scientists who died result their work : సృజనాత్మకతకు అంతం లేదు. ఆవిష్కరణలే ఈ ప్రపంచాన్ని నడిపించాయి. ఆదిమ మానవుడు చక్రాన్ని కనిపెట్టలేకపోతే ఇప్పుడీ యంత్రాలు మనకు ఉండేవి కావు. వాహనాలు మన చెంత చేరేవి కావు.. సైకిల్ నుంచి మొదలుపెట్టి ఇప్పటి విమానం వరకూ ఎంతో మంది తమ బుర్రకు పదునుపెట్టి రూపొందించినవే.. ప్రపంచ గతినే మార్చిన ఆవిష్కరణలకు తోడ్పడినవారు. కానీ వారి విషయంలో విధి చిత్రమైన రాత రాసింది. ఎన్నో గొప్ప ఆవిష్కరణలు చేసిన వారిని అవే బలి తీసుకుంది. ఇలాంటి కొందరు శాస్త్రవేత్తలు, వారి పరిశోధనలు ఏమిటో తెలుసుకుందాం.

-సైకిల్ నుంచి బైక్ ను తయారు చేసిన విలయం నీల్సన్
120 ఏళ్ల కిందట జనాలు కాలినడకన వెళ్లేవారు. ఎంతో వ్యయప్రయాసలు ఎదుర్కొనేవారు. అప్పుడే సైకిల్ పుట్టుకొచ్చింది. ఈ క్రమంలోనే అమెరికాకు చెందిన జనరల్ ఎలక్ట్రిక్ కంపెనీ ఉద్యోగి విలయం నీల్సన్ సరికొత్త ఆవిష్కరణ చేశాడు. పెట్రోల్ తో నడిచే చిన్నపాటి ఇంజిన్ మోటార్ ను అభివృద్ధి చేసి మోటార్ సైకిల్ (బైక్)ను తయారు చేశాడు. కొన్ని సార్లు బాగానే టెస్ట్ డ్రైవ్ చేశాడు. కానీ 1903 అక్టోబర్ లో ఇలానే మరోసారి తను తయారు చేసిన మోటార్ సైకిల్ ను టెస్ట్ చేస్తూ పడిపోయి చనిపోయాడు.

-రేడియేషన్ కనిపెట్టి దానికే బలైన మేరి క్యూరీ
కొత్త మూలకాలపై పరిశోధనలు చేసిన శాస్త్రవేత్త మేరిక్యూరీ చివరకు దానికే బలయ్యారు. రేడియం, పోలోనియం మూలకాలతోపాటు అణుధార్మికత (రేడియేషన్)ను గుర్తించారు. దీనికి నోబెల్ బహుమతి అందుకున్నాడు. చివరకు ఆ మూలకాల రేడియేషన్ కారణంగా అప్లాస్టిక్ ఎనీమియా వ్యాధికి గురై 1934లో చనిపోయారు.

-రాకెట్ టెక్నాలజీ ఆవిష్కర్త బలయ్యారిలా..?
అంతరిక్షంలోకి ఇప్పుడు ఈజీగా వెళుతున్నామంటే అదంతా నాటి శాస్త్రవేత్త చేసిన కృషియే. రాకెట్ టెక్నాలజీని అభివృద్ధిలో కీలక పాత్ర వహించిన ఆస్ట్రియాకు చెందిన మాక్స్ వాలియర్ రాకెట్ ఇంజిన్లపై చేసిన ప్రయోగ ఫలితమే నేటి అంతరిక్షయానాలు. 19వ శతాబ్దంలో జర్మన్ స్పేస్ ఫ్లైట్ సొసైటీని స్థాపించి నాడు మాక్స్ వాలియర్ బృందం రాకెట్ టెక్నాలజీకి పురుడుపోశాడు. ఆ రాకెట్ ఇంజిన్ తో తయారు చేసిన కారును టెస్ట్ డ్రైవ్ చేస్తూ అది పేలిపోయి మాక్స్ వాలియర్ చనిపోయారు.

-టైటానిక్ ను నిర్మించిన థామస్ నీట మునిగి మృతి
ప్రపంచ ప్రఖ్యాత టైటానిక్ విలాసవంతమైన భారీ నౌకను డిజైన్ చేసి ఆర్కిటెక్ట్ బృందం ఇన్ చార్జి థామస్ ఆండ్రూ చివరకు అది మునిగిపోయినప్పుడు చనిపోయారు.
-రక్తమార్పిడి గుట్టు తేల్చి ప్రాణాలు కోల్పోయాడు..
ఏదైనా గాయమై రక్తం కారితే 100 ఏళ్ల కిందట ప్రాణాలు దక్కేవి కావు. ఆ రక్తం ఎక్కించడాన్ని పరిశోధించిన రష్యాకు చెందిన అలెగ్జాండర్ బొగ్దనోవ్ అనే డాక్టర్ ప్రపంచానికి కొత్త మార్గం చూపించాడు. 1925లో రక్త మార్పడిపై పరిశోధనలు చేశాడు. 1928లో మలేరియా, టీబీ సోకిన ఓ రోగి రక్తాన్ని తాను ఎక్కించుకున్నాడు. తన రక్తాన్ని ఆ రోగికి ఎక్కించాడు. ఆ రోగి కోలుకున్నా.. డాక్టర్ బొగ్డనోవ్ మాత్రం చనిపోయాడు. ఈయన పరిశోధనలు రక్తమార్పిడికి కొత్త ఆవిష్కరణలకు దారితీశాయి.
ఇలా కొత్త ఆవిష్కరణలకు ఎవరూ ముందుకు రాకుంటే తామంత తామే ముందుకొచ్చి వాటికి తొలి ప్రయోగదారుగా మారి వారి ప్రాణాలే అర్పించిన శాస్త్రవేత్తలు ఎందరో ఉన్నారు. వారి త్యాగఫలితమే నేడు మనం అనుభవిస్తున్న ఈ సౌకర్యాలు.. సదుపాయాలు.. వారికి మనం అందరం రుణపడాల్సిన అవసరం ఉంది.