
TDP 41 Years: తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి నాలుగు దశాబ్దాలు దాటుతోంది. 41వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటోంది. తెలుగు వారి ఆత్మగౌరవం పేరిట ఎన్టీఆర్ ఏర్పాటుచేసిన టీడీపీ చరిత్రను తిరగరాసింది. తొమ్మిది నెలల్లోనే దశాబ్దాల కాంగ్రెస్ ను మట్టికరిపించింది. అనతికాలంలోనే అధికారం చేపట్టింది. దేశంలో ప్రాంతీయ పార్టీలకు మార్గం చూపింది.అయితే ఓ ప్రాంతీయ పార్టీ ఇంత కాలం మనగలగడమే అద్భుతం . అందులో టీడీపీ పయనం మరింత ప్రత్యేకం. ఎన్నో సవాళ్లు, సంక్షోభాలు ఎదుర్కొని ఎప్పటికప్పుడు తట్టుకుంది. కిందపడుతూ..పైకిలేస్తూ వస్తోంది. 2004 తరువాత వరుసగా రెండుసార్లు ఓటమితో టీడీపీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంది. మళ్లీ ధైర్యం పోగుచేసుకొని పోరాడడంతో 2014లో అధికారంలోకి రాగలిగింది. 2019 ఎన్నికల్లో దారుణ పరాజయం తర్వాత చాలా మంది టీడీపీ నేతలే… ఇక పార్టీ ఉంటుందా అన్న ఆందోళన చెందారు. కానీ ఇప్పుడు టీడీపీ మళ్లీ అధికారంలోకి వచ్చేస్తుందన్నంత ధీమాగా ఉన్నారు. ఈ 41వ ఆవిర్భావం టీడీపీలో కొత్త జోష్‌తో జరుగుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల రూపంలో వచ్చిన సెమీస్‌లో గెలిచిన ఉత్సాహం… ప్రజల్లో కనిపిస్తున్న మార్పుతో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది.
రాజకీయ పునరేకీకరణ..
తెలుగుదేశం సంక్షోభాల పార్టీ. ఎన్నో ఎత్తు పల్లాలను చూసింది. 1983లో దివంగత ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. తెలుగువారి ఆత్మాభిమానం పేరిట, కాంగ్రెస్ దురాగతాలకు వ్యతిరేకంగా ఎన్టీఆర్ రాజకీయ పార్టీ స్థాపించినప్పుడు రాష్ట్రంలో రాజకీయ పునరేకీకరణ ప్రారంభమైంది. కాంగ్రెస్ మార్కు రాజకీయాలు, పాలనతో విసిగి వేశారిన ప్రజలు, చివరకు నాయకులు సైతం టీడీపీని బలంగా సపోర్టు చేశారు. ఎంతోమంది బడుగు, బలహీన వర్గాలకు చెందిన నాయకులు, సమాజంలో వివిధ రంగాల్లో సేవచేస్తున్న వారు టీడీపీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేసి సక్సెస్ అయ్యారు. నాదేండ్ల భాస్కరరావు రూపంలో సంక్షోభం ఎదురైనా ఎన్టీఆర్ అధిగమించగలిగారు. కానీ చంద్రబాబు రూపంలో ఎదురైన సవాల్ ను ఎదుర్కొనలేకపోయారు. అయితే చంద్రబాబు సైతం పార్టీని సమర్థవంతంగా నడపగలిగారు. ప్రాంతీయ పార్టీ వరుసగా రెండు సార్లు ఓడిపోతే ఇక ఆ పార్టీ చరిత్రలో కలిసిపోవడమే. ఇప్పటికే ఎన్నో పార్టీలు అలా కలిసిపోయాయి. కానీ టీడీపీ మాత్రం వరుసగా రెండు సార్లు ఓడినా అత్యంత ఘోర పరాజయాలు చవి చూసినా ఎప్పటికప్పుడు ప్రజల అభిమానాన్ని చూరగొని అధికారంలోకి వస్తూనే ఉంది.
