నటీనటులు : వీజీ సన్నీ, సప్తగిరి, షకలక శంకర్, శివాజీ రాజా , నక్షత్ర, అక్సా ఖాన్, పోసాని కృష్ణ మురళి, బిత్తిరి సత్తి తదితరులు.
రచన, దర్శకత్వం : డైమండ్ రత్నం బాబు
సంగీతం : భీమ్స్
సినిమాటోగ్రఫీ : వేణు మురళీధర్
నిర్మాత : రజిత్ రావు
Unstoppable Movie Review : రేడియో జాకీ గా కెరీర్ ని ఆరంభించి ఆ తర్వాత యాంకర్ గా పలు ఇంటర్వ్యూస్ చేసి మంచి పాపులారిటీ దక్కించుకున్న తర్వాత సన్నీ కి బిగ్ బాస్ రియాలిటీ షోలో ఒక కంటెస్టెంట్ గా పాల్గొనే అవకాశం దక్కింది. కోటిమంది లో ఒక్కడికి వచ్చే ఆ అవకాశాన్ని అదృష్టంగా భావించి, బిగ్ బాస్ హౌస్ లో ప్రతీ టాస్కు ని ఎంతో అద్భుతంగా ఆడి, కోట్లాది మంది తెలుగు ప్రేక్షకుల అభిమానం ని సొంతం చేసుకొని, బిగ్ బాస్ సీజన్ 5 టైటిల్ విన్నర్ గా నిల్చిన సన్నీ ఇప్పుడు సినిమాల్లో హీరోగా కూడా నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఆయన లేటెస్ట్ గా హీరోగా నటించిన ‘అన్ స్టాపబుల్’ అనే చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైంది. ఈ సినిమాకి ఆడియన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో ఒకసారి ఈ రివ్యూ లో చూద్దాం.
కథ :
కోహినూర్ కళ్యాణ్ (సన్నీ) మరియు జిలాని రాందాస్ (సప్తగిరి) చిన్నప్పటి నుండి మంచి స్నేహితులు. వీళ్లిద్దరు డబ్బు సంపాదించడం కోసం యూట్యూబ్ లో సినిమాలు మరియు వెబ్ సిరీస్ లకు సంబంధించిన రివ్యూస్ చెప్తూ ఉంటారు. అలా వచ్చిన డబ్బుల్ని తీసి క్రికెట్ బెట్టింగ్స్ లో ఆడుతూ ఉంటారు. కొడితే ఈసారి జాక్పాట్ కొట్టాలి అనే ఉద్దేశ్యం తో పది లక్షల రూపాయిలు అప్పు చేసి మరీ క్రికెట్ బెట్టింగ్ లో వేస్తారు. ఆ డబ్బులు మొత్తం పోతాయి, మరో పక్క అప్పు ఇచ్చిన వాడు కళ్యాణ్ మరియు జిలాని ని టార్చర్ పెడుతారు. అప్పుడు దుబాయి లో స్థిరపడిన తమ స్నేహితుడు హానీ భాయ్ (షకలక శంకర్) ని 20 లక్షల రూపాయిలు అప్పు అడుగుతారు. హానీ భాయ్ వెంటనే ఆ డబ్బులను ఆన్లైన్ లో పంపుతాడు, కానీ ఆ డబ్బులు పొరపాటున కళ్యాణ్ అకౌంట్ లో పడకుండా , జ్ఞాన్ వేల్ రాజా అనే రౌడీ షీటర్ అకౌంట్ లో పడుతాయి. ఆ తర్వాత ఆ డబ్బులను అతని దగ్గర నుండి కళ్యాణ్ తీసుకున్నాడా లేదా?, ఈ క్రమం లో అతను ఎన్ని నాటకాలు వెయ్యాల్సి వచ్చింది అనేది వెండితెర మీద చూడాల్సిందే.
విశ్లేషణ :
స్టోరీ లైన్ వినగానే చాలా కొత్తగా అనిపించింది కదూ, ఇదే స్టోరీ లైన్ ఒక స్టార్ డైరెక్టర్ డీల్ చేసి ఉంటే సన్నీ కి హీరో గా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ పడేది అని ఈ సినిమాని చూసిన ప్రతీ ఒక్కరికీ అనిపిస్తుంది. కథలో దమ్ము ఉంది, సన్నీ మరియు సప్తగిరి మధ్య కామెడీ పండించడానికి బోలెడంత స్కోప్ ఉంది, అలాగే హీరో హీరోయిన్ మధ్య ఉండే లవ్ ట్రాక్ లో ఫీల్ గుడ్ అనిపించే విధంగా మలచగలిగే స్కోప్ కూడా ఉంది. ఇవన్నీ ఉన్నప్పటికీ డైరెక్టర్ డైమండ్ రత్నం బాబు తన నాసిరకం టేకింగ్ తో సినిమాని చాలా రొటీన్ గా అనిపించేలా చేసాడు.కొత్త రకం కథని, సరికొత్త రకమైన టేకింగ్ తో ఫ్రెష్ కామెడీ ట్రై చేసి ఉంటే, ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యేది. బంగారం లాంటి ఛాన్స్ ని మిస్ చేసుకున్నాడు డైమండ్ రత్నం బాబు.
ఇక హీరో సన్నీ తన బెస్ట్ ఇవ్వడానికి నూటికి నూరు పాళ్ళు కృషి చేసాడు, ఈ సినిమా చూసిన తర్వాత కుర్రాడిలో విషయం ఉంది, సరిగ్గా వాడుకుంటే పెద్ద రేంజ్ కి వెళ్తాడు అని అనిపించక తప్పదు. ఇక కమెడియన్ సప్తగిరి కి కామెడీ కి కావాల్సినంత స్కోప్ ఉన్న సీన్స్ ఉన్నప్పటికీ, డైరెక్టర్ నాసిరకం డైలాగ్స్ మరియు టేకింగ్ తో సప్తగిరి ని వాడుకోలేకపొయ్యాడు. ఇక హీరోయిన్ నక్షత్ర తన పరిధిమేర బాగానే నటించింది, పోసాని కృష్ణ మురళి , రాజా రవీంద్ర , షకలక శంకర్, బిట్టితి సత్తి, శివాజీ రాజా, అక్సా ఖాన్ ఇలా ఎంతో మంది ఆర్టిస్టులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళను సరిగా వాడుకోవడం లో విఫలం అయ్యాడు డైమండ్ రత్నం బాబు. దర్శకత్వం రాకపోతే ఆ కథని వేరే డైరెక్టర్ కి అయినా ఇచ్చేసి ఉండొచ్చు కదా, ఒక మంచి కథని అస్సాం కి పంపించారు అంటూ డైమండ్ రత్నం బాబు పై పెదవి విరుస్తున్నారు ఆడియన్స్.
చివరి మాట :
జబర్దస్త్ స్కిట్స్ కి అలవాటు పడిన వాళ్ళు ఒక్కసారి ఈ సినిమాని టైంపాస్ కోసం చూడొచ్చు, మిగిలిన ఆడియన్స్ ఈ B గ్రేడ్ కామెడీ ని తట్టుకోవడం కష్టమే.
రేటింగ్ : 2/5
