CM Chandhrababu : ఏపీకి ఇది సందిగ్ధ సమయం.ప్రజల ఆకాంక్షలు,ఆశయాలు మరోలా ఉన్నాయి. వాటిని అందుకో లేకపోతే జరిగే నష్టం చంద్రబాబుకు తెలియంది కాదు. అందుకే ఆయన బాధ్యతలు స్వీకరించిన మరుక్షణం నుంచి పావులు కదపడం ప్రారంభించారు. ముఖ్యంగా కేంద్ర సహకారం కోసం పెద్ద ప్రయత్నమే చేస్తున్నారు. 2019 ఎన్నికలకు ముందు బిజెపికి దూరమయ్యారు. రాజకీయంగా నష్టపోయారు. వైసీపీకి చేజేతులా ఛాన్స్ ఇచ్చారు. బిజెపిని వదులుకొని మూల్యం చెల్లించుకున్నారు. అదే బిజెపి కోసం ఐదేళ్లుగా ఎదురు చూశారు. ఎన్నికలకు ముందు వారితో స్నేహాన్ని కుదుర్చుకున్నారు. మళ్లీ విజయాన్ని అందుకున్నారు. గత అనుభవాల దృష్ట్యా మరోసారి బిజెపితో స్నేహం చెడిపోకుండా ఉండేందుకు చంద్రబాబు తాను తగ్గి.. తనను తాను తగ్గించుకుని ఉంటున్నారు. ముఖ్యంగా ప్రధాని మోడీపై చంద్రబాబు వీర విధేయత ప్రదర్శిస్తున్నారు. ఎన్డీఏలో టిడిపి కీలక భాగస్వామిగా ఉన్నా.. ఆ పార్టీకి కేవలం రెండు కేంద్ర మంత్రి పదవులు దక్కాయి. నేరుగా రాష్ట్రానికి నిధులు ఇచ్చేందుకు మోడీ సర్కార్ ముందుకు రాకున్నా.. ప్రధాని మోదీ పై మాత్రం విధేయతను కొనసాగిస్తున్నారు చంద్రబాబు. గతంలో మాదిరిగా తప్పటడుగులు వేస్తే ఎంత నష్టపోతామో చంద్రబాబుకు తెలియదు కాదు. అందుకే ఎన్డీఏ లో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించిన క్రమంలో.. ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చూస్తున్నారు. ప్రధాని మోదీ తో పాటు బిజెపి అగ్రనేతల సాయంతో ఏపీని.. ముఖ్యంగా అమరావతి రాజధాని నిర్మాణం తో పాటు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని భావిస్తున్నారు.
* నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు
ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశానికి చంద్రబాబు స్వయంగా హాజరయ్యారు. ఈ భేటీకి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు ఆహ్వానాలు అందాయి. కానీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కాలేదు. బిజెపికి వ్యతిరేకంగా ముద్రపడిన ముఖ్యమంత్రులు సైతం రాలేదు. చివరకు ఎన్డీఏలో కీలక భాగస్వామి అయిన బీహార్ సీఎం నితీష్ కుమార్ సైతం పాల్గొనలేదు. రాష్ట్రం తరఫున ప్రతినిధులను మాత్రమే పంపించారు. కానీ చంద్రబాబు మాత్రం స్వయంగా హాజరు కావడం విశేషం.
* ఆ వ్యూహంతోనే
చంద్రబాబు హాజరు వెనుక బలమైన కారణాలు ఉన్నాయి. ఈ ఐదేళ్లపాటు చంద్రబాబుకు కీలకం. ప్రజలు ఎంతో నమ్మకంతో అధికారాన్ని కట్టబెట్టారు. అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్ట్, రాష్ట్రంలో మౌలిక వసతులు, సంక్షేమ పథకాల అమలు వంటి విషయంలో చొరవ చూపకపోతే.. రాష్ట్ర ప్రజల నుంచి ఆగ్రహం చవిచూడడం ఖాయం. అందుకే కేంద్రం నుంచి పిలుపు వచ్చిన ఏ కార్యక్రమానికైనా తానే హాజరుకావాలని నిర్ణయించుకున్నారు. ఏపీకి సంబంధించి కీలక ప్రాజెక్టులు, అభివృద్ధి పనుల ప్రతిపాదనలు నీతి ఆయోగ్ ముందు ఉంచారు.
* రాష్ట్ర ప్రయోజనాలకు పెద్దపీట
దేశవ్యాప్తంగా రాజకీయాలు మారుతున్నాయి. విపక్ష కూటమి పుంజుకుం టోంది. అయినా సరే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్డీఏ కూటమిలో చేరడం శ్రేయస్కరం. అన్నింటికీ మించి ఈ ఐదేళ్లలో రాష్ట్ర ప్రయోజనాలకు తగిన విధంగా కేంద్రం నుంచి సాయం అందుకోవాలి. అది జరగాలంటే చంద్రబాబు నమ్మదగిన మిత్రుడిగా కేంద్ర పెద్దలు నమ్మాలి. ఆ ప్రయత్నంలో భాగంగానే చంద్రబాబు విధేయతను ప్రదర్శిస్తున్నారు. ఎటువంటి భేష జాలాలకు పోవడం లేదు. తన ముందు టార్గెట్ ను పెట్టుకొని అందుకు అనుగుణంగా పావులు కదుపుతున్నారు.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read More