Telangana Elections 2023: తెలంగాణ ఎలక్షన్స్‌.. ఊపు ఊపిన సోషల్‌ ప్రచారం.. ఏ పార్టీ ఎంత ఖర్చు చేసిందో తెలుసా?

సోషల్‌ మీడియా ప్రచారంలో నేతల ఊకదంపుడు ఉపన్యాసాలుంటేనే సరిపోదు. జనంలోకి దూసుకెళ్లే స్థాయిలోనే కంటెంట్‌లో దమ్ముండాలి. అయితే ఇక్కడ నేతల డిజిటల్‌ క్యాంపెయినింగ్‌పైనా ఎన్నికల సంఘం నజర్‌ ఉంటుంది.

Written By: Raj Shekar, Updated On : November 28, 2023 3:25 pm

Telangana Elections 2023

Follow us on

Telangana Elections 2023: వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌.. జనాలకు ఇదొక నిత్య వ్యవహారం. కానీ, రాజకీయ పార్టీలకు, నేతలకు మాత్రం అవసరాన్ని బట్టి వాడకంగా మారింది. ప్రత్యేకించి ఎన్నికల సమయంలో ఇది వాళ్లకు అత్యంత ప్రాధాన్యమిచ్చే అంశం. 2014 నుంచి సోషల్‌ మీడియా వినియోగం పెరుగుతూ వస్తోంది. 2018లో ఎన్నికల్లో కీలకపాత్ర పోషించింది. తాజాగా కూడా సోషల్‌ మీడియా ప్రచారం అభ్యుర్థుల గెలుపోటముల్లో కీలకంగా మారింది. త్వరగతిన ప్రజలకు చేరాలంటే సోషల్‌ మీడియాను మించిన వేగవంతమైన వేదిక వాళ్లకు మరొకటి కనిపించడం లేదు మరి. అందుకే.. అన్ని మాధ్యమాల్లో ఈసారి ఎన్నడూ లేనంతంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమరానికి ఊపు తెచ్చింది సోషల్‌ మీడియా. దీంతో అన్ని పార్టీలతోపాటు అభ్యర్థులు కూడా సోషల్‌ మీడియా కోసం భారీగా ఖర్చు చేశారు.

పార్టీల పేరుతోనే ఎక్కువ..
సోషల్‌ మీడియా ప్రచారంలో నేతల ఊకదంపుడు ఉపన్యాసాలుంటేనే సరిపోదు. జనంలోకి దూసుకెళ్లే స్థాయిలోనే కంటెంట్‌లో దమ్ముండాలి. అయితే ఇక్కడ నేతల డిజిటల్‌ క్యాంపెయినింగ్‌పైనా ఎన్నికల సంఘం నజర్‌ ఉంటుంది. అభ్యర్థుల ఖర్చు పరిమితి రూ.40 లక్షలు దాటకూడదని ఎన్నికల సంఘం మార్గదర్శకాలు ఉన్నాయి. కాబట్టి తమ ప్రచార ఖర్చులన్నింటిలోనే సోషల్‌ మీడియా నిర్వహణ కూడా ఉండేలా చూసుకోవాలి. వ్యక్తిగత ఖాతాల నిర్వహణ.. వాటి కోసం ఎంత మంది పని చేస్తున్నారు.. వాళ్ల జీతభత్యాలు, ఇతర ఖర్చుల వివరాలు.. నేతల ప్రసంగాల్లో ఈసీ కోడ్‌ ఉల్లంఘనలు ఏమైనా ఉన్నాయా?.. నిశిత పరిశీలన ఉండాలి. అదే.. ఎన్నికల నిబంధనల్లో ఎక్కడా పార్టీల ఖర్చు పరిమితిపై ఆంక్షలు లేవు. దీంతో నేతల పేర్ల ప్రస్తావన తేకుండా.. పార్టీలను గెలిపించాలంటూ ప్రధానంగా సోషల్‌ మీడియా ప్రచారం ఉవ్వెత్తున సాగింది.

సోషల్‌ మీడియా ఫాలోవర్లే ఎక్కువ..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి 29 ఏళ్ల లోపు ఓటర్లు 72 లక్షల మంది ఉన్నట్లు ఎన్నికల సంఘం గణాంకాలు చెబుతున్నాయి. దాదాపు 10 లక్షల మంది 18–19 వయసులో(కొత్త ఓటర్లు) ఉన్నవాళ్లు ఉన్నారు. ఇక 30పైబడిన వాళ్లలోనూ సామాజిక మాధ్యమాలలో టైంపాస్‌ బాపతు ఎక్కువే ఉన్నారు. వీళ్లను ఆకట్టుకునే ప్రయత్నంలో భాగంగానే.. ఇలాంటి పేజీలను పొలిటికల్‌ పార్టీలు తమ ఆధీనంలోకి తీసుకుని ఉంటాయనేది స్పష్టంగా తెలుస్తోంది.

అత్యధికంగా బీఆర్‌ఎస్‌ ఖర్చు..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం రాష్ట్రంలో అధికార బీఆర్‌ఎస్‌ అత్యధికంగా రూ.10.7 కోట్లు ఖర్చు చేసింది. ప్రభుత్వ పథకాలు, రామక్క, బలగం సినిమా నటులు, సోషల్‌ మీడియా మెంటర్లు, యూట్యూబర్లు, మై విలేజ్‌షో, పెయిడ్‌ ఇంటర్వ్యూలు ఇలా అన్నీ కలిపి వందలాది ప్రకటనలను బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా బేస్‌గా డంప్‌ చేసింది. కేవలం 26 రోజుల్లోనే ఇంత భారీగా ప్రకటనలకు వెచ్చించింది. ఇది విపక్ష కాంగ్రెస్, బీజేపీ కన్నా చాలా ఎక్కువ.

కాంగ్రెస్‌ 4.12 కోట్లు..
ఇక బీఆర్‌ఎస్‌ను పోటాపోటీగా ఢీకొంటున్న విపక్ష కాంగ్రెస్‌ కూడా గులాబీ పార్టీ ప్రచారానికి ఏమాత్రం తగ్గకుండా ఖర్చు పెట్టింది. ముఖ్యంగా సోషల్‌ మీడియా ప్రచారానికి రూ.91 లక్షలు, ప్రింట్, ఎలక్ట్రానిక్‌ మీడియాల్లో ప్రకటనలకు మరో రూ.3 కోట్ల వరకు ఖర్చు చేసింది. మొత్తం 150 ప్రకటనలు రూపొందించింది. ఒక్క ఫేస్‌బుక్‌ కోసమే కాంగ్రెస్‌ రూ.92 లక్షలు కేటాయిచింది. గూగుల్‌ ప్రకటలకు కూడా రూ.8 కోట్లు వెచ్చించింది. అయితే ఇదంతా 90 రోజులకు చేసిన ఖర్చు.

బీజేపీ చాలా తక్కువ..
ఇక తెలంగాణలో బీజేపీ కూడా సోషల్‌ మీడియా ప్రకటనకు ఖర్చు చేసింది. కానీ, బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌తో పోలిస్తే అది చేసిన ఖర్చు చాలా తక్కువే. సోషల్‌ మీడియా ప్రకటల కోసం బీజేపీ 90 లక్షల రూపాయల వరకు వెచ్చించింది. ఇక ప్రింట్, ఎలక్ట్రానిక్, గూగుల్‌ ఆయడ్స్‌ కోసం కూడా భారీగానే ఖర్చు చేసింది. ఇందుకు సుమారుగా రూ.4 కోట్ల వరకు వెచ్చించినట్లు తెలుస్తోంది.

ఈ మూడు పార్టీలే కాకుండా, బీఎస్పీ, జనసేనతోపాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా సోషల్‌ మీడియా ప్రచారం కోసం తమకు ఉన్నంతలో ఖర్చు చేశారు. దీంతో తెలంగాణ ఎన్నికల పుణ్యానా ఈసారి సోషల్‌ మీడియాకు భారీగా ఆదాయం మాత్రం సమకూరింది. మరి ఏ పార్టీకి లబ్ధి కలుగుతుంది. ఏ పార్టీ నష్టపోతుందో డిసెంబర్‌ 3న తెలుస్తుంది.