమ్మకం లేక కోర్టుకు ఎక్కారు.
ఇలా జగన్ పై సొంత వాళ్ల నుంచే వ్యతిరేకత మొదలైందని ప్లీనరీ వేదికగా తేటతెల్లమైంది. అమ్మ రాజీనామా చేయడం.. చెల్లి షర్మిల తిరుగుబాటు… బాబాయ్ వైఎస్ వివేకాకు గుండెపోటు ఇలా ముగ్గురి నుంచి ఇప్పుడు జగన్ కు దూరమే ఏర్పడింది. జగన్ చేజేతులారా సన్నిహితులను దూరం చేసుకుంటున్నారా? అధికారంలో ఉన్నాడు కాబట్టి సరిపోయింది.. ప్రతిపక్షంలో ఉంటే జగన్ కు ఇది మైనస్ అవుతుందా? అంటే ఔననే సమాధానం వస్తోంది. అధికారం ఉన్నా లేకున్నా.. కుటుంబాన్ని ఏకతాటిపైకి తెచ్చుకుంటే అది ఎప్పటికైనా మేలు చేస్తుందని.. జగన్ పొరపాటు చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతిమంగా జగన్ కేసుల్లో ఇరుక్కున్నా.. జైలుకు వెళ్లినా పార్టీ పరిస్థితి ప్రశ్నార్థకంగా తయారవుతుందంటున్నారు. చూడాలి మరీ ఏం జరుగుతుందో..?