BJP Leaders: తెలంగాణలో టీఆర్ఎస్ కు ధీటైనా పార్టీ ఏదైనా ఉందంటే అది బీజేపీ మాత్రమే. గత కొన్నేళ్లుగా బీజేపీ తెలంగాణలో బలమైన శక్తిగా ఎదుగుతోంది. ప్రజా పోరాటాలు, ఎన్నికల్లో బీజేపీ టీఆర్ఎస్ ను ధీటుగా ఎదుర్కొంటూ కాంగ్రెస్ ను ఇప్పటికే మూడో స్థానానికి పరిమితం చేసింది. ఈక్రమంలోనే 2023లో అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతూ ముందుకు దూసుకెళుతోంది.
2018 ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కేవలం ఒక్క ఎమ్మెల్యే సీటును గెలుచుకుంది. గోషా మహల్ నియోజవకర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా రాజా సింగ్ గెలిచారు. నాటి అసెంబ్లీలో బీజేపీ ప్లోర్ లీడర్ గా రాజాసింగ్ కొనసాగుతున్నారు. నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలతో రాజా సింగ్ వార్తల్లో నిలుస్తుంటారు.
ఇక దుబ్బాకలో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ నుంచి రఘునందన్ రావు గెలుపొందారు. టీఆర్ఎస్, బీజేపీ మధ్య జరిగిన ఉత్కంఠ పోరులో రఘునందన్ సుమారు వెయ్యి ఓట్ల తేడాతో గెలుపొందారు. దీంతో బీజేపీ ఖాతాలో మరో ఎమ్మెల్యే సీటు చేరింది. ఆ తర్వాత టీఆర్ఎస్ లో జరిగిన పరిణామాల నేపథ్యంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవీకి, పార్టీ పదవీకి రాజీనామా చేశారు.
హుజూరాబాద్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ పోటీ చేయగా టీఆర్ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్ యాదవ్ పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో ఈటల రాజేందర్ మరోసారి విజయం సాధించి సత్తా చాటారు. దీంతో బీజేపీ ఎమ్మెల్యేల సంఖ్య మూడుకు చేరింది. ఈ ముగ్గురు నేతలు అసెంబ్లీలో ‘ఆర్ఆర్ఆర్(రాజా సింగ్, రఘునందర్, రాజేందర్)’ పేరుతో పిలువబడుతున్నారు.
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పిలుపు మేరకు వీరంతా కలిసి కట్టుగా పని చేస్తున్నారు. అయితే కొంతకాలంగా ఆపార్టీలో లుకలుకలు మొదలైనట్లు తెలుస్తోంది. తెలంగాణలో పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్ తనను ఆహ్వనించలేదని రఘునందన్ చెబుతున్నారు. ఆహ్వానం లేకుండా వెళ్లి తాను అవమానపడదల్చుకోలేదని అంటున్నారు.
అంతేకాకుంగా మొదటి విడుత పాదయాత్ర మెదక్ లో జరిగితే తనకు కనీసం సమాచారం ఇవ్వలేదని రఘునందన్ ఆరోపిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్లో కార్పొరేటర్లుగా ఎన్నికైన వారిలో తనకు సంబంధించిన వారున్నాయని ఫ్లోర్ లీడర్ పదవీ కూడా ఇవ్వలేదన్నారు. ఈక్రమంలోనే బండి సంజయ్ కు రఘునందన్ మధ్య గ్యాప్ వచ్చినట్లు తెలుస్తోంది.
మరోవైపు రఘనందన్ వచ్చే ఎన్నికల నాటికి టీఆర్ఎస్ చేరి ఎంపీగా పోటీ చేస్తారని ఆయన వ్యతిరేక వర్గం ప్రచారం చేస్తోంది. పట్టుమని ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీలో నేతల మధ్య గ్యాప్ రావడం పార్టీకి చేటుచేసేలా కన్పిస్తోంది. బీజేపీ అధిష్టానం ఈ విషయంలో ఫోకస్ పెట్టకుంటే మాత్రం అసలుకే ఎసరు రాక తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.