Uttarakhand Tunnel: నిషేధించిన విధానమే.. 41 ప్రాణాలు నిలబెట్టింది!

సమాంతరంగా సన్నని గుంతలు తవ్వుతూ బొగ్గును బయటకు తీసే పద్ధతినే ర్యాట్‌ హోల్‌ మైనింగ్‌గా వ్యవహరిస్తారు. నేలలో ఇరుకైన గుంతలను తవ్వడాన్నే ర్యాట్‌ హోల్‌గా పేర్కొంటారు.

Written By: Raj Shekar, Updated On : November 29, 2023 4:23 pm

Uttarakhand Tunnel

Follow us on

Uttarakhand Tunnel: ఉత్తరకాశీ సొరంగంలో చిక్కుకున్న కూలీలను బయటకు తీసుకువచ్చేందుకు అనేక ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించారు. భారత సాంకేతికతలతోపాటు అమెరికా నుంచి తీసుకొచ్చిన అత్యాధునిక మెషీన్లు కూడా సొరంగ మార్గంలో ధ్వంసమయ్యాయి. కానీ, గతంలో నిషేధించిన ఓ పద్ధతే చివరకు దిక్కయ్యింది. అదే ‘ర్యాట్‌ హోల్‌ మైనింగ్‌’ అత్యంత ప్రమాదకరమైన ఈ విధానంలోనే సొరంగంలో చిక్కుకున్న కూలీలను బయటకు తీసుకురాగలిగారు. ఇలా 41 మంది ప్రాణాలను కాపాడిన ఈ ‘ర్యాట్‌ హోల్‌ మైనింగ్‌’ పద్ధతి ఏంటి.. ఎందుకు నిషేధించారు అనేది తెలుసుకుందాం.

ర్యాట్‌ హోల్‌ మైనింగ్‌..?
సమాంతరంగా సన్నని గుంతలు తవ్వుతూ బొగ్గును బయటకు తీసే పద్ధతినే ర్యాట్‌ హోల్‌ మైనింగ్‌గా వ్యవహరిస్తారు. నేలలో ఇరుకైన గుంతలను తవ్వడాన్నే ర్యాట్‌ హోల్‌గా పేర్కొంటారు. సుమారు నాలుగు అడుగుల వెడల్పుతో మాత్రమే ఉంటుంది. కేవలం ఒక్క మనిషి మాత్రమే వెళ్లగలడు. ఈ క్రమంలో నిర్దేశిత బొగ్గు పొరను చేరుకున్న తర్వాత.. బొగ్గును వెలికి తీసేందుకు సొరంగ మార్గాన్ని ఏర్పాటు చేసుకుంటారు. పార, తదితర ప్రత్యేక పనిముట్లతో చేతుల ద్వారానే తవ్వకం చేపడతారు. తాళ్లు, అవసరమైతే నిచ్చెనల సాయంతో వెళ్లి కొద్ది కొద్దిగా తవ్వుకుంటూ.. ఆ శిథిలాలను కొంత దూరంలో డంప్‌ చేస్తారు. అత్యంత పలుచటి భూ పొరలుండే మేఘాలయ వంటి ప్రాంతాల్లో చేసే మైనింగ్లో ఈ పద్ధతిని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇతర సాంతకేతికతలతో పోలిస్తే ఖర్చు తక్కువగా ఉండటంతో పలు ప్రాంతాల్లో దీన్నే ఎక్కువగా ఎంచుకుంటారు.

పర్యావరణ ఆందోళనలు..
ర్యాట్‌–హోల్‌ మైనింగ్‌పై అనేక విమర్శలు, వివాదాలూ ఉన్నాయి. ఈ విధానంలో గనుల్లోకి వెళ్లే కార్మికులకు భద్రత లేకపోవడం ప్రధాన సమస్య. ముఖ్యంగా లోపలికి వెళ్లే కార్మికులకు సరైన వెంటిలేషన్, నిర్మాణ పరంగా రక్షణ లేకపోవడం, వర్షాలు వచ్చినప్పుడు అవి నీటితో నిండిపోవడం వంటి ప్రతికూల అంశాలు. ఈశాన్య రాష్ట్రాల్లో ఇలా తవ్వకాలు చేపట్టిన గనుల్లో అనేక ప్రమాదాలు జరిగాయి. 2018లో అక్రమ మైనింగ్‌ చేస్తోన్న ఓ గనిలో ప్రమాదం జరిగి 15 మంది అందులోనే చిక్కుకుపోయారు. 2021లోనూ మరో ఘటనలో ఐదుగురు చిక్కుకుపోయారు. ఇలా కార్మికులతోపాటు పర్యావరణానికి హాని కలిగించే ఈ తరహా విధానాన్ని పర్యావరణవేత్తలు వ్యతిరేకిస్తున్నారు.

నిషేధం ఎందుకు?
ఈ పద్ధతి శాస్త్రీయమైనది కాదని పేర్కొన్న నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌.. 2014లో దీన్ని నిషేధించింది. అనంతరం 2015లోనూ ఎన్జీటీ తన నిషేధాన్ని సమర్థించింది. అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేసే కార్మికులు/ఉద్యోగులు ప్రాణాలు కోల్పోతుండటాన్ని ప్రస్తావించింది. అయితే, తమ ప్రాంతంలో మైనింగ్‌ కోసం మరో ప్రత్యామ్నాయం లేకపోవడంతో ఎన్జీటీ నిషేధాన్ని ఈశాన్య రాష్ట్రాలు సవాలు చేశాయి. మేఘాలయాలోనూ ఈ తరహా తవ్వకాలు ఇంకా కొనసాగుతున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి.

ఆరు ప్రయత్నాలు విఫలం..
ఇదిలాఉంటే, ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను కాపాడేందుకు అనేక మార్గాలను అన్వేషించారు. దాదాపు ఆరు ప్రత్యామ్నాయాల్లో ఆపరేషన్‌ చేపట్టారు. సొరంగంలో సమాంతర తవ్వకం చేపట్టేందుకు 25 టన్నుల ఆగర్‌ యంత్రంతో భారీ ఆపరేషన్‌ చేపట్టినప్పటికీ.. అది అందులోనే ధ్వంసం కావడం కలవరపాటుకు గురిచేసింది. దీంతో చివరకు మాన్యువల్‌ పద్ధతిలో చేసే ర్యాట్‌ హోల్‌ మైనింగ్‌పై ఆధారపడాల్సి వచ్చింది. చివరి ప్రయత్నంలో విజయవంతంగా 41 మంది సురక్షితంగా బయటకు వచ్చారు.