తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు టీటీడీ అదిరిపోయే శుభవార్త చెప్పింది. కాలినడకన వెళ్లే భక్తులకు ప్రయోజనం చేకూరేలా కీలక నిర్ణయం తీసుకుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 25 కోట్ల రూపాయలు ఖర్చు చేసి భక్తులు తడవకుండా చివరి మెట్టు వరకు షెల్టర్లను ఏర్పాటు చేయనుంది. కరోనా, లాక్ డౌన్ వల్ల తిరుమలకు తక్కువ సంఖ్యలో భక్తులు వెళుతున్నారు కానీ గతంలో శ్రీవారి దర్శనానికి రోజుకు లక్ష మందికి పైగా వెళ్లేవారు.

పేద, ధనిక అనే తారతమ్యం లేకుండా అందరూ కాలినడక దర్శనానికే ప్రాధాన్యత ఇస్తారు. పలువురు సెలబ్రిటీలు సైతం కాలినడక మార్గం ద్వారానే వెళ్లి శ్రీవారి మొక్కులను చెల్లించుకున్నారు. గోవింద నామస్మరణలతో కాలినడక మార్గం సందడిగా ఉండేది. కరోనా పూర్తిస్థాయిలో అదుపులోకి వచ్చి సాధారణ పరిస్థితులు నెలకొంటే తిరుమలకు వెళ్లే భక్తుల సంఖ్య భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి.
ఇప్పటికే షెల్టర్లు ఉన్నా అవి చాలావరకు పాడైపోయాయి. దీంతో కాలినడక మార్గం ద్వారా దర్శనం చేసుకునే భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. టీటీడీ నిర్ణయం వల్ల ఏడున్నర కిలోమీటర్ల కాలిబాట మార్గంలో కొత్త షెల్టర్లు ఏర్పాటు కావడంతో పాటు భక్తులకు అవసరమైన ఇతర సౌకర్యాలు కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. టీటీడీ పిల్లర్లను కూడా తొలగించి కొత్త పిల్లర్లను ఏర్పాటు చేయనుంది.
రాబోయే ఆరు నెలల్లో టీటీడీ మెట్ల మార్గం ఏర్పాటు చేయనుంది. ఏడున్నర కిలోమీటర్ల మార్గంలో మొత్తం 3,550 మెట్లు ఉన్నాయి. ఏ కోరిక కోరుకున్నా కాలినడకన వెళితే తీరతాయని భక్తులు బలంగా విశ్వసిస్తారు. 30 సంవత్సరాల క్రితం టీటీడీ ఏర్పాటు చేసిన షెల్టర్లే ఇప్పటికీ ఉన్నాయి. అధునాతన సౌకర్యాలతో టీటీడీ కాలినడక మార్గాన్ని పూర్తిగా మార్చే దిశగా అడుగులు వేస్తోంది.