ఫ్రెండ్ షిప్ డే ఈ రోజు ఎలా వచ్చింది.. దాని వెనకున్న చరిత్ర ఏమిటి?

స్నేహానికన్న మిన్న లోకాన లేదురా.. స్నేహమేరా జీవితం.. స్నేహమే శాశ్వతం అన్నారు కవులు. సృష్టిలో ఏ స్వార్థానికి లొంగనిది ఎంత త్యాగానికైనా వెనుకాడనిదే నిజమైన స్నేహం. నీ స్నేహితులెవరో చెప్పు నీవెలాంటి వాడివో చెబుతాను అంటారు. అలాంటి స్నేహితుడంటే ఒక గొప్ప వరం. మంచి స్నేహితుడు దొరకడం కూడా ఓ అదృష్టమే. ఏ రక్త సంబంధం లేకపోయినా మన కోసం తన సర్వస్వాన్ని ఇచ్చే వాడే స్నేహితుడు. ఆపదలో ఆదుకునే వాడే స్నేహితుడు. మంచి పని చేసినప్పుడు […]

Written By: Srinivas, Updated On : August 1, 2021 9:37 am
Follow us on

స్నేహానికన్న మిన్న లోకాన లేదురా.. స్నేహమేరా జీవితం.. స్నేహమే శాశ్వతం అన్నారు కవులు. సృష్టిలో ఏ స్వార్థానికి లొంగనిది ఎంత త్యాగానికైనా వెనుకాడనిదే నిజమైన స్నేహం. నీ స్నేహితులెవరో చెప్పు నీవెలాంటి వాడివో చెబుతాను అంటారు. అలాంటి స్నేహితుడంటే ఒక గొప్ప వరం. మంచి స్నేహితుడు దొరకడం కూడా ఓ అదృష్టమే. ఏ రక్త సంబంధం లేకపోయినా మన కోసం తన సర్వస్వాన్ని ఇచ్చే వాడే స్నేహితుడు. ఆపదలో ఆదుకునే వాడే స్నేహితుడు. మంచి పని చేసినప్పుడు వెన్నుతట్టే నలుగురు స్నేహితులు బాధలో ఉన్నప్పుడు బాధపడే ఆప్తులు లేని వాడు నిజంగా అనాథే. స్నేహానికి ఉన్న గొప్పదనం గురించి వర్ణించడం కష్టమే. ఊహకందని ఓ భావమే స్నేహం అని అంటారు.

ఆగస్టు మాసంలో వచ్చే స్నేహితుల దినోత్సవం కోసం అందరు ఎదురుచూస్తారు. ప్రతి ఏటా ఆగస్టు మొదటి ఆదివారాన్ని ఫ్రెండ్ షిప్ డేగా జరుపుకోవడం ఆనవాయితీ. ఈ రోజు స్నేహితుల దినోత్సవం గురించి ఓ కథ ప్రచారంలో ఉంది. 1935 సంవత్సరంలో అమెరికాలో అప్పటి ప్రభుత్వం ఓ వ్యక్తిని చంపింది. ఆగస్టు మొదటి శనివారం రోజు అతడిని చంపడంతో ఆ మరణవార్త విన్న స్నేహితుడు అతడి మరణాన్ని తట్టుకోలోక ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడని ప్రతీతి. దీంతో ప్రభుత్వం స్పందించి వాళ్ల స్నేహాన్ని గుర్తించి వారి స్నేహం చిరకాలం ఇలాగే ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి ఆదివారం స్నేహితుల దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించారు.

మనకేదైనా జరిగితే రక్తసంబంధీకులైన వారు బాధపడడంలో అర్థం ఉంటుంది. కానీ ఏ సంబంధం లేని స్నేహితుడు తోటి స్నేహితుడికి ఏదైనా జరిగితే తపన పడుతుంటాడు. అదే నిజమైన స్నేహం. జీవితంలో నిజమైన సలహాదారు ఎవరంటే స్నేహితుడే. బాధల్లో ఉన్నప్పుడు వెన్నంటి ఉంటూ మన ఎదుగుదలకు తోడ్పడతాడు. మన ఉన్నతికి నిరంతరం మార్గం చూపే వాడే ఫ్రెండ్. అలాంటి స్నేహాన్ని నిలబెట్టుకోవడం కూడా ఓ సవాలే. ఎందుకంటే ఎలాంటి మనస్పర్థలు లేకుండా చిరకాలం తోడుండేలా మన ప్రవర్తనలో కూడా ఎప్పుడు మార్పు ఉండకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది.

స్నేహానికి నిర్వచనమే లేదు. అది అనంతం. అందనంత దూరం. అందుకోనంత తీరం. అందుకే స్నేహాన్ని ఎవరు కూడా అంత తేలిగ్గా తీసుకోరు. స్నేహానికి సర్వస్వం ధారపోసే వారు కూడా మనకు కనిపిస్తుంటారు. కానీ ఏదో వంకతో మోసం చేసే వారు కూడా ఉండే ఉంటారు. వారిని కూడా మనం జాగ్రత్తగా చూడాలి. స్నేహితుడి హితం కోసం పాటుపడాలి. వారి సంక్షేమమే ధ్యేయంగా నడవాలి. అప్పుడే మన స్వచ్ఛత తెలుస్తుంది. మన విలువకు గుర్తింపు వస్తుంది. స్నేహాన్ని మరిచిపోకూడదు. స్నేహితుడిని విడువకూడదు.