ప్రాంతీయ పార్టీలకు దిక్సూచి…
దేశంలో ప్రాంతీయ పార్టీలకు టీడీపీ దిక్సూచిలా నిలిచింది. జాతీయ పార్టీలకు ధీటుగా ఎలా ఎదగాలో నేర్పింది. ప్రస్తుతం ప్రాంతీయ పార్టీల చేతిలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంతో ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయంగా తలపడుతున్నాయి కూడా. అయితే మూడు దశాబ్దాల కిందట ఢిల్లీ పెత్తనాన్ని ఎన్టీఆర్ గట్టిగా ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో చాలారకాలుగా మూల్యం చెల్లించుకున్నారు. ఒక విధంగా చెప్పాలంటే చంద్రబాబు రూపంలో ఎన్టీఆర్ ఎదురైన సంక్షోభానికి ఇదే కారణం. నాడు ఎన్టీఆర్ ను పదవీవిచ్యుతుడ్ని చేయడంలో చంద్రబాబుకు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సహాకారం అందించింది. జాతీయ స్థాయిలో టీడీపీ ఎంతగా చక్రం తిప్పిందో… రాజకీయ ఆటుపోట్లకు అవే ఢిల్లీ రాజకీయాలే కారణంగా నిలిచాయి. 2019 ఎన్నిలకు ముందు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని ఢీకొట్టి చంద్రబాబు దారుణ పరాజయాన్ని మూటగట్టుకున్నారు. అయితే చంద్రబాబు టీడీపీని తన చేతిలోకి తీసుకున్న తరువాత సంక్షోభాలను అధిగమించి రెండుసార్లు అధికారంలోకి తీసుకురాగలిగారు. తాను పెట్టిన పార్టీ తనతోనే అంతమవుతుందని అప్పట్లో ఎన్టీఆర్ అన్నారు కానీ.. టీడీపీ ఇప్పటికీ గట్టిగా నిలబడి పోరాడుతూనే మధ్యలో టీడీపీ పదేళ్లు అధికారానికి దూరమయింది.

విజయం వరిస్తే తిరుగేలేదు..
తెలుగుదేశం తెలుగు వారి పార్టీగా ముద్రపడింది. కానీ ప్రస్తుతం ఏపీకే పరిమితమైంది. తెలంగాణలో ఉనికి కోసం ఆరాటపడుతోంది. రాష్ట్ర విభజన తరువాత ఏపీలో ఐదేళ్లు అధికారంలో ఉన్నా 2019లో దారుణ పరాజయం. నాలుగేళ్లు అష్టకష్టాలు పడి ఇప్పుడు మళ్లీ పార్టీ గాడిలో పడింది. ఎమ్మెల్సీ ఎన్నికల విజయాల తర్వాత ఆ పార్టీలో ఉత్సాహం రెట్టింపు అయ్యింది. . తెలంగాణలోనూ కార్యక్రమాలు ఉద్ధృతం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో అధికారంలోకి వస్తే టీడీపీ గురించి సువర్ణ అక్షరాలతో లిఖించవచ్చు. అయితే చంద్రబాబు తరువాత ఎవరు? అన్న ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకడం లేదు. కుమారుడు లోకేష్ రాజకీయ పరిణితి పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో బిజీగా ఉన్నారు. అయితే టీడీపీకి నాయకత్వంతో పనిలేదని.. పార్టీయే నాయకుడ్ని తయారుచేసుకుంటుందన్న నమ్మకాన్ని ఆ పార్టీ శ్రేణులు వ్యక్తం చేస్తున్నారు. 41వ పడిలో పడిన తెలుగుదేశం పార్టీ మున్మందు ఎన్ని విజయాలు సొంతం చేసుకుంటుందో? సవాళ్లను ఎదుర్కుంటుందో చూడాలి మరీ.