
AP Capital Issue: ఏపీ రాజధానుల వ్యవహారంలో మరో ట్విస్ట్,. అమరావతి రాజధానిపై అత్యున్నత న్యాయస్థానంలో వాదనలు జరగక ముందే తనకు అనుకూలంగా అఫిడవిట్ దాఖలు చేసే చాన్స్ ను రాష్ట్ర ప్రభుత్వం దక్కించుకుంది. 2014లో రాష్ట్ర విభజన సరిగ్గా జరగలేదని సుప్రీం కోర్టులో 28 వరకూ పిటీషన్లు దాఖలయ్యాయి. సుమారు పదేళ్లు సమీపిస్తుండడంతో పిటీషన్లకు కదలిక వచ్చింది. విచారణ చేపట్టాలని కోర్టు నిర్ణయించింది. దీనిపై అఫిడవిట్లు దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి అత్యున్నత న్యాయస్థానం కోరింది. దీంతో విభజన లోపాలు, ప్రత్యేక హోదా, పోలవరం వంటి అంశాల్లో ఉన్న లోటుపాట్లపై స్పష్టమైన నివేదిక తయారుచేసి అత్యన్నత న్యాయస్థానంలో పొందుపరిచే అవకాశం ఉంది. పనిలోపనిగా రాజధాని మార్పుపై కూడా ప్రస్తావించే చాన్స్ ఉన్నట్టు ప్రచారం సాగుతోంది.
అమరావతే ఏకైక రాజధాని అంటూ హైకోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. దీనిని సవాల్ చేసేందుకు ఏపీ సర్కారుకు అనుమతిచ్చినా కౌంటర్ పిటీషన్ దాఖలు చేయడంలో జగన్ సర్కారు తీవ్ర జాప్యం చేస్తూ వస్తోంది. రెండోసారి కూడా ప్రతికూల తీర్పు వస్తుందని భావించి.. రకరకాల కారణాలు చూపుతూ తాత్సారం చేసింది. కొద్దినెలల కిందటే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. కానీ విచారణ జరగడం లేదు. తొలుత జనవరి 30న విచారణ జరుగుతుందని ఆశించినావాయిదా పడింది. ఫిబ్రవరి 23కు వాయిదాపడినా.. అప్పటికీ ఎటువంటి విచారణ జరగలేదు. మార్చి 27న మరోసారి విచారణ చేపడతామని చెప్పినా..అప్పటికీ విచారణ ప్రారంభంకావడం టౌటే. దీంతో జగన్ సర్కారు కోర్టు తీర్పుతో పనిలేకుండా విశాఖలో క్యాంప్ ఆఫీసు ప్రారంభించాలన్న యోచనలో ఉన్నారు.
సరిగ్గా ఇటువంటి తరుణంలో విభజన పిటీషన్లు కోర్టు విచారణ ముందుకు రావడం వైసీపీ సర్కారుకు కలిసొచ్చే అంశం. 2014లో రాష్ట్రాల విభజన సరిగ్గా జరగలేదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, జేడీ లక్ష్మీనారాయణ, జయప్రకాష్ నారాయణ, రఘురామక్రిష్ణంరాజు వంటి వారు సుప్రిం కోర్టులో పిటీషన్లు దాఖలు చేశారు. కానీ ఏళ్ల తరబడి పిటీషన్లు విచారణకు రాలేదు. ఇప్పుడు పదేళ్లు సమీపిస్తుండడంతో సుప్రీం కోర్టు పెండింగ్ కేసులపై దృష్టిపెట్టింది. అయితే తెలుగు రాష్ట్రాలు కలిసిపోయే చాన్స్ లేకున్నా.. అప్పట్లో జరిగిన తప్పిదాలు సరిచేసుకునే చాన్స్ ఉంది. అయితే రాజధానుల ఎంపికలో తప్పును చూపే విధంగా వైసీపీ సర్కారు అఫిడవిట్ దాఖలు చేసే చాన్స్ ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.

అయితే ఒకసారి రాజధాని నిర్ణయం జరిగిపోయాక దానిని మార్చే చాన్స్ ఉండదు. పైగా నాడు విపక్ష నేతగా ఉన్నప్పుడు అమరావతి రాజధానికి జగన్ సమ్మతించారు. ఈ నేపథ్యంలో నాటి తప్పిదాలలో రాజధానిని చేర్చినా ఫలితముండదన్న వాదన ఉంది. పైగా చట్టబద్ధంగా అమరావతి రాజధానిని ఎంపిక చేసినట్టు ఇటీవల కేంద్ర ప్రభుత్వం సైతం సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఇటువంటి తరుణంలో ఏపీ సర్కారు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం ఉండదని తెలుస్తోంది. కానీ వైసీపీ సర్కారు తాజా అఫిడవిట్ చాన్స్ లో ఎక్కువగా రాజధాని ఇష్యూపై కాన్సంట్రేట్ చేసే చాన్స్ ఉన్నట్టు ప్రచారం సాగుతోంది.