
Team India : కోట్లాది భారతీయులు ఇష్టపడే ఆట క్రికెట్. భారత క్రికెటర్లను అభిమానులు దేవుళ్లలా కొలుస్తారు. టీం ఇండియా గెలుపు తమ గెలుపుగా భావిస్తారు. ఇంతటి అభిమానులు ఉన్న టీం ఇండియా కూడా క్రికెట్‌లో అందరి అంచనాలకు తగ్గట్టుగానే రాణిస్తోంది. అభిమానుల అంచనాను వమ్ము చేయకుండా శక్తివంచన లేకుండా పోరాడుతుంది. ఈ పోరాట ఫలితంగా ఇండియా క్రికెట్ చరిత్రలో మరో రికార్డు హిస్టరీ రిపీట్ అయింది. తాజాగా ఐసీసీ ప్రకటించిన క్రికెట్ ర్యాంకుల్లో టెస్ట్, వన్డే, టీ20 ఫార్మట్లతో భారత క్రికెట్ జట్టు నంబర్ వన్ స్థానంలో నిలిచింది. మూడు ఫార్మాట్లలో భారత జట్టు నంబర్ వన్ స్థానంలో నిలవడం ఇది రెండోసారి.
నాడు ధోనీ కెప్టెన్సీలో..
నాడు జార్ఖండ్ డైనమైట్‌గా క్రికెట్ అభిమానులు పిలుచుకునే మహేద్రసింగ్ ధోనీ నాయకత్వంలో టీం ఇండియా ఇలాగే మూడు ఫార్మట్లలో మొదటి స్థానంలో నిలిచింది. తాజాగా రోహిత్‌శర్మ నాయకత్వంలో హిస్టరీ రిపీట్ చేసింది. తర్వాత కోహ్లీ కెప్టెన్సీలో కూడా చాలా కాలం అదే స్థాయిని కొనసాగించింది. అయితే కోహ్లీ ఫామ్ కోల్పోయిన తర్వాత ఒక్కో ఫార్మాట్లో నెమ్మదిగా భారత్ ర్యాంకు దిగజారింది. తాజాగా రోహిత్ కెప్టెన్సీలో భారత జట్టు హిస్టరీ రిపీట్ చేస్తుందని, అన్ని ఫార్మాట్లలో మళ్లీ నంబర్ వన్ జట్టుగా నిలుస్తుందని అందరూ అంచన వేశారు. మాజీ లెజెండ్ క్రికెటర్ వసీం జాఫర్ ఈమేరకు ప్రకటన కూడా చేశాడు. రోహిత్ నాయకత్వంలో త్వరలోనే టీం ఇండియా అన్ని ఫార్మట్లలో నంబర్ వన్‌కు చేరుకుంటుందని తెలిపాడు. అన్నట్లుగానే రోహిత్ సారథ్యంలోనే మూడు ఫార్మట్లలో టీం ఇండియా ఈ ఫీట్ మళ్లీ సాధించింది.
ఢోకా లేని పొట్టి ఫార్మాట్..
రోహిత్ కెప్టెన్ అయిన తర్వాత మళ్లీ భారత జట్టు పుంజుకుంది. టీ20ల్లో వరుసగా విజయాలు సాధించింది. దీంతో నంబర్ వన్ ర్యాంకును చేరుకుంది. టీ20 వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించిన తర్వాత రోహిత్ ఈ ఫార్మాట్ ఆడకపోయినా.. హార్ధి్దక్ నేతృత్వంలో కూడా భారత జట్టు వరుసగా సిరీసులు గెలుస్తూనే వస్తోంది. దీంతో టీ20ల్లో భారత్ ర్యాంకు మారలేదు. అగ్రస్థానంలోనే కొనసాగుతూ వచ్చింది. ఇక వన్డేల్లో భారత్ కొంత వెనుకంజ వేసింది. అదే సమయంలో వరుసగా సిరీసులు నెగ్గిన న్యూజిల్యాండ్ అగ్రస్థానానికి ఎగబాకింది.
తాజాగా వన్డేల్లోనూ నంబర్‌వన్..
భారత్ పర్యటనకు వచ్చే ముందు న్యూజిల్యాండే వన్డేల్లో టాప్ టీం. అయితే టీమిండియా చేతిలో వరుసగా రెండు మ్యాచులు ఓడిపోవడంతో ఆ జట్టు ర్యాంకు పడిపోయింది. ఇంగ్లండ్ జట్టు అగ్రస్థానానికి చేరింది. మూడు జట్ల మధ్య అగ్రస్థానం కోసం పోటీ ఉంది. కివీస్‌పై మూడో వన్డే కూడా భారత్ గెలిచి సిరీస్ క్లీన్ స్వీప్ చేయడంతో టీమిండియా వన్డేల్లో అగ్రస్థానానికి చేరింది.
ఆసీస్‌పై విజయంతో టెస్టులోనూ..
ఆస్ట్రేలియాతో గవాస్కర్ – బోర్డర్ సిరీస్‌ను విజయతో ప్రారంభించిన భారత జట్టు నాలుగు టెస్టుల సిరీస్‌లో ప్రస్తుతం 1–0తో ముందజలో ఉంది. దీంతో మొదటి స్థానంలో ఉన్న ఆసీస్ జట్టును వెనక్కి నెట్టి టెస్టు ఫార్మాట్లో కూడా భారత్ నంబర్ వన్‌గా నిలిచింది.
ఈ ర్యాంకులు తాత్కాలికమే అయినా.. మూడు ఫార్మాట్లలో రెండుసార్లు నంబర్‌వన్‌గా నిలిచిన జట్టుగా టీమిండియా రికార్డు సృష్టించింది. టీమిండియా సాధించిన ఈ ఫీట్‌ను క్రికెట్ అభిమానులు ఎంజాయ్ చేస్తున్నారు.