Telangana Police: ‘ పోలీస్ నెత్తిన కనిపించే మూడు సింహాలు నీతికి, నిజాయతీకి, ధర్మానికి ప్రతీక అయితే.. కనిపించని నాలుగో సింహమేరా పోలీస్’ ఇది పోలీస్ పౌరుషాన్ని తెలిపే ఓ సినిమా డైలాగ్. నిజానికి పోలీసులు నేరస్తుల పాలిట సింహ స్వప్నాలే. ప్రజల ప్రాణ, మానాలు కాపాడడం.. శాంతిభద్రతల పరిరక్షణ వారి విధి. కర్తవ్య నిర్వహణలో నీతి, నిజాయతీతో పనిచేస్తామని యూనిఫాం వేసుకున్ననాడే ప్రమాణం చేస్తారు. రాగద్వేషం, భయం లేకుండా పనిచేస్తామని ప్రతినబూనుతారు. తెలంగాణ పోలీసుల్లో కొందరు ప్రమాణాలు విస్మరిస్తున్నారు.. కర్తవ్య నిర్వహణలో నీతి, నిజాయతీ, న్యాయం, అన్యాయాలను పట్టించుకోవడం లేదు.. గులాబీ నేతలకు వంగివంగి సలాం చేస్తున్నారు. ప్రజల ప్రాణ, మానాలకు రక్షణ కల్పించాల్సిన అధికార పార్టీ నేతల ఒత్తిడిత భక్షకులుగా మారుతున్నారు. చట్టం తమ చేతుల్లో ఉందని అధికారం చెలాయిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో కొంతమంది పోలీసులు ఆ శాఖకే మాయని మచ్చను తెలుస్తున్నారు. పదోన్నతులు, బదిలీలు, లంచాల కోసం అధికార పార్టీ నేతల చెప్పు చేతల్లో పనిచేస్తూ ప్రజల్లో చులకనవుతున్నారు.
-అధికారపార్టీ నేతలు, బడా బాబులకు కొమ్ము కాస్తూ..
అప్పనంగా వచ్చిన డబ్బులకు ఆశపడి అసలు డ్యూటీని వదిలేస్తున్నారని కొందరు పోలీసు అధికారులపై ఆరోపణలున్నాయి. బాధితులను రక్షించాల్సింది పోయి బడాబాబుల అధికార పార్టీ నాయకులకు కొమ్ముకాస్తూ కోట్లు వెనకేసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి.. చేతిలో ఉన్న పవర్‌తో సామాన్యుడిని భయపెడుతూ, వారి కలలను కల్లలు చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు… చట్టానికి పహారా కాస్తూ సంఘవిద్రోహుల తోకలు కత్తిరించాల్సిన వారు బాధితులకే చుక్కలు చూపుతున్నారని పలు సంఘటనలూ మనకూ కనిపిస్తున్నాయి. తమ ఘనకార్యాలతో పోలీస్‌శాఖకే మాయని మచ్చ తెస్తున్నారు కొందరు..
-లాయర్ దంపతుల హత్య నుంచి..
రెండేళ్ల క్రితం లాయర్ దంపతుల హత్య జరిగిన నాటి నుంచి మొన్న కామారెడ్డిలో సంతోష్, అతని తల్లి సజీవ దహనం వరకు పోలీసులే నేరస్థులనే భావన ప్రజల్లో నెలకొంది. అధికార పార్టీ ఒత్తిడి.. చట్టం తమ చేతిలో ఉందన్న భావనతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న తీరు ప్రజాక్షేత్రంలో వారిని దోషులుగా నిలబెడుతోంది.
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన న్యాయవాద దంపతులు గట్టు వామన్ రావు, నాగమణి హత్య కేసులో పోలీసులు తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. హత్య వెనుక స్థానిక అధికార పార్టీ ప్రజాప్రతినిధి ఉన్నా.. ఆయనను తప్పించారన్న విమర్శలు ఉన్నాయి. ఆయనతో ఉన్న వైరమే ఈ హత్యకు కారణమనేది బహిరంగ రహస్యం, హత్య సమయంలో వామన్‌రావు కూడా పేరు చెప్పినా.. మార్ఫింగ్ అంటూ ఆయనను తప్పించారనే ఆరోపణలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన అధికార పార్టీ కాబట్టి అన్న ఆరోపణలున్నాయి.
-తప్పుడు కేసులు
– మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హత్యకు కుట్ర పేరుతో యాదయ్య, విశ్వనాథ్, నాగరాజును సీపీ స్టీఫెన్ రవీంద్ర అరెస్ట్ చేసి ఓ సంచలనం రేపారు. మంత్రి హత్యకు కుట్ర అయితే ఆధారాలతో సహ ప్రెస్‌మీట్ పెట్టాల్సిన పోలీసులు అవేవీ చూపలేదు. నిందితులను మాత్రం రిమాండ్ చేశారు. విచారణ పేరుతో కస్టడీలోకి తీసుకున్నారు. కానీ ఏమీ తేల్చలేదు. విశేషమేమిటంటే అరెస్ట్ అయిన వారు గతంలో టీఆర్‌ఎస్‌లో పనిచేసినవారే కేవలం మంత్రితో విభేదాలు రావడంతో మంత్రి ఆదేశాల మేరకే పోలీసులు తప్పుడు కేసు పెట్టారన్న ఆరోపణలు ఉన్నాయి.
