K. Viswanath: కృష్ణంరాజు, కృష్ణ, చలపతి రావు, జమున…ఇలా టాలీవుడ్ పెద్దలు ఒక్కొక్కరు ఏదో పని ఉందన్నట్టుగా ఈ లోకం విడిచి వెళ్తున్నారు. ఇప్పుడు మరో శిఖరం, మేరు నగ ధీరం తరలిరాని లోకాలకు వెళ్లిపోయింది. ఆ పదాలతో కీర్తించడానికి సందేహించడం లేదు.. సినిమా భ్రష్టు పట్టిపోయిన ఈ రోజుల్లో.. అశ్లీలం, అసభ్యత రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో.. గొప్ప గొప్ప దర్శకులుగా చాలా మంది అవుతున్నవారు ఒక్కసారి విశ్వనాధ్ సినిమాలు చూస్తే తెలుస్తుంది.. కళాత్మకంగా సినిమాలు ఎలా తీయాలో… తెలుగు సినిమాకు గౌరవాన్ని సంపాదించి పెట్టి…శిఖర స్థాయిని అందించిన కే విశ్వనాథ్ కూడా కన్నుమూశారు. కొంతకాలంగా ఆరోగ్యంతో బాధపడుతూ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.

విశ్వనాధ్ వయసు 92 సంవత్సరాలు. ఆయన పూర్తి పేరు కాశీనాధుని విశ్వనాధ్.. గుంటూరు జిల్లా తెనాలిలో పుట్టారు.. మొదట అయినా సౌండ్ రికార్డిస్టు. తర్వాత రచయిత, నటుడు, దర్శకుడు అయ్యాడు.. సాత్వికుడు అయిన ఈయన ఎక్కడ కూడా తన సినిమాలో అవలక్షణాలకు అవకాశం ఇవ్వలేదు.. అలాగని తను తీసినవి సమాంతర సినిమాలు, సినిమాలు కాదు.. సూపర్, బంపర్ హిట్లు.. మంచి సినిమాలకు ఎప్పుడు రోజులు కావని ముందుగానే గ్రహించి, ఆ ప్రయాసను తట్టుకోలేననే తట్టుకోలేననే భావనతో చాన్నాళ్ల క్రితమే దర్శకత్వం మానేశారు.. కొన్నాళ్లుగా పూర్తిగా నటనకే అంకితమయ్యారు.
వాస్తవానికి విశ్వనాధ్ దర్శకత్వ శైలి పూర్తి విభిన్నమైనది.. ఎక్కడ కూడా అసభ్యతకు తావు ఉండదు.. కించిత్ ద్వంద్వార్థం కూడా ఉండదు.. ఆయన సినిమాలన్నీ కుటుంబ నేపథ్యంలో సాగుతాయి.. కొన్ని సామాజిక సమస్యలను ఎత్తిచూపుతూ సాగుతాయి.. ఇలా బతకాలి, ఇలానే ఉండాలి అని ఎక్కడ చెప్పరు..మంచిని, చెడుని మన ముందు ఉంచుతారు.. ఈ నిర్ణయం తీసుకోవాలో మనకే వదిలేస్తారు.. దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని, రఘుపతి వెంకయ్య పురస్కారాన్ని, పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న ఆయన్ని బిరుదులు, పురస్కారాలు కలవలేదు.. చంద్రుడికి ఒక నూలు పోగు అంతే. ఒక స్టూడియోలో మామూలు సౌండ్ రికార్డిస్టుగా జీవితాన్ని మొదలుపెట్టిన ఆయన దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు వద్ద కొన్నాళ్లు అసిస్టెంట్ గా పని చేశాడు.. ఆ తర్వాత సహాయ దర్శకుడు అయ్యాడు.. నాగేశ్వరరావు నటించిన ఆత్మగౌరవం సినిమాకు దర్శకత్వం వహించారు.. ఇది విశ్వనాథ్ తొలి సినిమా.. దీనికి నంది బహుమతి వచ్చింది. తర్వాత తీసిన సిరిసిరిమువ్వ సినిమా విశ్వనాథ్ ను ఎన్నో మెట్లు ఎక్కించింది. ఆ తర్వాత ఆయన వెనుతిరిగి చూసుకోలేదు.

సినిమా అంటేనే రకరకాల యవ్వారాలు ఉంటాయి.. అయినప్పటికీ తన సినిమాల్లో విశ్వనాథ్ ఎక్కడా రాజీ పడలేదు. ఎమోషన్స్ కు, సంగీతానికి, సాహిత్యానికి, నాట్యానికి, ప్రత్యేకించి సంప్రదాయ జీవనానికి పెద్దపీట వేసేవారు.. తాను 60 సినిమాలు తీస్తే వాటిలో శంకరాభరణం మరుపురాని క్లాసిక్.. దానికి జాతీయ పురస్కారం కూడా లభించింది.. ఇదే కాదు, తన అన్ని సినిమాల్లోనూ సంగీతం, సాహిత్యం ఒకదానితో ఒకటి పోటీ పడేవి. స్వర్ణకమలం, స్వాతి కిరణం, సాగర సంగమం, స్వయంకృషి, సప్తపది, శుభలేఖ, ఆపద్బాంధవుడు, శుభసంకల్పం, సిరి వెన్నెల, శృతిలయలు వంటి సినిమాలు తెలుగు సినిమా స్థాయిని పెంచాయి.. ఆ సినిమాలో తీసిన విశ్వనాధ్ కు శిఖర స్థాయిని ఇచ్చాయి.. అంత సినిమాలు మళ్లీ తెలుగులో వస్తాయా? రావు… వస్తే అవి క్లాసిక్స్ ఎందుకు అవుతాయి.. విశ్వనాథ్ వంటి దర్శకుడు మళ్ళీ పుడతాడా? పుట్టడు.. విశ్వనాథ్ ను కన్న తెనాలి జన్మ ధన్యం అయింది.. అతడి పాదం ఓపెన్ టాలీవుడ్ జన్మ ధన్యమైంది.. ఇలా ఎంత రాసినా… ఇంకా కొంత మిగిలి ఉంటుంది. ఉపమానాలకు అందని దర్శకుడు అతడు. ఉపోద్ఘాతాలకు చక్కని మేరు నగ ధీరుడు అతడు.. భాషకు, యసకు, సంస్కృతికి, సాహిత్యానికి పెద్దపీట వేసిన సాహితీ ద్రష్ట అతడు.. వీడ్కోలు దిగ్దర్శక.. ఇక సెలవు మహత్ దర్శక..