
Sri Chaitanya Student : ఇప్పుడు అంతా కాంపిటీషన్.. ర్యాంకుల వేట.. అందుకే తల్లిదండ్రులు ఇల్లు జాగలు అమ్మి మరీ తమ కొడుకుల భవిష్యత్ కోసం మంచి విద్యాసంస్థల్లో చేర్పిస్తున్నారు. లక్షలు పోసి చదివిస్తున్నారు. కానీ ఆ సంస్థలు కాసుల కక్కుర్తిలో పడి ర్యాంకుల కోసం విద్యార్థులను చావబాదుతున్నాయి. రక్తం వచ్చేలా కొడుతున్నాయి. ఆ ఒత్తిడి భరించలేక విద్యార్థులు చనిపోతున్న పరిస్థితి నెలకొంది. తాజాగా తెలంగాణలోని శ్రీచైతన్య కాలేజీకి చెందిన విద్యార్థిని ఆత్మహత్య ఘటన సంచలనమైంది. ఈ సంఘటన శ్రీచైతన్య కళాశాలలోని నార్సింగి బ్రాంచ్‌లో చోటుచేసుకుంది. బాధితుడు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న సాత్విక్‌గా గుర్తించారు.
శ్రీచైతన్య కాలేజీలో ఇదే సాత్విక్ అనే విద్యార్థిని చదవడం లేదని క్లాసులోనే వైస్ ప్రిన్సిపల్ రక్తం వచ్చేలా కొట్టాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది. విద్యార్థులు తీసిన వీడియోలో ఆ రక్తాన్ని విద్యార్థుల చేతనే తుడిపించడం షాకింగ్ గా ఉంది. అందరి ముందే రక్తం వచ్చేలా కొట్టడంతో ఈ అవమానాన్ని.. ఒత్తిడిని తట్టుకోలేకనే సాత్విక్ తన తరగతి గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. ఫ్యాన్‌కు వేలాడుతున్న సాత్విక్‌ను గుర్తించిన వెంటనే సమీప ఆసుపత్రికి తరలించడంలో కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని మీడియాలో కథనాలు వస్తున్నాయి.
సాత్విక్ అకాల మరణంతో ఆగ్రహించిన అతని తల్లిదండ్రులు , కళాశాల విద్యార్థులు కళాశాల ప్రవేశం ముందు నిరసనకు దిగారు. పోలీసులు రంగంలోకి దిగి సాత్విక్ ఆత్మహత్యపై కేసు నమోదు చేశారు. కళాశాల వైస్ ప్రిన్సిపాల్ , రెసిడెన్షియల్ హాస్టల్‌లోని వార్డెన్ పై సెక్షన్ల కింద కేసు బుక్ చేశారు. ఆత్మహత్య ఘటనపై విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.
కాగా ఇదివరకే సాత్విన్ ను గతంలో ఇదే శ్రీచైతన్య అధ్యాపకులు కొట్టడంతో ఆస్పత్రి పాలయ్యాడు. తర్వాత 15 రోజుల పాటు కోలుకొని మళ్లీ హాస్టల్ లో చేరాడు. మరోసారి రక్తం వచ్చేలా కడుపులో చెంపపై ఇష్టానుసారంగా కొట్టడంతోనే రక్తం కక్కుకున్నాడని సమాచారం. అనంతరం గదిలో వేసి లాక్ చేశారని.. ఈ అవమానంతోనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డట్టు సమాచారం.
ఇంతటి అమానుషంగా ప్రవర్తించిన ప్రిన్సిపల్ ను, అధ్యాపకులను ఉరితీయాలని విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. శ్రీచైతన్య క్యాంపస్ లోకి వెళ్లి ఆందోళన చేస్తున్నాయి. విద్యార్థిని కొట్టిన అధ్యాపకుడిని దొరికితే పచ్చడి చేసేలా ఉన్నాయి. అధ్యాపకుల టార్చర్ విద్యార్థుల ప్రాణాలు తీస్తోందని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు.
ఈ మధ్య కాలంలో తెలంగాణలో విద్యార్థులకు సంబంధించి కొన్ని అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకున్నాయి. ర్యాగింగ్‌కు వ్యతిరేకంగా చర్యలు , పరీక్షల సమయంలో ఒత్తిడిని నిర్వహించడం వంటి కొన్ని విషయాలు, ప్రతి పాఠశాల , కళాశాలలో అవసరం. ఒత్తిడిని తట్టుకోలేక విద్యార్థులు క్షణికావేశంలో జీవితాలను ముగించుకుంటున్నారు.