Big Sketch BJP In Telangana: తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం తామే అన్నట్లు దూకుడుమీద ఉన్న బీజేపీ ఇదే ఉత్సాహంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల సంగ్రామంవైపు నడవాలని భావిస్తోంది. ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉంది. అయినా ఇప్పటి నుంచే అభ్యర్థుల ఎంపికపై పార్టీ రాష్ట్ర నాయకత్వం కసరత్తు మొదలు పెట్టింది. ప్రస్తుతం బలమైన అభ్యర్థులు ఎవరు, ఎక్కడ పార్టీ బలహీనంగా ఉంది.. ఏ పార్టీ అభ్యర్థిని బీజేపీ తరఫున నిలిపితే గెలుస్తాడు.. తాను గెలవడంతోపాటు మరో ఒకరిద్దరిని గెలిపించుకురాగల సత్తా ఉన్నవారు ఎంతమంది అనే లెక్కలు వేస్తోంది. చేరికలు ఎక్కడెక్కడ ఎక్కువగా ఉండాలనే ప్రణాళిక కూడా రచిస్తోంది. దీంతో అధికార టీఆర్‌ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ కంటే ముందే బీజేపీ అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తం అవుతున్నట్లు కనిపిస్తోంది.

సిట్టింగులకే సీటన్న కేసీఆర్..
తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు వచ్చే ఎన్నికల్లో కూడా సింట్టింగ్ ఎమ్మెల్యేలకే మళ్లీ టికెట్ ఇస్తామని ప్రకటించారు. ఇటీవల ప్రగతిభవన్‌లో పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారిలో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. వచ్చే ఎన్నికల్లోనూ మనమే అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం పనితీరు బాగున్న ఎమ్మెల్యేలందరికీ మళ్లీ టికెట ఇస్తామని ప్రకటించారు. దీంతో గులాబీ బాస్ ఎన్నికలకు ఏడాది ముందే టికెట్లు ప్రకటించిందన్న అభిప్రాయం కూడా పార్టీలో వ్యక్తమవుతోంది.
ఆశావహులకు మొండి చెయ్యేనా?
ఇక మరోవైపు వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ టికెట్ ఆశిస్తూ కాంగ్రెస్, బీజేపీ నుంచి సీనియర్ నాయకులు గతంలోనే టీఆర్‌ఎస్‌లో చేరారు. వీరంతా తమ నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రచారం చేసుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో ఓటర్లతో కలిసి మద్దతు కూడగట్టుకుంటున్నారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. వీరి ఆశలపై నీళ్లు ^è ల్లుతూ కేసీఆర్ ఇటీవలి సమావేశంలో సిట్టింగులకే సీటు అని ప్రకటించారు. దీంతో ఆశావహుల చూపు కాంగ్రెస్, బీజేపీ వైపు మళ్లింది. అయితే ప్రజల్లో ఉంటూనే ఎన్నిల సమయానికి పార్టీ మారాలని భావిస్తున్నారు.
‘పనితీరు బాంగుటేనే’ కదా..?
ఇటీవలి ఎమ్మెల్యేల సమావేశంలో పనితీరు బాగున్న ఎమ్మెల్యేలందరికీ వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తామని ప్రకటించారని కొందరు ఆశావహులు చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల పనితీరు బాగా లేదు కాబట్టే తాము టికెట్ ఆశిస్తున్నామని చెబుతున్నారు. వారినే కొనసాగిస్తే నష్టం తప్పదని పేర్కొంటున్నారు. పనితీరు ఆధారంగా టికెట్ ఇస్తే చాలామంది ఎమ్మెల్యేలు టికెట్ రాదని అంటున్నారు. పరోక్షంగా ఎమ్మెల్యేలు పనిచేయడం లేదని చెబుతున్నారు.
కమలం వ్యూహాత్మకంగా..
