Telangana Election Results 2023: బీజేపీ అధ్యక్ష మార్పుకి కారణమైన అందరూ ఓటమి!

బండి సంజయ్‌ను అధ్యక్షుడిగా తప్పించడంలో హుజూరాబాద్‌ ఎమ్మెల్యే, బీజేపీ ఎన్నికల కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు, నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ కీలకంగా వ్యవహరించారని పార్టీలో అంతర్గత చర్చ జరిగింది.

Written By: Raj Shekar, Updated On : December 3, 2023 2:12 pm

Telangana Election Results 2023

Follow us on

Telangana Election Results 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు నెలల క్రితం వరకు దూకుడుగా కనిపించిన బీజేపీ.. కర్ణాటక ఎన్నికల తర్వాత పూర్తిగా చతికిలబడింది. కర్ణాటకలో ఓటమి, బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్‌ను తప్పించడంతో పార్టీ గ్రాఫ్‌ వేగంగా పడిపోయింది. ఎన్నికల షెడ్యూల్‌ నాటికి బీజేపీ అభ్యర్థుల కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంతకుముందు బండి సంజయ్‌ సారథ్యంలో పార్టీలో చేరేందుకు ఇతర పార్టీల నాయకులు పోటీ పడ్డారు. కానీ, కొంతమంది ఒత్తిడి మేరకు బీజేపీ బండి సంజయ్‌ను తప్పించింది. కిషన్‌రెడ్డిని అధ్యక్షుడిగా నియమించింది. దీంతో సీఎం కేసీఆర్‌ సూచన మేరకు బీజేపీ బండిని తప్పించిందన్న అభిప్రాయం ఒకవైపు.. కొత్తగా పార్టీలోకి వచ్చినవారు చేసిన ఒత్తిడికి కమలం అధిష్టానం తలొగ్గిందని పార్టీలో అంతర్గతంగా చర్చ జరిగింది. ఇక, ఇప్పుడు ఎన్నికల ఫలితాలు చూస్తుంటే.. ఇదే నిజమనిపిప్తోంది. బండి సంజయ్‌ను అధ్యక్షుడిగా తప్పిండంలో కీలకంగా వ్యవహరించిన నాయకులు ఇప్పుడు ఓడిపోతున్నారు.

ఓటమి బాటలో ఆ ముగ్గురు..
బండి సంజయ్‌ను అధ్యక్షుడిగా తప్పించడంలో హుజూరాబాద్‌ ఎమ్మెల్యే, బీజేపీ ఎన్నికల కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు, నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ కీలకంగా వ్యవహరించారని పార్టీలో అంతర్గత చర్చ జరిగింది. సంజయ్‌ను తప్పిచడంపై అధిష్టానం నిరాసక్తి చూపినా.. ఈ ముగ్గురు నాయకులు అధిష్టానాన్ని బ్లాక్‌మెయిల్‌ చేశారని, బండిని తప్పించకుంటే తాము తప్పుకుంటామని అల్టిమేటం జారీ చేశారని సమాచారం. ఈ క్రమంలో వారి ఒత్తిడికి తలొగ్గిన కమలం అధిష్టానం.. చివరకు బండిని తప్పించింది. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని అధ్యక్షుడిగా నియమించింది. తాజాగా ఎన్నికల్లో బండిని తప్పించడంలో కీలకంగా వ్యవహరించిన ముగ్గురు నాయకులు ఓడిపోతున్నారు. ఇప్పటికే దుబ్బాకలో రఘునందన్‌రావు ఓడిపోయారు. కొత్త ప్రభాకర్‌రెడ్డి విజయం సాధించారు. ఇక రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసిన ఈటల రాజేందర్, హుజూరాబాద్, గజ్వేల్‌లో వెనుకంజలో ఉన్నారు. ఇక నిజామాబాద్‌ ఎంపీగా ఉన్న అర్వింద్, ఈసారి కోరుట్ల అసెంబ్లీ నుంచి పోటీ చేశారు. ఆయన కూడా ప్రస్తుతం వెనుకంజలో ఉన్నారు. ఇక్కడ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి స్వల్ప మెజారిటీలో ఉన్నారు.

మొత్తంగా సిట్టింగ్‌ ఎమ్మెల్యేలుగా ఉండి, బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్‌ని తప్పించడంలో కీలకంగా వ్యవహరించిన ఈటల, రఘునందన్‌రావు ఓడిపోవడంతో, ప్రజలే ఇలాంటి తీర్పు ఇచ్చారని, బండిని తప్పించిన పాపం తగిలిందని బీజేపీ నేతలు గుసగుసలాడుతున్నారు.