ఖమ్మం జిల్లాలో బీజేపీ నాయకుడు, భారతీయ మజ్దూర్ సంఘ్ విభాగానికి జిల్లా అధ్యక్షుడు సాయిగణేశ్ ఆత్మహత్యకు పోలీసులే కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్కడి మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ప్రోద్బలంతో పోలీసులు బీజేపీ, కాంగ్రెస్ నేతలపై ఇష్టానుసారం కేసులు పెడుతున్నారు. రౌడీషీట్ ఓపెన్ చేస్తున్నారని, పీడీ యాక్ట్ నమోదు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. సాయిగణేశ ఆత్మహత్యకు పోలీసుల కేసులే ప్రధాన కారణం. టీఆర్‌ఎస్ ఖమ్మం నేతల వేధింపులు, పోలీసులు వరుసగా కేసులు నమోదు చేయడం.. రౌడీషీట్ తెరవడం.. తాను ఏర్పాటు చేసుకున్న పార్టీ గద్దెను, జెండాను కూల్చేయడం లాంటివి తాను ఆత్మహత్యకు పాల్పడడానికి కారణాలుగా పేర్కొంటూ సాయిగణేష్ డెత్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. తనపై పోలీసులు పదహారు కేసులు పెట్టి, రౌడీ షీట్ తెరచి నిత్యం వేధింపులకు పాల్పడ్డారని పేర్కొన్నారు.
– మెదక్ జిల్లా రామాయంపేటకు చెందిన గంగు సంతోష్, అతని తల్లి పద్మ కామారెడ్డిలోని ఓ లాడ్జీలో సజీవ దహనమయ్యారు. వాళ్లిద్దరి చావుకు పరోక్షంగా రాజకీయశక్తులు, అధికారులేనని చనిపోయే ముందు తమ మరణ వాంగ్మూలాన్ని సెల్ఫీ వీడియో రూపంలో చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తన వ్యాపారం భాగస్వామ్యం కోసం స్థానికంగా పలుకుబడి ఉన్న అధికార పార్టీ నేతలు, రామాయంపేట సీఐగా చేసి ట్రాన్స్ ఫర్ అయిన నాగార్జునగౌడ్‌తో పాటు మరికొందరు కీలక నేతల పేర్లను అందులో పొందుపర్చారు. రామాయంపేట మున్సిపల్ చైర్మెన్ పల్లే జితేందర్‌గౌడ్, సీఐ నాగార్జునగౌడ్‌తోపాటు మరో ఐదుగురు వ్యక్తులు దాదాపు తమను 18నెలలుగా టార్చర్ పెడుతున్నారని..ఆర్ధికంగా, మానసికంగా తీవ్రంగా బాధించడమే కాకుండా వ్యాపారంలో వాటా కోసం తమను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని వీడియోలో పేర్కొన్నారు.
– శాంతి భద్రతల పరిరక్షణకు లా అండ్ ఆర్డర్ ను పర్యవేక్షించాల్సిన పోలీసులు, అందులోని లా వదిలేసి కేవలం ఆర్డర్లు మాత్రమే వేస్తున్నారు. యూనిఫాం ఉందనే అహంకారంతో ఇష్టారీతిగా వ్యవహారిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.. కబ్జాదారులకు, రియల్టర్లకు వత్తాసు పలుకుతున్నారు. సంబంధం లేకున్నా సివిల్ వివాదాల్లో తల దూరుస్తూ సామాన్యులను ఇబ్బందులు పెడుతున్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ కోట్లు గడిస్తున్నారు. వసూళ్లకే అధిక ప్రాధాన్యం ఇస్తూ విధుల్ని గాలికొదిలేస్తున్నారన్న ఆరోపణలున్నాయి.
-భూ కబ్జాలలో జోరుగా జోక్యం..
చాలా మంది పేదలు పైసాపైసా పోగేసి పిల్లల అవసరాల దృష్ట్యా తక్కువ ధరలకు భూములు కొనుగోలు చేస్తున్నారు. కొన్ని సంవత్సరాల్లోనే వాటి ధరలు అమాంతం పెరగడంతో రియల్టర్లకు కళ్లు కుట్టి వాటిని ఆక్రమించుకుంటున్నారు. రెక్కాడితే డొక్కాడని కష్టజీవులు ఏళ్లకు ఏళ్లు కోర్టుల చుట్టూ తిరిగే స్థోమత లేక న్యాయం కోసం పోలీసులను ఆశ్రయిస్తున్నారు. బాధితుల కన్నీటిని పెట్టుబడిగా భావించే రక్షకభటులు రియల్టర్లకు మచ్చికై, వారిచ్చే ఆఫర్లతో కోట్లకు పడగలెత్తుతున్నారు. పేదలకు న్యాయం చేయకపోగా వారి కలలను కాల రాస్తున్నారన్న ఆరోపణలున్నాయి.. ప్రత్యేక రాష్ట్రం అనంతరం తెలంగాణ సర్కార్ ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని తీసుకొచ్చినా, మన పోలీసుల్లో కొందరి ప్రవర్తన మాత్రం మారడం లేదని బాధితులు వాపోతున్నారు.
ఇవి కొన్ని మాత్రమే బయటకు రాని అనేక ఘటనలు తెలంగాణలో జరుగుతున్నాయి. కేవలం అధికార పార్టీ నేతలకు నాలుగో సింహం తల వండచమే ఇందుకు కారణం. వరుస ఘటనలతో తెలంగాణ పోలీసులపై ప్రజలకు విశ్వాసం సన్నగిల్లుతోంది. ఇప్పటికైనా గులాబీ నేతలకు గులాంగిరీ మానేకోకపోతే.. భవిష్యత్‌లో పోలీసులపై ప్రజల తిరుగుబాటు తప్పదని ప్రతిపక్ష నాయకులు హెచ్చరిస్తున్నారు.
Also Read:CM Jagan Chiranjeevi: సీఎం జగన్ డిమాండ్స్ కి నో చెప్పిన మెగాస్టార్ చిరంజీవి.