ఇక బీజేపీ నాయకులు వచ్చే ఎన్నికలకు వ్యూహాత్మకంగా కదలాలని భావిస్తున్నారు. పార్టీ జాతీయ నాయకత్వం కూడా తెలంగాణపై ప్రత్యేక దృష్టిపెట్టింది. ఈ క్రమంలో పార్టీకి ఇప్పటికే ఇన్‌చార్జి తరుణ్‌చుగ్ ఉన్నప్పటికీ మరో ఇన్‌చార్జిగా సునీల్ బన్సల్‌ను నియమించింది. ఎన్నికల కమిటీని ఏర్పాటు చేసుకుని నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితిపై సమీక్ష చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలాలు, బలహీనతలు తెలుసుకుంటున్నారు. ఎన్నికల నాటికి ఎలా బలోపేతం చేయాలని, ఓటర్లను పార్టీవైపు ఎలా తిప్పుకోవాలో సూచనలు చేస్తున్నారు.
సొంత అభ్యర్థులపై దృష్టి..
బీజేపీ అధిష్టానం వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎంతమంది సిద్ధంగా ఉన్నారని, ఏయే నియోజకవర్గాల్లో పోటీ ఉంది, ఎక్కడ అభ్యర్థి అవసరం అనే వివరాలు రూపొందిస్తున్నారు. అభ్యర్థి అవసరం ఉన్నచోట సొంతపార్టీ వారిని ప్రోత్సహించాలా, ఇతర పార్టీల నుంచి చేరుకోవాలా అనే విషయంపై కూడా సమాలోచనలు చేస్తున్నారు. ఇతర పార్టీల నుంచి కమలంలో చేరేందుకు సిద్ధంగా ఉన్నవారు ఎవరు, వారి బలాలు, బలహీనతలు కూడా తెలుసుకుంటున్నారు. పార్టీలో పోటీ ఇచ్చే అభ్యర్థి లేనిపక్షంలో ఇతర పార్టీల నుంచి చేర్చుకోవాలని నిర్ణయించారు.
అసంతృప్తులకు గాలం..
మరోవైపు అధికార టీఆర్‌ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్‌లో అసంతృప్త నేతల వివరాలతో నియోజకవర్గాల వారీగా బీజేపీ నాయకులు జాబితా రూపొందిస్తున్నారు. పార్టీలో చేర్చుకోవడం వలన పార్టీకి కలిగే ప్రయోజనం ఏంటి.. చేరినవారు పొందే లబ్ధి ఎంత.. తర్వాత పార్టీకి వచ్చే మైలేజ్ ఎలా ఉంటుంది.. క్యాడర్‌ను ఏకం చేయగలడా.. పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేయగలడా.. ఎన్నికల్లో గెలిచిన తర్వాత పార్టీ అధికారంలోకి రాకపోయినా ప్రతిపక్షంలో కూర్చునేందుకు సిద్ధంగా ఉంటాడా అని లెక్కలు వేస్తున్నారు. బలమైన నాయకులను పార్టీలో చేరుకుని పార్టీ ద్వారా లబ్ధి పొందడంతోపాటు, పక్క నియోజకవర్గాల అభ్యర్థులను గెలిపించే సత్తా ఉన్నవారిని ముందుగా పార్టీలో చేర్చుకోవాలని భావిస్తున్నారు.

అధిష్టానానికి చేరికల జాబితా..
ఇక ఇప్పటికే పార్టీలో చేరేందుకు టచ్‌లోకి వచ్చిన టీఆర్‌ఎస్, కాంగ్రెస్ నాయకుల పేర్లను పార్టీ చేరికల కమిటీ అధ్యక్షుడు ఈటల రాజేందర్ పార్టీ కేంద్ర నాయకత్వానికి పంపించారు. ఇందులో వారి అర్హతలు, పార్టీకి కలిగే ప్రయోజనం, ఆర్థిక, వ్యక్తిగత బలాలు, బలహీనతలు, తదితర వివరాలను అధిష్టానం ముందు ఉంచారు. జాబితాలో ఉన్నవారిలో ఎవరిని చేర్చుకోవాలి, ఎవరి సమక్షంలో చేర్చుకోవాలి, వేదిక ఎక్కడ అనే వివరాలతో అధిష్టానం నుంచి కూడా కొంతమంది పేర్లు తిరిగి రాష్ట్ర శాఖకు వచ్చినట్లు తెలిసింది. వీలైనంత ఎక్కువ చేరికలతో అధికార పార్టీకి దీటుగా అభ్యర్థులను బరిలో నిలపాలని అధిష్టానం ఆదేశించింది. మునుగోడు ఉపఎన్నికల తర్వాత చేరికలు వేగవంతమయ్యే అవకాశం కనిపిస్తోంది.