MLC Elections Results : ఎమ్మెల్సీ ఎన్నికల్లో కారు జోర్దార్ గా దూసుకెళ్లింది.. ఎలక్షన్ రేసులో తనకు తిరుగులేదని చాటుకుంది.. స్థానిక సంస్థల కోటాలోని 12 స్థానాలకు.. మొత్తం పన్నెండూ గెలుచుకుని దుమ్ము లేపింది. ఇందులో.. ఆరు స్థానాలు ముందుగానే ఏకగ్రీవం అయిన సంగతి తెలిసిందే. ఇవన్నీ టీఆర్ఎస్ ఖాతాలోనే పడ్డాయి. మిగిలిన అరడజను స్థానాలకు.. 10 వ తేదీన ఎన్నిక నిర్వహించారు. వీటన్నింటిని సైతం గెలుచుకుని సత్తా చాటింది గులాబీదళం.

కరీంనగర్ లో కొంత ఉత్కంఠ పరిస్థితి ఉంది. ఇండిపెండెంట్ అభ్యర్థి టీఆర్ఎస్ ను సవాల్ చేయడం.. ఆయనకు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మద్దతు తెలపడంతో.. హుజూరాబాద్ ఫలితం పునరావృతం అవుతుందా? అనే చర్చ సాగింది. కానీ.. ఫలితాలు మాత్రం ఏకపక్షంగానే వచ్చేశాయి. కరీంనగర్ జిల్లాలో రెండు స్థానాలకు ఎన్నిక జరిగింది. ఆ పార్టీ నుండి బరిలో నిలిచిన.. భానుప్రకాశ్ రావు, ఎల్. రమణ విజయం సాధించారు. భానుప్రకాశ్ రావుకు 584 ఓట్లు , ఎల్.రమణకు 441 ఓట్లు పోలయ్యాయి.
ఖమ్మం జిల్లాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలో.. అధికార టీఆర్‌ఎస్ విజయబావుటా ఎగరేసింది. ఇక్కడ గులాబీ పార్టీ తరపున తాత మధు గెలుపు సాధించారు. సమీప ప్రత్యర్థిపై 238 ఓట్ల మెజార్టీతో మధు విజయం సాధించారు. ఇక్కడ కాంగ్రెస్ ఏమైనా ఆధిపత్యం చాటుతుందా? అనే చర్చ సాగినప్పటికీ.. అద్భుతాలేమీ జరగలేదు.
ఆదిలాబాద్ లోనూ టీఆర్ఎస్ అభ్యర్థి విట్టల్ ఘన విజయం సాధించారు. ఇక్కడ మొత్తం 862 ఓట్లు పోలయ్యాయి. ఇందులో.. టీఆర్‌ఎస్ అభ్యర్థికి 740 ఓట్లు వచ్చాయి. సమీప ప్రత్యర్థి, స్వతంత్ర అభ్యర్థి అయిన పుష్కరానికి కేవలం 74 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. దీంతో.. 666 ఓట్ల మెజార్టీతో గులాబీ అభ్యర్థి విట్టల్ ఘన విజయం సాధించారు.
నల్లగొండలో నూ కారు ధాటికి ప్రత్యర్థులు కకావికలమయ్యారు. ఇక్కడ టీఆర్‌ఎస్ అభ్యర్థి కోటిరెడ్డి ఘనవిజయం సాధించారు. మొత్తం.. 1,271 ఓట్లకుగానూ 1,233 ఓట్లు పోలయ్యాయి. 50 ఓట్లు చెల్లనివని అధికారులు తేల్చడంతో.. గెలుపు కోటా 593కు చేరింది. అయితే.. గులాబీ అభ్యర్థి కోటిరెడ్డి ఏకంగా 917 ఓట్లు సాధించారు. స్వతంత్ర అభ్యర్థి నగేష్‌కు మాత్రం 226 ఓట్లే వచ్చాయి.
గులాబీ కంచు కోటగా చెప్పుకునే మెదక్ జిల్లాలోనూ.. కారు జోరు చూపించింది. ఇక్కడ కూడా ఆ పార్టీనే విజయం సాధించింది. టీఆర్‌ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన యాదవరెడ్డి.. 762 ఓట్లు సాధించారు. సమీప కాంగ్రెస్ అభ్యర్థి 238 ఓట్లు మాత్రమే సాధించారు. స్వతంత్ర అభ్యర్థికి కేవలం 6 ఓట్లు మాత్రమే రావడం గమనార్హం. ఈ విధంసా.. స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ సాధించడంతో.. టీఆర్ఎస్ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు.