Telangana Election Results 2023: మొయినాబాద్ ఫామ్ హౌస్ బ్యాచ్ మొత్తం ఓడిపోయింది

మునుగోడు ఉప ఎన్నికలు గుర్తున్నాయి కదా.. అప్పట్లో భారతీయ జనతా పార్టీ భారత రాష్ట్ర సమితి మధ్య హోరాహోరీగా పోరు జరిగేది. లిక్కర్ స్కాం ను తెరపైకి రావటం, అందులో కవిత పేరు ప్రముఖంగా వినిపించడం, అరెస్టు చేస్తారని ప్రచారం చేయడంతో అప్పట్లో బిజెపి, భారత రాష్ట్ర సమితి మధ్య ఒక రకమైన యుద్ధ వాతావరణం నెలకొంది.

Written By: Anabothula Bhaskar, Updated On : December 3, 2023 5:34 pm

Telangana Election Results 2023

Follow us on

Telangana Election Results 2023: ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికార భారత రాష్ట్ర సమితి సృష్టించిన అడ్డంకులను ఎదుర్కొని తెలంగాణ ఇచ్చిన పార్టీగా తొలిసారిగా జయకేతనం ఎగిరేసింది. డిసెంబర్ 9న రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయనుంది. అయితే ఈ విజయం ఏకపక్షంగా సాగలేదు. అధికార భారత రాష్ట్ర సమితి అంత సులభంగా కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని ఇవ్వలేదు. ఉమ్మడి నల్లగొండ, వరంగల్, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాల్లో కాంగ్రెస్ గాలి బలంగా వీచింది. ముఖ్యంగా నల్లగొండ, ఖమ్మం జిల్లాలో ఏకంగా 20 సీట్ల వరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుచుకున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయాల్లో ఇవి మాత్రం ప్రత్యేకంగా నిలిచిపోయాయి. అవి ఏంటంటే..

అందరూ ఓడిపోయారు

మునుగోడు ఉప ఎన్నికలు గుర్తున్నాయి కదా.. అప్పట్లో భారతీయ జనతా పార్టీ భారత రాష్ట్ర సమితి మధ్య హోరాహోరీగా పోరు జరిగేది. లిక్కర్ స్కాం ను తెరపైకి రావటం, అందులో కవిత పేరు ప్రముఖంగా వినిపించడం, అరెస్టు చేస్తారని ప్రచారం చేయడంతో అప్పట్లో బిజెపి, భారత రాష్ట్ర సమితి మధ్య ఒక రకమైన యుద్ధ వాతావరణం నెలకొంది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ కి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆయన భారతీయ జనతా పార్టీలో చేరడంతో మునుగోడు ఉప ఎన్నికలు వచ్చాయి. మునుగోడు లో రాజగోపాల్ రెడ్డి గెలిచే సూచనలు ఉండడంతో కెసిఆర్ సరికొత్త నాటకానికి తెరలేపారని అప్పట్లో ప్రచారం జరిగింది. భారత రాష్ట్ర సమితికి చెందిన (వీరంతా కాంగ్రెస్ పార్టీ మీద గెలిచారు) ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, పైలట్ రోహిత్ రెడ్డి, గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్ రెడ్డి ని కొనుగోలు చేసేందుకు కొంతమంది స్వామీజీలు బేరానికి వచ్చారని, వారంతా కూడా బిజెపికి చెందిన వారిని అప్పట్లో ప్రచారం జరిగింది. దీనిని సాకుగా చూపిస్తూ కేసీఆర్ సెంటిమెంట్ ఎగదోసే ప్రయత్నం చేశారని అప్పట్లో ఆరోపణలు వినిపించాయి. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలోనూ కేసీఆర్ ఇదే ప్రధాన అంశంగా విమర్శలు చేశారు. అది జనాల్లో బాగా క్లిక్ అవడంతో మునుగోడు ఉప ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి విజయం సాధించింది. ఆ తర్వాత ఆ కేస్ కోల్డ్ స్టోరేజ్ లోకి వెళ్ళింది.

మీడియాలో ట్రోల్స్

ఇక ఈ మొయినాబాద్ ఎపిసోడ్ లో ఉన్న నలుగురు ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో ఓడిపోయారు. కాంతారావు, బాలరాజు, హర్షవర్ధన్ రెడ్డి, రోహిత్ రెడ్డి భారత రాష్ట్ర సమితి నుంచి పోటీ చేయగా.. వారు తమ సమీప కాంగ్రెస్ అభ్యర్థుల చేతిలో ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం వారి ఓటమి పట్ల సానుభూతి కంటే ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తం కావడం విశేషం. నాడు మొయినాబాద్ ఫామ్ హౌస్ లో ఏమీ జరగకపోయినప్పటికీ కొనుగోలు నాటకానికి తెరలేపారని.. ఇప్పుడు నిజంగానే ఆ నాటకంలో పావులై ఓడిపోయారని సోషల్ మీడియాలో ట్రోల్స్ వెల్లువెత్తుతున్నాయి.