Paris Olympics 2024 : పారిస్ వేదికగా ఒలింపిక్స్ అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వివిధ దేశాల నుంచి వచ్చిన ఆటగాళ్లతో పారిస్ నగరం సందడిగా మారింది. ఈ క్రమంలో వివిధ విభాగాలలో ప్రస్తుతం అక్కడ పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీలలో భారత జట్టు షూటింగ్ భాగంలో పతకాన్ని ఖాయం చేసుకుంది. భారత మహిళా షూటర్ మను బాకర్ సరికొత్త చరిత్ర సృష్టించడంతో..పతకం దక్కే అవకాశం కనిపిస్తోంది. మను షూటింగ్ భాగంలో సత్తా చాటడంతో 20 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడనుంది.
శనివారం జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో మను అసాధారణ రీతిలో ప్రదర్శన చేసింది. ఏకంగా ఫైనల్ దూసుకెళ్లింది. 580 పాయింట్లు సాధించి మను మూడవ స్థానంలో నిలిచింది. మెడల్ ఈవెంట్ కు అర్హత సాధించింది. హంగారి దేశానికి చెందిన షూటర్ వీ మేజర్, దక్షిణ కొరియా షూటర్ వైజే ఓహ్ తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు.. ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల 30 నిమిషాలకు ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఒకవేళ మను గనుక ఇదే ప్రదర్శన కొనసాగిస్తే ఆమెకు కాంస్య పతకం దక్కే అవకాశం కనిపిస్తోంది. అయితే ఫైనల్ పోరులో వి మేజర్, ఓహ్ తోపాటు చైనాకు చెందిన ఎక్స్ లీ కూడా పోటీ పడుతున్నారు.
సరిగ్గా 20 సంవత్సరాల క్రితం గ్రీస్ దేశంలోని ఏథెన్స్ ప్రాంతంలో ఒలింపిక్స్ జరిగాయి. ఆ పోటీలలో భారత షూటర్ సుమా షిరూర్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో ఫైనల్ చేరుకుంది. ఆ తర్వాత ఎన్ని సంవత్సరాలకు మనుభాకర్ ఫైనల్ లోకి అడుగుపెట్టింది. ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్లో మను కనుక సత్తా చాటితే భారత దేశానికి పతకం లభిస్తుంది. మన దేశానికి చెందిన మరో షీటర్ రిధమ్ సాంగ్వాన్ 573 పాయింట్స్ సాధించి 15వ స్థానంలో నిలిచింది. ఇక ఒలింపిక్స్ లో భాగంగా జరిగిన షూటింగ్ ఈవెంట్స్ లో భారత జట్టుకు పెద్దగా మెడల్స్ రాలేదు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్ డ్ విభాగంలో ఒక్క పాయింట్ తేడాతో మెడల్ రేసులో భారత్ వెనుకబడింది. ఇక పురుషుల 10 మీటర్ల ఎయిర్ ఫిస్టల్ విభాగంలో ఫైనల్స్ చేరుకునే అర్హత సాధించినప్పటికీ అనుకోని కారణంగా భారత జట్టు ఇంటి ముఖం పట్టాల్సిన పరిస్థితి నెలకొంది. శనివారం జరిగిన పది మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్ డ్ విభాగంలో 628.7.లతో అర్జున్ బబూత – రమిత ఆరవ స్థానంలో, వలరీ వన్- సందీప్ సింగ్ 623.6 పాయింట్లతో 12వ స్థానంలో నిలిచారు. అయితే నాలుగు స్థానంలో జర్మనీ జోడి నిలిచింది. ఆ జంటకు మన జట్టు ఆటగాళ్లకు కేవలం ఒక పాయింట్ మాత్రమే అంతరం ఉంది.. ఒకవేళ గనుక ఆ పాయింట్ సాధించి ఉంటే భారత జట్టు కాంస్య మెడల్ విభాగంలో ప్లేస్ లో ఉండేది.
ఇక ఒలింపిక్స్ లో చైనా ఖాతా తెరిచింది. చైనా 632.2, కొరియా 631.4, కజకిస్తాన్ 630.8, జర్మనీ 629.9 పాయింట్లతో టాప్ నాలుగు స్థానాల్లో నిలిచాయి. స్వర్ణం కోసం చైనా కొరియా మధ్య హోరాహోరి జరిగింది. చివరికి చైనా జంట అద్భుతంగా షూటింగ్ చేసి స్వర్ణం దక్కించుకుంది. కొరియా జంట రజతం, కజకిస్తాన్ జంట కాంస్య పతకాలు సాధించాయి.. ఇక పురుషుల 10 మీటర్ల ఎయిర్ ఫిస్టల్ విభాగంలో భారత స్టార్ షూటర్ సరబ్ జ్యోత్ 577 పాయింట్లు సాధించి 9వ స్థానంలో నిలిచాడు. ఇక మరో షూటర్ అర్జున్ 574 పాయింట్లతో 18వ స్థానం దక్కించుకున్నాడు. అయితే ఒలింపిక్ నిబంధనల ప్రకారం టాప్ 8 లో నిలిచిన ఆటగాళ్లు మాత్రమే ఫైనల్స్ కు అర్హత సాధిస్తారు.